కవిపురపు జగన్నాథరావు
‘పితా’ అంటూ ‘రెండు రెళ్లు ఆరు’లో అందరినీ నవ్వులలో ముంచారు. ‘నమస్కారవండయ్యా! నమస్కారవండయ్యా!’ అంటూ ‘సాగర సంగమం’లో బావి గట్టు మీద నవ్వులు పూయించారు. ఇక ‘చంటబ్బాయ్’లో పత్రిక ఎడిటర్‌గా శ్రీ లక్ష్మి కవితలను ప్రచురించలేక, బంగాళా భౌభౌ తినలేక ఆయన నవ్వించిన నవ్వులు అన్నీ ఇన్నీ కాదు. ఆయన పొట్టి ప్రసాద్.తెలుగు హాస్యంలో గట్టి ప్రసాద్. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు ఆయన సినీ ప్రయాణం సుదీర్ఘమైనది. ఆ తండ్రి గురించి ఎన్నో జ్ఞాపకాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని∙ ఏకైక కుమారుడు కవిపురపు జగన్నాథరావు సాక్షితో పంచుకున్నారు.
నాన్నగారు కృష్ణాజిల్లా ఆటపాకలో 1929 జనవరి 5న జన్మించారు. నాన్నగారి అసలు పేరు కవిపురపు ప్రసాదరావు. ఆయన కొద్దిగా పొట్టిగా ఉండటం వల్ల అందరూ పొట్టిప్రసాద్ అనేవారు. ఆ పేరే స్థిరపడిపోయింది. అందరూ ఆ పేరుతోనే గుర్తిస్తారు. నాన్నగారు సినిమాలలోకి వచ్చిన కొత్తలో టైటిల్స్‌లో ప్రసాద్ అనే ఉండేది. అమ్మ పేరు రాజ్యలక్ష్మి. వాళ్లది కృష్ణా జిల్లా కైకలూరు. నాన్నగారికి నేను ఒక్కడినే అబ్బాయిని. నా భార్య పేరు శారద. నాకు ఇద్దరు పిల్లలు. రాజేశ్వర ప్రసాద్, శ్రీరాజ్ఞి. నేను పుట్టటానికి ముందు ఒక ఆడపిల్ల పుట్టి పోయిందట. అందుకని నాన్నగారు ఆడపిల్లలను చూసి మురిసిపోయేవారు.
కవిపురపు ప్రసాదరావు (పొట్టి ప్రసాద్)
మేనత్తగారే పెంచారు...
మాది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. నాన్న చిన్నతనంలోనే బామ్మ పోవటంతో ఆయన మేనత్త మైనంపాటి కామేశ్వరమ్మ ఆ లోటు తెలియకుండా కన్నతల్లిలా పెంచారు. క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆవిడంటే మా తాతగారితో సహా ఇంట్లో అందరికీ హడలు. నాన్నగారు బి.కాం వరకు చదువుకున్నారు. నాటకాలలో గిరీశం పాత్రలో ప్రసిద్ధులైన కె. వెంకటేశ్వరరావు గారి రస సమాఖ్యలో నాటకాలు వేసేవారు. అది వాళ్ల మేనత్తగారికి ఇష్టం ఉండేది కాదు. ఆవిడకు తెలియకుండా గోడ దూకి వెళ్లి, మళ్లీ ఆవిడ చూడకుండానే గోడ దూకి వచ్చేసేవారట. ఇలా నాటకాలలో వేషం వేస్తూ, జీవితంలో ఆర్థికంగా స్థిరపడరేమోనని, పెళ్లి చేసేయాలనుకున్నారట తాతగారు. మేనత్తగారికి ఇష్టం లేకుండానే నాన్నగారికి పెళ్లి చేసేశారట. ఈ విషయాలు మా వాళ్లంతా మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను.
సినిమాల కోసం...
1958లో నాన్నగారు నటించిన ఆకాశరామన్న నాటకం చూసి నిర్మాత చక్రపాణిగారు నాన్నగారిని వచ్చి కలవమన్నారు. సరేనని నాన్న ఎలాగో కష్టపడి మద్రాసు వెళ్లారు. ‘అప్పు చేసి పప్పు కూడు’ చిత్రంలో పెళ్లి కొడుకు వేషం వేశారు. అది నాన్నగారు నటించిన మొదటి సినిమా. ఆ తరవాత ఎల్. వి. ప్రసాద్ గారికి దగ్గర నెలవారీ జీతానికి పనిచేశారు. ఎక్కువ అవకాశాలు రాకపోవటంతో, మళ్లీ వెనక్కి వచ్చేద్దామనుకున్నారట. ఆ సమయంలో జె. వి. రమణమూర్తి సహాయపడ్డారట. పూజాఫలంలో నాన్న పెద్ద పాత్ర వేశారు. మళ్లీ సినిమాలలో ఇబ్బంది వచ్చి నాటకాలు వేయటం ప్రారంభించారు.
పొట్టి ప్రసాద్ భార్య, కొడుకు, కోడలు, మనుమలు
నిత్యం బంధుమిత్రులు..
చెన్నైలో నుంగంబాకంలో అద్దెకు ఉండేవాళ్లం. అమ్మ తరఫున చుట్టాలు ఎక్కువ. నాన్నగారు అందరితోనూ చాలా స్నేహంగా ఉండేవారు. అందువల్ల నాన్నగారికి స్నేహితులు ఎక్కువ. మా ఇంట్లో నిత్యం సంతర్పణ సాగేది. చిడతల అప్పారావు, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు అందరూ భోజనానికి వచ్చేవారు. కొన్నాళ్ల తరవాత సాలగ్రామంలో స్థలం కొనుక్కున్నాం. మా పక్కనే సాక్షి రంగారావు గారు కూడా కొన్నారు. రెండు కుటుంబాల మధ్య గోడలు ఉండేవి కాదు. అంత కలసిమెలసి ఉండేవాళ్లం. నాన్నగారికి భక్తి ఎక్కువ. పండుగలు బాగా చేసేవారు. దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లు ఉండేది. అంత వైభవంగా చేసేవారు.
నాన్నగారు చాలా స్ట్రిక్ట్...
నాన్నగారు నా చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఆయనలా నేను ఇబ్బందులు పడకూడదని, చదువును నిర్లక్ష్యం చేయకూడదని తాపత్రయపడ్డారు. తొమ్మిదో తరగతి దాకా నాకు చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. పరీక్షల్లో ఫెయిలయ్యేవాడిని. పరీక్ష పేపర్లు ఇచ్చేరోజున నాకు చాలా దడగా ఉండేది. నా మార్కులు చూసి, నాన్నగారు కోపంగా, నా చేతిలో నుంచి పుస్తకాలు తీసుకుని విసిరేసేవారు. సెంట్రల్ సిలబస్ వల్ల చదవలేకపోతున్నానేమోనని, స్టేట్ సిలబస్ కోసం కేసరి స్కూల్‌లో చేర్పించారు. పదోతరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. నాన్నగారు నమ్మలేదు. పదకొండు, పన్నెండు తరగతుల్లో కూడా మార్కులు బాగా వచ్చాయి. బి. కామ్ పూర్తి చేశాను. ఎం.కామ్ మధ్యలోనే ఆపేశాను.
సినిమాలకు దూరంగా...
నాన్నగారికి నేను సినిమా ఫీల్డ్‌లోకి రావటం ఇష్టం లేదు. మా ఇంటికి ఎవరైనా సినిమా వాళ్లు వచ్చినప్పుడు, నేను అక్కడ నిల్చుంటే కళ్లెర్రచేసేవారు.
సంగీతమే ప్రాణం
నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. కాని నాన్నగారికి ఇష్టం లేదు. ఒకసారి నాన్న తన స్నేహితులతో కలిసి మా ఇంటి హాల్లో కూర్చుని పాటలు వింటూ, నన్ను రూమ్‌లో కూర్చుని చదువుకోమన్నారు. నా దృష్టంతా సంగీతం మీదే ఉండటంతో, ఆయన మీద కోపంగా ఉండేది. ఒకసారి కీబోర్డు కొనిపెట్టమని నాన్నగారిని అడిగాను. ఆయన నో చెప్పారు. నేను మొండివాడిని కావటంతో, పేచీ పెట్టి, సాధించుకున్నాను. నా పద్ధతి చూసి, ‘నీకు కొడుకు పుడితేనే కాని, నేను ఎందుకు బాధ పడుతున్నానో నీకు తెలియదురా’ అనేవారు.
కంపెనీ ఉద్యోగిగా..
నాన్నగారు నా కోసమని ఆయనకు తెలిసిన ఎం.ఎస్.మూర్తిగారి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లమంటే వెళ్లాను. అక్కడ వారు అడిగిన ప్రశ్నలకు చాలా తిక్కగా సమాధానాలు చెప్పాను. వాళ్లు పదిరోజుల తరవాత చెప్తామన్నారు. ఇంక రాదంతే అనుకున్నాను. కాని పిలుపు వచ్చింది. మొదటినెల జీతం వెయ్యి రూపాయలు వచ్చింది. నాన్నకు ఇస్తుంటే, ‘నాకెందుకు? నువ్వే జాగ్రత్తగా ఖర్చు చేసుకో’ అన్నారు. అయినా నాలో పెద్దగా మార్పు రాలేదు. ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే సంగీత సాధనకు వెళ్లిపోయేవాడిని. ఒకరోజు... నాన్నకు ఒంట్లో బాగులేదని థమ్‌గారి ద్వారా కబురు వచ్చింది. ఇంటికి వచ్చి చూసేసరికి ఆయనకు స్ట్రోక్ రావటంతో, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను.
నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న తువ్వాలు కట్టుకుని సింపుల్‌గా ఉండేవారు. ఆర్భాటంగా కనిపించటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయనకు విల్‌పవర్ ఎక్కువే. సిగరెట్ మానేయాలనుకున్నప్పుడు వెంటనే మానేశారు. దాని బదులు జర్దా అలవాటు చేసుకున్నారు. ఆ తరవాత అది మానేసి ముక్కుపొడుం మొదలుపెట్టారు. ఆ తరవాత అది కూడా మానేయాల నుకున్నారు. మానేశారు. నాన్నగారు ఉన్నన్ని రోజులు ఆయన మంచితనం తెలియలేదు. 1998 ఫిబ్రవరి 23న నాన్నగారు కన్నుమూశాక, ఆయన నా గురించి ఎందుకు బాధపడ్డారో అర్థమైంది.
– కవిపురపు జగన్నాథరావు
పదిరోజులు ఆసుపత్రిలో ఉన్నారు. గొంతు పాడైపోయింది. అప్పటికి నాన్నగారి చేతిలో ఐదారు సినిమాలున్నాయి. 400 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన నాన్నగారు మాట్లాడలేకపోయేసరికి ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. రెండేళ్ల పాటు వైద్యం చేయించిన తరవాత నాన్నగారికి మాట వచ్చింది. కాని సినిమాలు తగ్గిపోయాయి. మళ్లీ 1998లో నాన్నగారు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. ఫిబ్రవరి 23న తన నవ్వులను దేవలోకంలో పూయించడానికి తరలి వెళ్లిపోయారు.నాన్నగారు పోయినప్పుడు గొల్లపూడి మారుతీరావుగారు, ‘పూర్ణానంద సత్రంలో పొట్టి ప్రసాద్ వేస్తున్న నాటకాన్ని, ఒక మామూలు సంచి భుజాన వేసుకుని, గేటు బయట నుంచి చూశాను. అప్పట్లో నాటకాలకు అంత ఆదరణ ఉండేది’ అని రాశారు.
– సంభాషణ: డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment