నాది ఫ్యామిలీ షో
‘తాజా ఆలోచనతో రూపొందించిన షో. సరుకంతా స్వచ్ఛమైనది. అందుకే నవ్వులే నవ్వులు’ అంటూ తన షో కామెడీ నైట్స్ విత్ కపిల్ గురించి అతడు వివరించాడు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ షో ఇదని చెబుతున్నాడు.
న్యూఢిల్లీ: ‘తాజా ఆలోచనతో రూపొందించిన షో. సరుకంతా స్వచ్ఛమైనది. అందుకే నవ్వులే నవ్వులు’ అంటూ తన షో కామెడీ నైట్స్ విత్ కపిల్ గురించి అతడు వివరించాడు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ షో ఇదని చెబుతున్నాడు. అంతేకాదు అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల నుంచి కూడా కపిల్ షోను మెచ్చుకుంటూ ట్విటర్‌లో సందేశాలు వస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి పడుతున్న కష్టానికి ఇప్పుడు టీఆర్‌పీ రేటింగుల రూపంలో ఫలితం కనిపిస్తోందని కపిల్ అంటున్నాడు.
తమ తాజా సినిమాల ప్రచారం కోసం అక్షయ్‌కుమార్, షారుఖ్‌ఖాన్ వంటి తారలు కూడా ఇందులో పాల్గొంటుండడంతో షోకు సినీఆకర్షణ కూడా జతకలిసింది. కపిల్..ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్‌లో విజయం సాధించడంతో దశ తిరిగింది. ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి కామెడీ నైట్స్ విత్ కపిల్ పేరుతో ఇతడు ప్రత్యేక షోను నిర్మిస్తూ నిర్వహిస్తున్నాడు. ‘నాకేదో ఒకే రాత్రిలో ఇంత పేరు వచ్చిందని అంతా అనుకుంటున్నారు. అది నిజం కాదు. దీని వెనక ఏళ్ల శ్రమ ఉంది.
డబ్బులు తీసుకోకుండానే ఎన్నో షోల్లో నటించాను. ఏడాదిపాటు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి కామెడీ నైట్స్ విత్ కపిల్ షోను తీర్చిదిద్దాను’ అని తెలిపారు. నటుడిగా, స్టాండప్ కమెడియన్‌గా, షో నిర్వాహకుడిగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషించిన కపిల్ తన కెరీర్ ప్రయాణం బాగానే ఉందని తెలిపాడు. ‘2005లో నేను కామెడీ షోలు మొదలుపెట్టాను. నాలో ఎంతో ఎదుగుదల గమనించాను. మొదట్లో నిరాశ పడ్డాను. అయితే భగవంతుడు నాకు ఇచ్చింది చాలు. నేను కొత్త రకం కామెడీ పండించడం లేదు. ఉన్నదానినే కొత్తగా చూపిస్తున్నాను’ అని కపిల్ వివరించాడు. షారుఖ్, సల్మాన్ వంటి బడాతారల ప్రశంసలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని కపిల్ శర్మ అన్నాడు. అన్నట్టు ఈ షోలో మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ కూడా పాల్గొంటూ తన వంతుగా ప్రేక్షకులను నవ్విస్తుంటారు.