నేడే పాడండి! | Movies names with song titles | Sakshi
Sakshi News home page

నేడే పాడండి!

Published Sat, Jul 28 2018 12:28 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Movies names  with song titles - Sakshi

టైటిల్‌ సాంగులు విన్నాం. ఇప్పుడు సాంగులే టైటిళ్లు అవుతున్నాయి!అవును.పాటను వినేవాళ్లం.ఇప్పుడు పాటను చూస్తున్నాం.  నేడే పాడండి. 

కథ.. హీరో.. హీరోయిన్‌.. డైరెక్టర్‌.. ప్రొడ్యూసర్‌.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు అంతా ఓకే. మరి టైటిల్‌ ఏంటి? గతంలో అయితే కథను స్ట్రయిట్‌గా చెప్పేసే టైటిల్స్‌ పెట్టేవారు. క్రమంగా ట్రెండ్‌ మారింది. కథను అంతర్లీనంగా చెబుతూనే క్యాచీ టైటిల్‌ పెడుతున్నారు  దర్శక–నిర్మాతలు. కొత్త టైటిల్స్‌ పెట్టడం కంటే ఇప్పటికే బాగా పాపులర్‌ అయిన, జనం నోళ్లలో నానుతున్న పాటల పల్లవులను టైటిల్స్‌గా కొందరు వాడుకుంటున్నారు. మరికొందరేమో తమ అభిమాన హీరోలు నటించిన హిట్‌ సినిమాల్లో పాటల పల్లవులను టైటిళ్లుగా పెట్టేసుకుంటున్నారు. ఎందుకిలా అంటే.. జనాల నోళ్లలో నానిన వి అయితే ఈజీగా ప్రేక్షకులకు చేరువవుతాయనేది నమ్మకం. ప్రేక్షకాదరణ పొందిన పాటలో పల్లవి అయితే సెంటిమెంట్‌గా కూడా వర్కవుట్‌ అవుతాయనేది మరికొందరి నమ్మకం. ఇలా.. ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి సెంటిమెంట్‌ వారిది. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న రామ్‌ ‘హలో గురు ప్రేమకోసమే’, శర్వానంద్‌ ‘పడి పడి లేచే మనసు’, సుధీర్‌బాబు ‘నన్ను దోచుకుందువటే’, జొన్నలగడ్డ హరికృష్ణ ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రాల టైటిల్స్‌ పాటల పల్లవుల్లోంచి తీసుకున్నవే. వీటిపై ఓ లుక్కేద్దాం.  

హలో గురు ప్రేమ కోసమే 
‘హలో గురు ప్రేమకోసమేరోయ్‌ ఈ జీవితం.. మగాడితో ఆడదానికేలా పౌరుషం’ అంటూ నాగార్జున పాట పాడుతూ తన ప్రేమను అమలకు చెబుతాడు. 1991లో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘నిర్ణయం’ సినిమాలోని ఈ పాట ఎంత పాపులరో తెలిసిందే. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాట సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఆ టైమ్‌లో ఈ పాటను కుర్రాళ్లంతా తెగ పాడుకున్నారు. ఇప్పుడు ‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ రామ్‌.. అనుపమా పరమేశ్వరన్‌ వెంటపడుతున్నారు. రామ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరో హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే’ టైటిల్‌ నిర్ణయించారు. టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. అక్టోబర్‌ 18న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

పడి పడి లేచే మనసు 
‘పదహారేళ్ల వయసు.. పడి పడి లేచే మనసు’ అంటూ చిరంజీవి, రాధ వేసిన స్టెప్పులను అంత సులువుగా మరచిపోలేరు ప్రేక్షకులు. 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘లంకేశ్వరుడు’ చిత్రంలోని ఆ పాటకు స్టెప్పులేయని కుర్రకారు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదేమో. రాజ్‌–కోటి, సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలై 28ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ పాట ఎక్కడ వినపడ్డా చిరంజీవి–రాధ మన కళ్లముందు మెదులుతారు.. అంతేనా.. మనకీ కాలు కదపాలనిపిస్తుంటుంది. అంతలా హిట్‌ అయిన ఆ పాటతో ఇప్పుడు శర్వానంద్‌కి, సాయిపల్లవికీ లింక్‌ కుదిరింది. వారిద్దరూ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న  తాజా చిత్రానికి ‘పడి పడి లేచే మనసు’ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 21న రిలీజ్‌  అవుతోంది. సంగీతం విశాల్‌ చంద్రశేఖర్‌.

నన్ను దోచుకుందువటే
‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ’ అంటూ ఎన్టీఆర్‌–జమునలు పాడుకున్న పాట వింటుంటే ఇప్పటికీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో వచ్చిన ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ఆ పాట ఎవర్‌గ్రీన్‌. విజయ్‌ కృష్ణమూర్తి, జోసెఫ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మనోహరంగా ఉంటాయి. ఇప్పుడు సుధీర్‌ బాబు కూడా నభా నతేశ్‌తో ‘నన్ను దోచుకుందువటే’ అంటున్నారు. వారిద్దరూ జంటగా ఆర్‌.ఎస్‌.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ హీరోగా నటించి, సుధీర్‌ బాబు ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం నిర్మించారు. ఈ టైటిల్‌ ప్రకటించగానే చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న విడుదల చేయనున్నారు. అజనీష్‌ బి.లోకనా«థ్‌ స్వరాలు సమకూర్చారు. 

ప్రేమెంత పనిచేసె నారాయణ
చిన్న హీరో. కానీ ట్యూన్‌ క్యాచీగా ఉంటే పెద్ద పాపులార్టీ వస్తుంది. ‘ప్రేమెంత పనిచేసె నారాయణ.. సత్యనారాయణ’ పాట ఈ లిస్ట్‌లోకే వస్తుంది. రోహిత్, అనితా పాటిల్‌ పాడుకున్న ఈ పాట యువతని ఉర్రూతలూగించింది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రంలోనిది ఇది. ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ సంగీతం అందించిన ఆ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇప్పుడదే టైటిల్‌తో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ జొన్నలగడ్డ హీరోగా పరిచయం అవుతున్నారు. హరికృష్ణ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రం టైటిల్‌ ఇప్పటికే అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. యాజమాన్య స్వర పరచిన ఈ చిత్రం పాటలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రిలీజ్‌ చేయడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. 

దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి  
‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి...’ అంటూ ‘100% లవ్‌’ చిత్రంలో బాలు (నాగచైతన్య) ఎదుట కాలేజీలో కాలర్‌ ఎగరేసుకుంటూ తిరుగుతుంది మహాలక్ష్మి (తమన్నా). నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. బావా మరదళ్లుగా చైతూ, మిల్కీ బ్యూటీ చేసిన సందడి మరచిపోలేం. ఆ చిత్రంలోని ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి...’ పాట పేరుతో ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ‘క్వీన్‌’ సినిమాకి రీ–మేక్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో తమన్నా లీడ్‌ రోల్‌ చేస్తుండటం విశేషం. యూరప్‌లో జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు.  పెదవి దాటని మాటొకటుంది ‘పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా’ అంటూ ‘తమ్ముడు’ సినిమాలో తన ప్రేమను పవన్‌ కళ్యాణ్‌కి చెప్పకనే చెబుతుంటుంది ప్రీతి జింగానియా. అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలై మంచి హిట్‌ అందుకుంది. రమణ గోగుల సంగీతం ఈ చిత్రానికి మరో ఎస్సెట్‌. అంత హిట్‌ అయిన ఆ పాటతో తాజాగా ‘పెదవి దాటని మాటొకటుంది’ సినిమా తెరకెక్కింది. రావణ్‌ రెడ్డి, పాయల్‌ వాద్వా జంటగా టి.గురుప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్ననే (శుక్రవారం) విడుదలైంది. ఈ చిత్రాన్ని ముగ్గురు స్నేహితులు (హీరో రావణ్‌ రెడ్డి, డైరెక్టర్‌ గురుప్రసాద్, సంగీత దర్శకుడు జీనిత్‌ రెడ్డి) కలసి తీశారు. 

పల్లవుల టైటిల్స్‌తో వచ్చిన చిత్రాలు
ప్రేమ ఎంత మధురం..
ప్రియురాలు అంత కఠినం (అభినందన) 
సాహసం శ్వాసగా సాగిపో (ఒక్కడు)
ఆటాడుకుందాం రా (సిసింద్రీ)
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (శుభసంకల్పం)
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (రాక్షసుడు)
శ్రీరస్తు.. శుభమస్తు (పెళ్లి పుస్తకం)
కళ్యాణ వైభోగమే (సీతారాముల కళ్యాణం)
వెన్నెల్లో హాయ్‌ హాయ్‌ (ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు)
సోగ్గాడే చిన్నినాయనా (ఆస్తిపరులు)
ఎక్కడికి పోతావు చిన్నవాడా (ఆత్మబలం) 
నన్ను వదలి నీవు పోలేవులే (మంచి మనసులు) 
వీరి వీరి గుమ్మడి పండు (జయం)
భద్రం బీ కేర్‌ ఫుల్‌ బ్రదరూ (మనీ)
ప్రేమంటే సులువు కాదురా (ఖుషి)
చందమామ రావే (సిరివెన్నెల)
చంద్రుళ్లో ఉండే కుందేలు
(నువ్వొస్తానంటే నేనొద్దంటానా) 
కన్నుల్లో నీ రూపమే (నిన్నే పెళ్ళాడతా)
బంతిపూల జానకి (బాద్‌షా)  
– ఇన్‌పుట్స్‌ : డేరంగుల జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement