సినిమా రివ్యూ: రారా...కృష్ణయ్య
సినిమా రివ్యూ: రారా...కృష్ణయ్య
Published Fri, Jul 4 2014 3:54 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
నటీనటులు:
సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, జగపతి బాబు, కళ్యాణి, రవిబాబు, చలపతిరావు, తాగుబోతు రమేశ్, తనికెళ్ల భరణి
సంగీతం: అచ్చు రాజమణి
ఫోటోగ్రఫీ: శ్రీరాం
నిర్మాత: వంశీ కృష్ణ శ్రీనివాస్
కథ, దర్శకత్వం: మహేశ్ బాబు.పి
ప్లస్ పాయింట్స్:
రెజీనా
ఫోటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
సెకండాఫ్ లో స్లో నేరేషన్
క్లైమాక్స్
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో ఆకట్టుకున్న సందీప్ కిషన్, రొటీన్ లవ్ స్టోరి 'ఫేం' రెజీనా కాంబినేషన్ లో నూతన దర్శకుడు మహేశ్ బాబు.పి రూపొందించిన చిత్రం 'రారా...కృష్ణయ్య'. కిడ్నాప్ నేపథ్యంగా ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం జూలై 4 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్, రెజీనాలతో, దర్శకుడు మహేశ్ బాబు రూపొందించిన కిడ్నాప్ డ్రామా ఏ మేరకు పండిందో తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే.
వంశ పారంపర్యంగా చేస్తున్న దందాను కొనసాగించడం ఇష్టంలేక తన అన్నయ్య జగ్గు భాయ్ (జగపతిబాబు)కు దూరంగా వెళ్లి మాణిక్యం (తనికెళ్ల భరణి) అనే ట్రావెల్స్ వ్యాపారి వద్ద డ్రైవర్ పనిచేస్తుంటాడు కిట్టూ అలియాస్ కృష్ణయ్య(సందీప్ కిషన్). తాను నమ్మిన మాణిక్యం కిట్టూని మోసగిస్తాడు. తనకు జరిగిన మోసానికి జీర్ణించుకోలేని కిట్టూ.. తండ్రి కుదుర్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని మాణిక్యం కూతురు నందూ(రెజీనా)ను కిడ్నాప్ చేస్తాడు. నందూని కిడ్నాప్ చేసిన తర్వాత కృష్ణయ్య జీవితంలో ఏలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కృష్ణయ్య కుటుంబం చేసే దందా ఏమిటి? నందూ, కృష్ణయ్యల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందా? ఈ కిడ్నాప్ కథలో, తమ్ముడి ప్రేమ వ్యవహారంలో జగ్గూ భాయ్ పాత్రేంటి అనే ప్రశ్నలకు సమాధానమే 'రారా...కృష్ణయ్య' చిత్రం.
నటీనటుల ఫెర్ఫార్మెన్స్:
కృష్ణయ్య పాత్రలో సందీప్ కిషన్ పర్వాలేదనిపించాడు. పాత్రకు ఉన్న పరిమితి కారణంగా సందీప్ కిషన్ చలాకీతనాన్ని గొప్పగా ప్రదర్శించలేకపోయాడు. ఫైట్లకు పెద్ద స్కోప్ లేకపోవడంతో తన సత్తాను పెద్దగా చూపించలేకపోయాడు. డాన్యులతో ఓకే అనిపించాడు.
నందూ పాత్రలో రెజీనా మరోసారి ఆకట్టుకుంది. ఫెర్ఫార్మెన్స్ తోపాటు, గ్లామర్ తో కూడా మెప్పించింది. అల్లరిపిల్లగా, చలాకీతనంతో రెజీనా మరోసారి మెరిసింది. టాలీవుడ్ లో మరోసారి గుర్తింపు తెచ్చుకునే ఫుల్ లెంగ్త్ పాత్రకు రెజీనా పూర్తిగా న్యాయం చేసింది.
లెజెండ్ తర్వాత జగ్గు భాయ్ అనే ఓ ప్రధానమైన పాత్రలో జగపతిబాబు కనిపించారు. అయితే పాత్రలో ఇంటెన్సిటీ ఉన్నా.. కథనంలో తేలిపోయింది. జగ్గుభాయ్ పాత్రకు వినియోగించిన క్యాస్టూమ్స్ జగపతిబాబుకు చక్కగా కుదిరాయి. అక్కడక్కడ జగ్గుభాయ్ పాత్ర ఆకట్టుకున్నా.. పూర్తి స్థాయిలో గుర్తుంచుకునే పాత్రను పోషించడానికి జగపతిబాబుకు అవకాశం చిక్కలేదు. తనికెళ్ల భరణి, రవిబాబులవి రోటీన్ పాత్రలే. ఇప్పటిలానే తాగుబోతు పాత్రలో రమేశ్ చిత్ర తొలిభాగంలో కొంత వినోదాన్ని పండించేందుకు ప్రయత్నించాడు.
టెక్నికల్ ఫెర్ఫార్మెన్స్:
ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకునే విధంగా శ్రీరాం మంచి ఫోటోగ్రఫిని అందించాడు. అందమైన లోకేషన్లను చక్కగా చిత్రీకరించాడు. రెజీనాను గ్లామర్ ను ఎలివేట్ చేయడంలో శ్రీరాం సఫలమయ్యారు.
ప్రేమకథకు పాటలే సగం బలం పాటలు. అయితే ఒకటి..అరా పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నా.. పూర్తి స్థాయిలో సందీప్ కిషన్, రెజీనా కెమిస్ట్రీని పండించే విధంగా పాటలు లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఈ చిత్రానికి పాజిటివ్ అంశమని చెప్పవచ్చు.
దర్శకుడు మహేశ్ బాబు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. కొత్త దర్శకుడు అనే భావన ఎక్కడ కనిపించకపోవడం ప్లస్ పాయింటే. అయితే తొలి భాగంలో కథను తన చెప్పు చేతల్లోనే ఉంచుకుని నడిపించారనే ఫీలింగ్ కలిగించిన దర్శకుడు.. రెండవ భాగంలో తడబాటుకు గురయ్యాడు. తొలి భాగంలో వినోదాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుని సంతృప్తి పరిచినా.. రెండవ భాగంలో నత్తనడకగా సాగిన కథనంతో ప్రేక్షకుల సహనానికి దర్శకుడు పరీక్ష పెట్టారు. జగపతి పాత్ర ఎంట్రీ బాగా ఉన్నా.. అదే వూపును కొనసాగించలేకపోయారు. సందీప్, రెజీనాల మధ్య లవ్ సీన్లు చప్పగా చిత్రీకరించారు. ఓవరాల్ గా... గొప్పగా కాకపోయినా.. ఓకే అనే రేంజ్ లో రారా... కృష్ణయ్య ఉన్నాడనిపించారు.
ట్యాగ్: రారా..పిలుపుకు స్పందించని కృష్ణయ్య!
Advertisement
Advertisement