మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా!
మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా!
Published Mon, Jan 27 2014 11:09 PM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
‘మీ చెల్లెలు పెళ్లి చేసేసుకున్నారు. మరి మీ పెళ్లెప్పుడు?’ అని అడిగితే... ‘అబ్బాయి దొరకలేదు’ అని అందంగా నవ్వేశారు కాజల్. మళ్లీ ఏమనుకున్నారో ఏమో... ‘రెండుమూడేళ్లలో చేసుకుంటా’ అని చిరునవ్వుతో సమాధానమిచ్చారు. రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’లో ఆమె అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని కాజల్ ఆనందం వ్యక్తం చేస్తూ... సోమవారం విలేకరులతో ముచ్చటించారు. ‘తెలుగు సినిమాల్లో చేయమని అడిగితే.. పారితోషికం ఎక్కువ చెప్పేస్తున్నారట కదా?’ అనడిగితే... ‘‘అవన్నీ ఉట్టి మాటలు. నేను డబ్బు మనిషిని కానేకాదు. పైగా నా కెరీర్ మొదలైందే ఇక్కడ. ఐ లవ్ తెలుగు సినిమా.
టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని కలలో కూడా అనుకోను’’ అన్నారు. మరి... తెలుగు సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం? అనంటే -‘‘రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాను. దీంతో పాటు చెల్లెలు పెళ్లి. ఈ కారణాల వల్లే తెలుగులో కాస్త గ్యాప్ వచ్చింది. వచ్చే నెల 8 నుంచి కృష్ణవంశీ-చరణ్‌ల సినిమా షూటింగ్‌లో పాల్గొంటా. ‘చందమామ’ తర్వాత మళ్లీ కృష్ణవంశీగారితో చేయడం ఆనందంగా ఉంది. ఇందులో నాది చాలామంచి రోల్. అలాగే...చరణ్‌తో నేను చేసిన మగధీర, నాయక్, ఎవడు... పెద్ద హిట్లయ్యాయి. చేయబోతున్న ఈ చిత్రం కూడా కచ్చితంగా హిట్’’ అని నమ్మకం వ్యక్తం చేశారు కాజల్.
తమిళ సినిమాల ప్రమోషన్ల విషయంలో రానని పేచీ పెడుతున్నారటగా? అనే ప్రశ్నను ముందుంచితే- ‘‘సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ సినిమాలో నటించడమే కాదు, ప్రమోషన్ విషయంలో కూడా సహకరించడం కథానాయికగా నా బాధ్యత. నేనెప్పుడూ ప్రమోషన్‌కి రానని చెప్పలేదు. అవి అవాస్తవాలు’’ అని పేర్కొన్నారు. ‘ఎవడు’లో అతిథి పాత్ర చేయడానికి కారణం చెబుతూ -‘‘పైడిపల్లి వంశీ నాకు మంచి ఫ్రెండ్. అలాగే... దిల్ రాజు స్టోరీ సెలక్షన్‌పై నాకు అపార నమ్మకం.
దానికి తగ్గట్టే ఆ కథ నాకు బాగా నచ్చింది. అందుకే దీప్తి పాత్రకు ‘ఓకే’ చెప్పాను. ఇక నుంచి పెద్ద సినిమా, చిన్న సినిమా అని చూడకుండా పాత్ర నచ్చితే అతిథి పాత్రయినా చేయాలని నిశ్చయించుకున్నా’’ అని చెప్పారు. దక్షిణాది సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా బాలీవుడ్ సినిమా గురించి ప్రస్తుతం ఆలోచించలేనని, బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేసే వ్యవధిలో దక్షిణాదిన నాలుగు సినిమాల్లో చేయొచ్చని, అందుకే తన ప్రాధాన్యత సౌత్ సినిమాకే అని కాజల్ అన్నారు.
Advertisement
Advertisement