రుహాని, సుశాంత్, జస్వంత్, నాగచైతన్య, సమంత, రాహుల్, చిన్మయి
‘‘నిన్ను, నన్ను కలిసి రాహుల్ ఓ కథ చెబుతాడట అని సమంత నాతో చెప్పగానే.. రాహుల్ నటించబోయే సినిమా అనుకున్నా. కానీ, తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి సర్‌ప్రైజ్ అయ్యా. కథ చాలా ఫ్రెష్‌గా అనిపించింది’’ అని నాగచైతన్య అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల.. సౌ’. నాగార్జున, జస్వంత్ నడిపల్లి, భరత్‌కుమార్ మలశాల, హరి పులిజ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అనే సందేహం ఉండేది. నీవి, రాహుల్ సెన్సిబిలిటీస్ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చేయాలని సమంత అంది. ఎలాగైనా ‘చి..ల..సౌ’ లో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో (నాగార్జున) చెప్పా. ఆయనకూ సినిమా నచ్చి, భాగస్వామ్యం అయ్యారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే... సమంత కోసం ఏడేళ్లు ట్రై చేశా. నా సిన్సియారిటీ, నా కష్టం చూసి తను ఆ తర్వాత ఓకే చెప్పారు (నవ్వుతూ).
నాకు పెళ్లి కావడంతో రానా, సుశాంత్ హ్యాపీగా ఉన్నారు.. ఎందుకంటే పెళ్లి చేసుకోమని కొద్దిరోజులైనా వాళ్లని నేను వేధించకుండా ఉంటానని (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘నేను, రాహుల్ కలసి చేసిన సినిమా సరిగ్గా ఆడలేదు కానీ, 11ఏళ్లుగా మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రాహుల్ హార్డ్‌వర్కర్. ‘చి..ల.. సౌ’ సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్ యాక్టర్‌గా నాకు కనెక్ట్ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్ అయ్యాడు. రుహానీ శర్మ ఫైర్ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు సమంత.
‘‘పెళ్లిచూపులప్పుడు అమ్మాయి, అబ్బాయి.. ఒకరికొకరు కరెక్టా? కాదా? అని అరగంటలో ఎలా నిర్ణయించుకుంటారు. దానికి ఎంత సమయం పడుతుంది? అనే కాన్సెప్ట్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘చి..ల..సౌ’ లాంటి కథతో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సుశాంత్. ‘‘డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకొచ్చి, నిర్మాతనయ్యా. మంచి సినిమా చేశాం’’ అన్నారు నిర్మాత జస్వంత్ కుమార్. కథానాయిక రుహానీ శర్మ, గాయని, రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment