నా రూటే సపరేటు
నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త అయిన ఆర్‌కే తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్‌వళి తనీవళి (నా రూటు సపరేట్) మక్కల్ పాళరై తాకంపై ఈయన సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు షాజి కైలాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆర్‌కే ఐపీఎస్ అధికారిగా పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర వివరాలను ఆర్‌కే తెలుపుతూ ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ఇతివృత్తంగా తెరకెక్కుతున్న మంచి కమర్షియల్ కథా చిత్రం అని చెప్పారు.
ఎక్కడ అరాచకాలు జరుగుతాయో అక్కడికి ప్రభుత్వం ఈ పోలీస్ అధికారిని పంపి పరిస్థితులను చక్కదిద్దుకుంటుందన్నారు. అలాంటి ప్రభుత్వమే చివరికి ఆ పోలీస్ అధికారికి వ్యతిరేకంగా మారుతుందన్నారు. అందుకు కారణాలేమిటి? ఆ తరువాత ఏమయ్యిందనే పలు ఆసక్తికర సంఘటనల సమాహారమే ఎన్‌వళి తనీవళి చిత్రం అన్నారు. చిత్రంలో చాలా ట్విస్ట్‌లుంటాయని చెప్పారు. పేరుకు అందరూ పోలీసులే అయినా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తారని అలా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న పోలీసు అధికారి కథ ఈ చిత్రం అని తెలిపారు. ప్రేమ, యాక్షన్, హాస్యం అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయన్నారు.
అమ్మపాట హైలైట్
చిత్రంలో ఇద్దరు కథానాయికలుంటారని ఆ పాత్రలను పూనం కౌర్, మీనాక్షి దీక్షిత్‌లు పోషించారని తెలిపారు. వీరిలో ఒకరు తన మేనత్త కూతురు కాగా మరొకరు తనతో పని చేసే యువతి అని వివరించారు. చిత్రంలో ప్రధాన ప్రతినాయకిగా రోజా నటించడం విశేషంగా పేర్కొన్నారు. ఒక ప్రముఖ వ్యాపార వేత్తగా ఈమె పాత్ర వైవిధ్యంగా ఉంటుందన్నారు. హీరోకు అమ్మగా సీత నటించారని చెప్పారు. ఈమె చనిపోయినప్పడు వచ్చే అమ్మపాట, చిత్రం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుందన్నారు. అంత గొప్పగా ఆ గీతం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వైరముత్తు రాసిన టైటిల్ సాంగ్ జనరంజకంగా ఉంటుందన్నారు.
షూటింగ్‌ను పాండిచ్చేరి, చెన్నై, జోడాన్ తదితర ప్రాంతాల్లో నిర్వహించినట్లు తెలిపారు. వి.ప్రభాకర్ కథనం, మాటలు రాసిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేనా సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇళవరసు, రాధారవి, ఆశిష్ విద్యార్థి తలైవాసల్ విజయ్, విసు, టి.పి.గజేంద్రన్, రాజ్‌కపూర్, సంగిలి మురుగన్, సెంథిల్ నాధన్, పయిల్ వాన్ రంగనాథన్, కరాటే రాజా, బీసెంట్ నగర్ రవి, అన్బాలయా ప్రభాకర్, అరుల్‌ణి, యువరాణి అంటూ భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్.కె.వెల్లడించారు.