అశోక్ కుమార్ కోరాలత్
‘‘మొదటి నుంచీ నాకు డైరెక్టర్ కావాలనే ఉండేది. ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్‌గా బిజీ అయ్యాక డైరెక్షన్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాత సినిమాలు తగ్గడం.. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ రొటీన్‌గా అనిపించడంతో దర్శకత్వం చేయాలని ఫిక్స్ అయ్యా’’ అని డైరెక్టర్ అశోక్ కుమార్ కోరాలత్ అన్నారు. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. ఈ చిత్రంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆశా అశోక్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా అశోక్ కుమార్ కోరాలత్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ కావాలనుకున్న తర్వాత చాలామంది హీరోలు, నిర్మాతలను కలిశాను కానీ వర్కవుట్ కాలేదు. దీంతో నేనే ఓ మంచి సినిమా తీయాలని ఫిక్స్ అయి సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ‘మౌనమే ఇష్టం’ కథని బయటి నిర్మాతలకు చెప్పలేదు. మా సొంత బ్యానర్‌లోనే తీశాం. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. ప్రేమ, కుటుంబం.. ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమ కథలకు ఎప్పటికీ అంతం లేదు. ఎవరి శైలిలో వారు వ్యక్తం చేసుకోవచ్చు. కానీ కాలానుగుణంగా చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి.
ప్రేమను వ్యక్తపరచడానికి ఒక జంట మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రకథ. హీరో పాత్రకి చాలామందిని ఆడిషన్స్ చేశా. కానీ నచ్చలేదు. సాయి కార్తీక్ నటన చూసి, ఈ పాత్రకి కరెక్ట్ అని తీసుకున్నా. హీరోయిన్ పార్వతిది కేరళ. రెండు మూడు మలయాళీ, కన్నడ సినిమాలు చేసింది. తెలుగులో ఆమెకు ‘మౌనమే ఇష్టం’ తొలి సినిమా. హీరో గ్రాండ్ ఫాదర్ పాత్ర నాజర్‌గారు చేశారు. ఈ పాత్రకి ఆయన తప్ప వేరెవరూ నా మదిలో మెదలలేదు. డైరెక్షన్ చేయడం అన్నది కచ్చితంగా కష్టమే.
సరైన లొకేషన్స్ కోసమే చిత్రీకరణ లేట్ అయింది. రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, ఎస్.గోపాల్‌రెడ్డి, ఛోటా కె.నాయుడు, శ్యాం ప్రసాద్‌రెడ్డి, ‘జెమిని’ కిరణ్‌గార్లు ‘మంచి సినిమా చూసిన ఫీల్ అవుతున్నాం’ అని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాని డబ్బుల కోసం తీయలేదు. థియేటర్స్ నుంచి బయటికొచ్చే ప్రేక్షకులు మంచి ఫీల్‌తో వస్తే చాలు. కొన్ని కథలు రెడీ చేస్తున్నారు. నాకు మంచి స్కోప్ ఉండే సినిమా వస్తే ఆర్ట్ డైరెక్టర్‌గా చేయడానికి రెడీ’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment