నాలుగు పదుల నవరస నటతిలకం
‘‘విలన్ వేషం వేయగలిగినవాడు ఆల్‌రౌండర్. హిందీలో వినోద్ ఖన్నా, శత్రుఘ్నసిన్హా, తమిళంలో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి, మోహన్‌బాబు - ఇలా ఎక్కువకాలం నిలబడిన ఆర్టిస్టులందరూ విలన్ పాత్రలతో ఇండస్ట్రీకి వచ్చినవారే. చరిత్రలో మిగిలిపోయే ఎన్నో సినిమాలు మోహన్‌బాబు చేశాడు. ఒక్కసారి పరిచయమైతే అతనితో స్నేహాన్ని విడిచిపెట్టరు’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. రాజ్యసభ సభ్యుడు, ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి (టీయస్సార్) తన పుట్టినరోజు సందర్భంగా, నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్‌బాబును శనివారం వైజాగ్‌లో ఘనంగా సన్మానించారు. ప్రముఖ సినీ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ, సాంస్కృతిక ప్రముఖులెందరో హాజరైన ఈ వేడుకలో మోహన్‌బాబుకు ‘నవరస నట తిలకం’ అనే బిరుదునిచ్చి, స్వర్ణకంకణం తొడిగారు.
ఆ వేదికపై దాసరి మాట్లాడుతూ - ‘‘టీయస్సార్ చాలా మంది కళాకారులకి సన్మానాలు చేశారు. ఈ రోజు చేస్తున్న సన్మానం చరిత్రలో నిలుస్తుంది. మోహన్‌బాబు అనే వ్యక్తికి కాదు, సామాన్యుడి స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన ఓ 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు ఆయన సన్మానం చేస్తున్నారు. చిరంజీవి, వెంకటేశ్, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీదేవి, జయసుధ, జయప్రదలదీ సుదీర్ఘ చరిత్ర. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడిన వారు కేవలం కృషి, పటుదలతో పైకొచ్చినవారే. పూర్వం రాజులు కళాకారులను సన్మానించేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు మానేశాయి. టీయస్సార్ చేయకపోతే, కళాకారుల ప్రతిభ జనాలకెలా తెలుస్తుంది?’’ అన్నారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె. కురియన్ మాట్లాడుతూ - ‘‘బెస్ట్ పార్లమెం టేరియన్‌గా మోహన్‌బాబు నాకు తెలుసు. ఏ పాత్ర అయినా చేయగల నటుడాయన’’ అన్నారు. టీయస్సార్ మాట్లాడుతూ - ‘‘విశాఖ ప్రజలంటే నాకెంతో అభిమానం, ప్రేమ. అందుకే, ప్రతి పుట్టిన రోజునూ విశాఖలో జరుపుకుంటాను. కేవలం కళను, శివోపాసనను రెండు కళ్లుగా భావిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు. అలాంటి వ్యక్తి 40 ఏళ్ల నట ప్రస్థాన వేడుకను నా పుట్టిన రోజున జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి’’ అని చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ - ‘‘నాకు అత్యంత ఆప్తుడు, నా మిత్రుడు, నా మనసుకు దగ్గరైన వ్యక్తి మోహన్ బాబు. ఈరోజు జరుగుతున్న సన్మానం మోహన్‌బాబుకి కాదు. ఓ క్రమశిక్షణకు, కష్టానికి, అనుకున్నది సాధించగలననే పట్టుదలకు జరుగుతోంది. మోహన్‌బాబు 1975లో, నేను 1978లో చిత్రసీమలో ప్రవేశించాం. మా ఈ ప్రయాణంలో మోహన్‌బాబు అలుపెరగక ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. ఇండస్ట్రీకి రావడం పూల పాన్పు కాదు, ముళ్లబాట. ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు సద్వినియోగం చేసుకున్నాడు. డైలాగులు చెప్పడంలో తనకు తిరుగు లేదు. నటనలో తన కీర్తి ప్రతిష్ఠలకు ఎదురులేదు. మేమిద్దరం ఎప్పుడూ స్నేహితులమే. మోహన్‌బాబు ప్రేమ రాక్షస ప్రేమ. మా గురించి బయట ఎన్నో పుకార్లుండేవి. వాటి గురించి ప్రస్తావిస్తే.. ‘వదిలేయ్’ అని నిర్లిప్త ధోరణితో ఉండేవాడు. నేనూ అంతే’’ అన్నారు.
అందరికీ కృతజ్ఞత తెలియజేసిన మోహన్‌బాబు ఉద్వేగంగా మాట్లాడుతూ- ‘‘ఈరోజు ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు గార్లు లేని లోటు నాకు కనిపిస్తోంది. నాది సుదీర్ఘ ప్రయాణం. మారు మూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించా. మా నాన్న టీచర్. డబ్బుల్లేక ఎక్కువ చదువుకోలేదు. కారు షెడ్డులో, ప్లాట్‌ఫామ్ మీద పడుకుని జీవించిన రోజులున్నాయి. ఆ ప్రయాణంలో మా గురువు దాసరి గారు పరిచయమయ్యారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత 1975లో ‘స్వర్గం-నరకం’ ద్వారా దాసరిగారు నటుడిగా జన్మనిచ్చారు. 500కు పైగా సినిమాల్లో నటించా, 60 సినిమాలు నిర్మించా. విద్యాసంస్థల ద్వారా ఎంతోమందికి చదువు అందిస్తున్నా. ఇన్ని సాధించానంటే నా తల్లితండ్రుల తర్వాత నా గురువు ప్రసాదించిన క్రమశిక్షణే కారణం. ఓ కులం వాడు ఆశీర్వదిస్తే ఎవడూ గొప్పోడు కాదు. అన్ని కులాల వాళ్లూ సినిమాల్లో మనల్ని చూడాలి. అందరూ సమానమే అనే ఉద్దేశంతో నా విద్యాసంస్థలను కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నాను. ఇండియాలో మొత్తం 3600 కాలేజీలు ఉంటే మాది 6వ స్థానంలో ఉంది’’ అన్నారు.
మోహన్‌బాబు తన ప్రసంగంలో ప్రతి ఒక్కరితో అనుబంధాన్ని పేరు పేరునా ప్రస్తావిస్తూ, ‘‘చిరంజీవి నాకు కలలో కూడా హానిచేయడు. నేనూ ఎప్పుడూ చిరంజీవి బాగుండాలని కోరుకుంటాను. అల్లు రామలింగయ్య గారంటే నాకు ఇష్టం. ఈరోజు చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబులు రావడం సంతోషం’’ అన్నారు.
వెంకటేశ్, బ్రహ్మానందం, అలీ, డి. సురేశ్‌బాబు, రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టి, బి. గోపాల్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులెందరో హాజరైన ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు సినీ గీతాల సీడీలను చిరంజీవి ఆవిష్కరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మోహన్‌బాబుని సన్మానించారు. సుబ్బరామిరెడ్డి తల్లితండ్రుల చిత్రపటాలతో పాటు ఏయన్నార్ చిత్రపటాన్ని బోనీ కపూర్, శ్రీదేవి దంపతులు ఆవిష్కరించారు. ‘మోహన్‌బాబు నట ప్రస్థానం బుక్‌ను శ్రీదేవి, జయసుధ, జయపద ఆవిష్కరించారు. గాయ కులు ఏసుదాసు శుభాకాంక్షలు తెలిపారు.