
బాహుబలి చూసిన పెద్దాయన.. మాజీ సీఎం మిస్
రాజకీయాల్లో మునిగి తేలుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. మంగళవారం నాడు థియేటర్‌కు వెళ్లి బాహుబలి-2 సినిమా చూశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను కొంతమందిని తీసుకెళ్లి, లక్నోలోని ఓ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని మరీ ఆ సినిమాను చూశారు. తన సన్నిహిత సహచరులను మాత్రమే ఆయన ఆ సినిమాకు తీసుకెళ్లారు. వారిలో శివపాల్ యాదవ్‌కు సన్నిహిత అనుచరుడైన అషు మాలిక్, మహ్మద్ షాహిద్ తదితరులున్నారు.
మొత్తం థియేటర్ అంతటినీ కేవలం తమ కోసమే ములాయం బుక్ చేయించుకున్నారు. అయితే, ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ములాయం వెంట సినిమా చూసేందుకు యూపీ మాజీ ముఖ్యమంత్రి, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ మాత్రం వెళ్లలేదు. అలాగే, అఖిలేష్ వర్గానికి చెందినవాళ్లుగా ముద్రపడిన వాళ్లు కూడా ఈ సినిమా చూసిన బృందంలో లేరు. ములాయం వెంట మాత్రం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా థియేటర్‌లో ఉన్నారు.