‘రాజు - పేద’కు 60 ఏళ్లు | N T Rama Rao raju peda movie 60 years completed | Sakshi
Sakshi News home page

‘రాజు - పేద’కు 60 ఏళ్లు

Published Tue, Jun 24 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

‘రాజు - పేద’కు 60 ఏళ్లు

‘రాజు - పేద’కు 60 ఏళ్లు

తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన తొలి బాలనటునిగా మాస్టర్ సుధాకర్ చరిత్రలో నిలిచిపోయాడు. కన్నతల్లి, దేవదాసు, నిరుపేదలు తదితర చిత్రాల్లో నటించిన సుధాకర్ ఆ తర్వాత రంగస్థలంపై స్థిరపడిపోయాడు. అనకాపల్లిలో ఓ నాటక ప్రదర్శనకు వెళ్లి మిస్టరీగా చనిపోయాడు. అప్పటికి అతనికి పాతికేళ్ల వయసు ఉంటుందేమో.
 
 అందగాడైన ఎన్టీఆర్‌తో నెగటివ్ ఛాయలున్న డీ గ్లామరైజ్డ్ పాత్ర చేయించాలని ఎవరైనా అనుకుంటారా? అస్సలు అనుకోరు. ‘రాజు-పేద’లో ఎన్టీఆర్‌ని చూస్తే షాకవుతారు. ఆయన గెటప్, పాత్ర తీరు తెన్నులే కాదు, కథాంశమూ షాకింగ్‌గానే ఉంటుంది. 1954 జూన్ 25న విడుదలైన ఈ చిత్రానికి నేడు వజ్రోత్సవం.  ఒక తమాషా ఆలోచన. అచ్చం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పోలికలతోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతనో ఆటో డ్రైవర్ అనుకుందాం. హీరో ప్లేస్‌లోకి ఆటో డ్రైవర్, ఈ ఆటోడ్రైవర్ ప్లేస్‌లోకి ఆ హీరో చేరితే ఎలా ఉంటుంది? ఫన్‌కి ఫన్. డ్రామాకి డ్రామా.
 
  థ్రిల్‌కి థ్రిల్. ఇలాంటి చిత్రమైన కాన్సెప్టులు మన ఫిలిం మేకర్ల బుర్రలో బోలెడన్ని ఉంటాయి. అసలు దీనికి మూలం ఎక్కడ ఉందో తెలుసా? అయితే మనం ఒకసారి 1881 ప్రాంతంలోకి వెళ్లాలి. అవును మరి... ఈ కాన్సెప్ట్ అప్పుడే పుట్టింది. మార్క్ ట్వెయిన్ అనే రచయిత ‘ది ప్రిన్స్ అండ్ ది పాపర్’ పేరుతో ఓ హిస్టారికల్ ఫిక్షన్ నవల రాశాడు. రాసిన ముహూర్తం బావుందో, లేక కాన్సెప్ట్‌లో గమ్మత్తుందో కానీ ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ఈ దారాన్ని ఉపయోగించుకుని బోలెడంత మంది మాలలల్లారు. కామిక్ బుక్స్, యానిమేషన్ కార్టూన్ సీరియల్స్, సెలైంట్ మూవీ, టాకీలు... అనేకం వచ్చాయి.
 
 ఈ నవలను బేస్ చేసుకుని 1920లో ఓ సెలైంట్ మూవీ వచ్చింది. 1937లో హాలీవుడ్‌లో ఓ టాకీ వచ్చింది. ఈ నవలకున్న ప్రజాదరణ, ఈ కాన్సెప్ట్‌లోని కొత్తదనం బి.ఎ. సుబ్బారావును ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ మొదలుపెట్టి, దర్శక నిర్మాతగా ఎదిగినవాడాయన. ఎన్టీఆర్, ఏయన్నార్‌తో ఫస్ట్ టైమ్ ‘పల్లెటూరి పిల్ల’ తీశాడు. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. రెండో సినిమాను కూడా అదే రీతిలో అదరగొట్టాలనుకున్నాడు. అందుకే గొప్ప కథ కోసం చూస్తుంటే ‘ది ప్రిన్స్ అండ్ ది పాపర్’ గుర్తుకొచ్చింది. దాన్ని తెలుగు నేటివిటీకనుగుణంగా మార్చి, మాటల రచయిత పినిశెట్టి రామ్మూర్తి చేతుల్లో పెట్టాడు.
 
  చిన్న కథలాగానే అనిపిస్తుంది కానీ, కథలో మెలికలూ, మెరుపులూ చాలానే ఉన్నాయి. ఒకే రోజు అటు రాజుగారింట్లోనూ, ఇటు ఓ దొంగ ఇంట్లోనూ మగపిల్లలు పుడతారు. ఇద్దరూ ఒకేలా ఉంటారు. ట్విన్స్‌లా అన్నమాట. దొంగ ఇంట్లో పుట్టిన కుర్రాడు తండ్రి బాధలు పడలేక దూరంగా పారిపోతూ అనుకోకుండా యువరాజు కంటబడతాడు. ఓ చిన్న ట్విస్ట్‌తో యువరాజు దొంగ ఇంటికి వెళతాడు. దొంగ కొడుకు, యువరాజుగా వెలుగొందుతాడు. చివరివరకూ బోలెడంత టెన్షన్. ఫైనల్‌గా ఈ ‘రాజు - పేద’ తమ కథల్ని సుఖాంతం చేసుకుంటారు.
 
 ఈ సినిమా అంతా యువరాజు, దొంగ కొడుకు మీదే నడుస్తుంది కాబట్టి మంచి బాలనటుడు కావాలి. ‘దీక్ష’లో నటించిన మాస్టర్ సుధాకర్ గురించి ఎవరో గొప్పగా చెప్పారు. ఫైనల్‌గా అతణ్ణే ఖరారు చేశారు. ఈ చిత్రంలో పోలిగాడు పాత్ర ఒకటుంది. అతనో దొంగ. మామూలుగా అయితే ఏ హీరో కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోడు. కానీ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అంతా షాక్. ఎందుకంటే,  అది చాలా డీ గ్లామరైజ్డ్ రోల్. మొహం అంతా మసి పూసుకుని, గోనె గుడ్డలు ధరించాలి. దానికి తోడు నెగటివ్ ఛాయలు. అయినా కూడా ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. బిఏ సుబ్బారావంటే ఆయనకు విపరీతమైన గౌరవం. ‘పల్లెటూరి పిల్ల’తో తనను తొలిసారిగా హీరోని చేశారన్న కృతజ్ఞత.
 
  ఆర్టిస్టు అన్నాక అప్పుడప్పుడూ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలన్న కసి మరోవైపు. అప్పటికే ఎన్టీఆర్ స్టార్. పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు లాంటి సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. అయినా రిస్క్‌కి సిద్ధమయ్యారు. ‘విజయా’ చక్రపాణి కూడా ఇందులో ఎన్టీఆర్ గెటప్ చూసి ఆశ్చర్యపోయారు. ‘‘ఏంది సుబ్బారావ్! రొమాంటిక్ హీరోను తీసుకెళ్లి మసి పూసావ్’’ అనడిగారు. అందరూ ఫలితం కోసం వెయిటింగ్. ఫైనల్‌గా ఎన్టీఆర్ చేసిన రిస్క్ ఫలించింది. ‘రాజు-పేద’ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. సినిమా అంటే ఇలానే ఉండాలి, హీరో అంటే ఇలాగే చేయాలి లాంటి పడికట్టు నిబంధనల్ని ఈడ్చి ఆవతల పడేసిందీ సినిమా.
 
  ఈ కథలోని దమ్ము, ఎన్టీఆర్ రిస్క్... ఈ రెండే ఈ చిత్రాన్ని ఇప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. ఎస్వీఆర్ చేసిన మహారాజు పాత్ర, రేలంగి పోషించిన సుధీర్‌కుమార్ పాత్రలైతే ఎక్స్‌లెంట్. లక్ష్మీరాజ్యం, ఆర్. నాగేశ్వరరావులు కూడా మెరుపులు మెరిపించారు.ఈ చిత్రానికి మరో హీరో అంటే ఆది.ఎమ్. ఇరానీ పేరు చెప్పాలి. తొలి భారతీయ టాకీ ‘ఆలం ఆరా’కి ఛాయాగ్రాహకుడాయన. ‘రాజు-పేద’లో డ్యూయల్ రోల్ షాట్స్‌ను బాగా డీల్ చేశారు.  పిల్లలిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఒకరి వెనుక ఇంకొకరు వెళ్లే షాట్ ఉంది. అది తీయడానికి అప్పటి పరిస్థితులకు చాలా కష్టం.
 
  ఇరానీ చాలా ఈజీగా ఆ షాట్లు చిత్రీకరించారు.
 సాలూరు రాజేశ్వరరావు మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్. హీరోయిన్ జయచిత్ర తల్లి అమ్మాజీకి ఇదే తొలి సినిమా. ఎడిటర్ కె.ఎ. మార్తాండ్‌క్కూడా ఇదే ఫస్ట్ ఫిల్మ్. బీఏ సుబ్బారావుకు ఆయన స్వయానా మేనల్లుడు.ఇదే చిత్రాన్ని ఎల్వీ ప్రసాద్ హిందీలో ‘రాజా అవుర్ రంక్’ (1968) పేరుతో రీమేక్ చేశారు. ఎన్టీఆర్ పాత్రను అజిత్, రేలంగి పాత్రను సంజీవ్ కుమార్, టైటిల్ రోల్స్‌ను మాస్టర్ మహేశ్ కొఠారి చేశారు. అక్కడా ఈ సినిమా హిట్టయ్యింది.- పులగం చిన్నారాయణ
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement