‘‘ఏదైనా చక్కటి పాట విన్నప్పుడు దాన్ని ప్రేరణగా తీసుకొని మనదైన స్టయిల్లో ఒక కొత్త ట్యూన్‌ని సిద్ధం చేసుకోవడాన్ని కాపీ కొట్టడం అని అనుకోను. ఒకవేళ మక్కీకి మక్కీ దించేస్తే కాపీయే అంటారు. నేనెప్పుడూ కాపీ కొట్టలేదు. కొట్టను కూడా’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు.
► నేను మందు తాగను. కానీ శేఖర్ రెడ్డి ‘90 ఎం.ఎల్’ చిత్రకథను చెప్పినప్పుడు మందు తాగినంత కిక్ ఎక్కింది. ఎంత బాగా కథ చెప్పాడో అంతే బాగా చిత్రీకరించాడు కూడా. పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఫుల్ మాస్ ఆల్బమ్‌ను రూపొందించాను. ఇందులో ఆరు పాటలుంటాయి. ఒక బిట్ సాంగ్ కూడా ఉంటుంది. ఈ మాస్ సాంగ్స్‌కి కార్తికేయ వేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
► నా హిట్ ఆల్బమ్స్‌లో ఎక్కువగా మెలోడీలు ఉండటంతో మాస్ సినిమాలకు పనిచేసే అవకాశం పెద్దగా రాలేదు అనుకుంటున్నాను. సంగీతం సమకూర్చేప్పుడు సినిమా పెద్దదా, చిన్నదా అనేది పట్టించుకోను. కథానుసారంగా ట్యూన్స్ కంపోజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. స్టార్ హీరోలతో పని చేసేప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటాను. మనం మంచి మ్యూజిక్ ఇచ్చినా కొన్నిసార్లు సినిమాలు సరిగ్గా ఆడకపోవచ్చు. అప్పుడు మన శ్రమ వృథా అవుతుంది. ఆ సమయంలో కొంచెం బాధపడతాను.
► ఈ మధ్య కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు మిస్సయ్యాయి. అందుకే కొంత గ్యాప్ వచ్చింది. ఎప్పుడేం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు కాబట్టి బాధపడను.
► కొత్త సంగీతం వస్తోంది. ప్రేక్షకులు మ్యూజిక్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పాటలు ఉంటే థియేటర్స్‌కు వస్తున్నారు. మరోవైపు కార్తీ నటించిన ‘ఖైదీ’ లాంటి సినిమా చూసి ‘భవిష్యత్తులో పాటలు లేని సినిమాలే ఉంటే సంగీత దర్శకులకు దెబ్బే’ అని కొందరు అంటున్నారు. భారతీయ సినిమాల్లో నుంచి పాట ఎక్కడికీ పోదు. పాట లేని సినిమా అయినా నేపథ్య సంగీతం కావాలి. అదీ సంగీతదర్శకుడి పనే. మన సినిమాల్లో పాటలు పక్కా ఉండాలని ఓ సందర్భంలో షారుక్ ఖానే అన్నారు.
► ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment