
మళ్లీ మునినే నమ్ముకున్న లారెన్స్
తమిళసినిమా: నృత్యదర్శకుడిగా రాణించిన రాఘవ లారెన్స్ ఆ తరువాత కథానాయకుడిగా రంగప్రవేశం చేశారు. స్పీడ్ చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆయనకు నిరాశనే మిగిల్సింది. ఆ తరువాత ముని చిత్రంలో నటించారు. అది మంచి పేరునే తెచ్చిపెట్టింది.దీంతో ముని–2 (కాంచన) చిత్రంతో తనే మెగాఫోన్ పట్టి, కథానాయకుడిగానూ నటించారు. ఆ చిత్రం ఆ తరువాత తెరకెక్కించిన ముని–3 (కాంచన– 2) చిత్రాలు హీరోగా, దర్శకుడిగా లారెన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టాయి. దీంతో ముని–4 చేస్తానని అప్పుడే ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ మూడు చిత్రాలు హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కథా చిత్రాలే.
ఆ తరువాత మొట్టశివ కెట్టశివ, శివలింగ చిత్రాలను ఇతర దర్శకులతో చేశారు.అయితే తాజాగా మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. తాను స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని మునికి సీక్వెల్‌గానే తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. మరో విషయం ఏమిటంటే ముని చిత్రంలో తనకు జంటగా నటించిన నటి వేదికనే తాజా చిత్రంలో నాయకిగా ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇక ఆ సీక్వెల్స్‌లో నటించిన కోవైసరళ, శ్రీమాన్, మనోబాల, దేవదర్శిని వారందరూ ముని–4లో చోటుచేసుకుంటారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.అదే విధంగా ఈ నెలాఖరునే చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.