నాగబాబు
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం తీసుకున్న వారికి అవకాశాలిప్పిస్తామని ‘మా’ హామీ ఇవ్వదు. వృద్ధ కళాకారులకు పెన్షన్, సభ్యులందరికీ రూ.2 లక్షల బీమాతో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలకు మధ్య ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తుంది. అంతేకానీ, ‘మా’ అవకాశాలు ఇప్పించాలనడం కరెక్ట్ కాదు’’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డితో పాటు మరికొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
వీటి గురించి బుధవారం నాగబాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. టీవీ ఇండస్ట్రీలోనూ ఉంది. కాకపోతే అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ఇండస్ట్రీలో 10 శాతం మంది అలాంటి వెధవలున్నారు. 90 శాతం మంది మంచివాళ్లు ఉన్నారు. వాళ్లను కూడా నిందించడం కరెక్ట్ కాదు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎవరైనా వేధిస్తే ‘చెప్పు తీసుకుని కొట్టండి. ఆ హక్కు మీకు ఉంటుంది’. బయట మాట్లాడుతున్నవారికంటే మాకూ మహిళలంటే చాలా గౌరవం ఉంది.
ఇండస్ట్రీమీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతుర్ని ఇండస్ట్రీలో పెడతా? ‘క్యాష్’ కమిటీకి మేము రెడీ. లైంగిక వేధింపులకు పాల్పడే కోఆర్డినేటర్లపై నిర్మాతలకు ధైర్యంగా ఫిర్యాదు చేయండి. షూటింగ్ స్పాట్‌లో జూనియర్ ఆర్టిస్టులకు కనీస సౌకర్యాలు కల్పించేలా నిర్మాతలందరితో మాట్లాడతాం. ఇండస్ట్రీలో ఇతర భాషలవారు పని చేయకూడదనడం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే. ఎవరైనా ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. తెలుగమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వమని నిర్మాతలను, దర్శకుల్ని ‘మా’ కోరుతోంది. కానీ వారిపై ఒత్తిడి చేసే హక్కు లేదు.
ఎవరికి అవకాశం ఇవ్వాలనేది దర్శక–నిర్మాతల ఇష్టం. మీడియా కూడా టీఆర్పీల కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడాలి. అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమని పవన్ అనడంలో తప్పేముంది? ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే కల్యాణ్ ఏం చేస్తాడు? ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. మేం బలవంతులం. మాకు భరించే శక్తి ఉంది. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు. ఇకపై మెగా ఫ్యామిలీని అనవసరంగా టార్గెట్ చేస్తే ఊరుకునేదిలేదు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించడం మంచిది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment