వెన్నుపోటు: నాడు చంద్రబాబు, నేడు అఖిలేశ్!
కేరాఫ్ సైకిల్
సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు.. 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ స్థాపకుడు ఎన్టీ రామారావును ఆయన సొంత అల్లుడు చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచిన ఉదంతాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ వ్యవహారంలో మరో సారూప్యమేమింటంటే ఇటు టీడీపీ, అటు ఎస్పీ గుర్తులు సైకిల్ కావడం. అయితే. అప్పుడు వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ సీఎం కాగా, ఇప్పుడు తండ్రి ములాయంపై తిరుగుబాటు లేవనెత్తిన అఖిలేశ్ సీఎం.
1995 ఆగస్టులో తొమ్మిదిరోజులపాటు నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం టీడీపీ అధ్యక్ష పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్‌ను చంద్రబాబు కూలదోశారు. టీడీపీకి చెందిన 216 మంది ఎమ్మెల్యేలలో 198 మంది ఎమ్మెల్యేలు అండగా నిలువడంతో ఐదు రోజుల తర్వాత చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టారు. కేవలం 18మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్టీఆర్‌కు విశ్వాసపాత్రులుగా నిలబడ్డారు. ఈ పరిణామంతో గుండెపగిలిన ఎన్టీఆర్ తీవ్ర విషణ్న వదనంతో పదవీచ్యుతుడై హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన ఇంటికి తిరుగుముఖం పట్టారు. అనంతరకాలంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా ఉన్న 18మంది ఎమ్మెల్యేలలో చాలామంది చంద్రబాబు పక్షాన చేరిపోయారు.
సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ 1982 మార్చ్ 29న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించి.. తన నాయకత్వంలో మూడుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా వెన్నుపోటుకు ముందు 1994 డిసెంబర్ ఎన్నికల్లో టీడీపీ బంఫర్ మెజారిటీ సాధించింది. ఉమ్మడి ఏపీలోని 294 స్థానాలలో 216 సీట్లు గెలుచుకుంది. 1992లో ఎన్టీఆర్‌కు గుండెపోటు రావడం, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడం, ఎన్టీఆర్ భాగస్వామి లక్ష్మీపార్వతి ప్రమేయం బాగా పెరిగిపోతున్నదని చంద్రబాబు క్యాంపు ప్రచారం చేయడం ఎన్టీఆర్‌ను బలహీన పరిచిందని అప్పటి రాజకీయ నిపుణులు గుర్తుచేసుకుంటారు. మొదటి భార్య చనిపోవడంతో ఆ తర్వాత లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
సొంత అల్లుడే తనను వెన్నుపోటు పొడవడంతో దిగ్భ్రాంతి చెందిన ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును వెన్నుపోటుదారుడు, ఔరంగజేబు అంటూ తీవ్ర విమర్శించిన విషయాన్ని రాజకీయ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. అప్పట్లో ఈ ఉదంతంలో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం చంద్రబాబుకు అండగా నిలిచింది. కానీ, ఆ తర్వాత చంద్రబాబు తీరు నచ్చక చాలావరకు ఎన్టీఆర్ కుటుంబం దూరం జరిగింది. ఇప్పటికీ ఎన్టీఆర్-చంద్రబాబు కుటుంబాల మధ్య నివురుగప్పిన నిప్పులా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఉన్నట్టు కనిపిస్తుందని పరిశీలకులు చెప్తారు. అప్పుడు ఏపీలో, ఇప్పుడు యూపీలో జరిగిన పరిణామాలకు పలువిధాలుగా వ్యత్యాసం ఉన్నా.. రెండింటి మధ్య దగ్గరి సారూప్యం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.