ఎవరూ ఉత్తినే స్టార్స్ కారు : మురళీశర్మ | Murli Sharma Interview | Sakshi
Sakshi News home page

ఎవరూ ఉత్తినే స్టార్స్ కారు : మురళీశర్మ

Published Wed, Apr 29 2015 11:08 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఎవరూ ఉత్తినే స్టార్స్ కారు : మురళీశర్మ - Sakshi

ఎవరూ ఉత్తినే స్టార్స్ కారు : మురళీశర్మ

 ఆయన మాతృభాష తెలుగు. పుట్టిందీ, పెరిగిందీ - ముంబయ్‌లో! నటిస్తున్నది - మరాఠీ, హిందీ, తెలుగు, తమిళాల్లో! హిందీ సినిమాల్లో పోలీసు వేషాల్లో, తెలుగులో విలన్ పాత్రల్లో జనం గుర్తుపట్టే నటుడు - మురళీశర్మ. హిందీలో ఖాన్ త్రయం సినిమాల్లో, తెలుగులో మహేశ్‌బాబు ‘అతిథి’ నుంచి ఇటీవలి ‘గోపాల గోపాల’ దాకా పలు సినిమాల్లో నటించిన ఈ క్యారెక్టర్ యాక్టర్‌తో కాసేపు...
 
 తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీది ఏ ఊరు?
 మా నాన్న గారు బ్రిజ్ భూషణ్‌ది ఉత్తర ప్రదేశ్‌లోని మథుర. ఇక, మా అమ్మ పద్మ వాళ్ళది గుంటూరు. నా మీద మా అమ్మ గారి వాళ్ళ ప్రభావం ఎక్కువ. మా అమ్మ, మేము ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటాం. మేము ముగ్గురన్నదమ్ములం ముంబయ్‌లోనే పుట్టి పెరగడంతో మా అమ్మ కూడా దాదాపు 35 ఏళ్ళుగా గుంటూరు వెళ్ళలేదు. అక్కడ మా మేనమామ వాళ్ళున్నారు. మాకు ఒక సొంత ఇల్లు కూడా ఉందట! మహేశ్‌బాబు ‘అతిథి’తో తెలుగులోకి అడుగుపెట్టడంతో నా తెలుగు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నా. ఇప్పుడు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా.
 
 అసలింతకీ తెలుగు తెరపై మీ ప్రస్థానం ఎలా మొదలైంది?
 మాది మధ్యతరగతి కుటుంబం. మా ఇంట్లో ఎవరూ ఈ రంగంలో లేరు. మా ఇంట్లో ఒప్పించి, చాలా కష్టపడి ముంబయ్‌లోని రోషన్ తనేజా ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నా. ఆ తరువాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాను. టీవీ సీరియల్స్‌లో పాత్రలు వేశాను. ఆ తరువాత హిందీ సినిమాల్లో అవకాశాలొచ్చాయి. హిందీలో నేను చేసిన ‘అపహరణ్’, ‘మక్బూల్’ చిత్రాలు చూసి, తెలుగు దర్శకుడు సురేందర్ రెడ్డి ‘అతిథి’(2007)లో అవకాశమిచ్చారు. ఆ విలన్ పాత్ర బాగా గుర్తింపు తెచ్చింది. నాకూ, నాకు డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ (నటుడు సాయికుమార్ సోదరుడు)కూ నంది అవార్డు తెచ్చిపెట్టింది. అక్కడ నుంచి ఇక తెలుగులో కూడా వరుసగా అవకాశాలొచ్చాయి.
 
 హిందీ, మరాఠీ, తెలుగు - ఇన్ని మాట్లాడుతున్నారు!
 (నవ్వేస్తూ...) రకరకాల భాషలన్నా, అవి నేర్చుకోవడమన్నా నాకు చాలా ఇష్టం. అందుకే, ఇన్ని భాషల్లో మాట్లాడగలుగుతున్నా. హిందీ, మరాఠీ, తెలుగు బాగా వచ్చు. తెలుగు ఇంకా చదవడం, రాయడం రాదు. నేర్చుకుంటున్నా. తమిళం కూడా బాగానే మాట్లాడతాను. కానీ, తమిళ, మలయాళాలకు వేరేవాళ్ళ డబ్బింగ్ మీద ఆధారపడుతుంటా. ఆ భాషలు కూడా నేర్చుకోవాలనుంది. ప్రకాశ్‌రాజ్‌లా అన్ని భాషల్లో నటిస్తూ, డబ్బింగ్ చెప్పాలని ఉంది.
 
 ఇన్ని భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నారు కూడా!
 అది దేవుడి దయ, ప్రేక్షకుల ఆశీస్సులు, పరిశ్రమ ప్రోత్సాహం! ఇప్పటి దాకా హిందీలో 50, తెలుగులో దాదాపు 12, తమిళంలో అయిదారు, మరాఠీలో అరడజను, మలయాళంలో ఒకటి చేశాను.  హిందీలో షారుఖ్‌ఖాన్ (‘మై హూ నా’), ఆమిర్ ఖాన్  (‘మంగళ్‌పాండే’), సల్మాన్‌ఖాన్ (‘దబంగ్’)లు ముగ్గురితోనూ నటించా. బాలకృష్ణ (‘అధినాయకుడు’), వెంకటేశ్ (‘గోపాల గోపాల’), మహేశ్‌బాబు (‘అతిథి’), జూనియర్ ఎన్టీఆర్ (‘కంత్రి’, ‘ఊసరవెల్లి’), రామ్‌చరణ్ (‘ఎవడు’)తో చేశా. వీళ్ళంతా ఇంత పెద్ద స్టార్స్ అయినా, తోటి నటీనటుల్ని అమితంగా గౌరవిస్తారు. ఎవరూ ఊరకనే పెద్దవాళ్ళు కారని వాళ్ళతో పనిచేశాక నాకు అర్థమైంది.
 
 హిందీ, తెలుగు పరిశ్రమల్లో మీకు కనిపించిన తేడా?
 ఒక్క భాషే తేడా (నవ్వులు). భావోద్వేగాలు ఒకటే. టైవ్‌ు ఈజ్ మనీ అని గ్రహించి, అన్ని చోట్లా టైవ్‌ు పాటిస్తున్నారు.  
 
 ‘ఓ మైగాడ్’కు భిన్నంగా తెలుగు ‘గోపాల...’లో పాజిటివ్‌గా..?
 (మధ్యలో అందుకుంటూ...) హిందీ వెర్షన్‌లో మిథున్ చక్రవర్తి గ్రూప్‌లోని రాజకీయనేత పాత్ర చేశా. తెలుగులోనూ ఆ పాత్రకు అడిగారు. కానీ, డేట్లు కుదరలేదు. ఆ మాటే చెబితే, నన్ను అర్థం చేసుకున్న దర్శకుడు డాలీ, నిర్మాతలు మళ్ళీ హిందీలో ఓం పురి చేసిన మంచివాడైన లాయర్ పాత్రకు అడిగారు. అలా అది చేశా.
 
 మీ ఇంట్లోవాళ్ళు మీ తెలుగు సినిమాలు చూస్తుంటారా?
 సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కొత్తల్లో హైదరాబాద్‌లో సెటిలైన మా బాబాయ్ గారు కూడా నా కోసం దర్శకులు కె. విశ్వనాథ్‌కు ఉత్తరం రాసివ్వడం, స్వయంగా అక్కినేని గారి దగ్గరకు తీసుకువెళ్ళడం లాంటివి నాకు ఇప్పటికీ గుర్తే! పదేళ్ళ క్రితం ముంబయ్‌లో ఇన్ని తెలుగు సినిమాలు రిలీజయ్యేవి కావు. ఇప్పుడు మల్టీప్లెక్సుల్లో తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయి. మా అమ్మ, మా ఆవిడ, మా పెద్ద వదిన, నేను కలసి సినిమాలకు వెళుతుంటాం.  
 
 మీ శ్రీమతి కూడా నటీమణే అని విన్నాం!
 మహారాష్ట్ర అమ్మాయి. పేరు - అశ్వినీ కల్సేకర్. హిందీ, మరాఠీ సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తుంటుంది. మా ఇద్దరి పరిచయం కూడా అజయ్‌దేవ్‌గణ్ ‘అపహరణ్’ సెట్స్‌పై జరిగింది. మా మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా, పెళ్ళిగా పరిణమించింది. ఆవిడా తెలుగులో రవితేజ ‘నిప్పు’, అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’లలో నటించింది. ఇటీవలే ‘బద్లాపూర్’లో మేమిద్దరం చేశాం.  
 
 గ్యారెంటీ లేని రంగంలోకి వచ్చినందుకెప్పుడైనా బాధ...?  
 లేనే లేదు. ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నిజం చెప్పాలంటే, జీవితం ఆనందంగా గడుస్తోంది. ఈ ఏడాది నేను నటించిన అక్షయ్‌కుమార్ ‘బేబీ’ సినిమా, అందులో నేను పోషించిన మంత్రి గారి పి.ఏ. పాత్ర బాగా పేరు తెచ్చాయి. ‘బద్లాపూర్’, మొన్నామధ్య వచ్చిన పరేశ్‌రావల్ ‘ధరమ్‌సంకట్’, ఇక తెలుగులోని ‘గోపాల... గోపాల’ - అన్నీ గుర్తింపునిచ్చాయి. ప్రభుదేవా ‘ఏ.బి.సి.డి -2’ త్వరలో రానుంది. తెలుగులో మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’ - ఇలా మంచి సినిమాలు చేస్తున్నా. ఈ తెలుగు సినిమాలో నాకిచ్చిన హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ నేనింతవరకు చేయని మంచి పాత్ర.
      - రెంటాల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement