
మూడు కథల సమాహారంతో...
అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగై పోతున్న ఈ రోజుల్లో వాటి విలువను తెలియజెప్పడానికి చాలా చిత్రాలు వచ్చాయి. ఆ కోవలోనే వస్తున్న మరో చిత్రం ‘నక్షత్రం’. స్వీయ దర్శకత్వంలో వేణు రూపొందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పిల్లల ఆదరణకు నోచుకోని తల్లిదండ్రులు పడే వేదన, విదేశీ వ్యామోహంలో యువత కోల్పోతున్న ఆత్మీయ అనుబంధాలు, చదువు అందరికీ అందే రోజులు త్వరలోనే ఉన్నాయనే మూడు కథల సమాహారంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
వేణు మాట్లాడుతూ - ‘‘మూడు హృదయాల చప్పుడే ఈ చిత్రం. అమెరికాలోని నార్త్ కరోలినా ఏవియేషన్ ఫిలిం ఫెస్టివల్, డ్యూక్ యూనివర్శిటీలోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే ప్రశంసలు లభించాయి. తెలంగాణా చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది’’ అన్నారు. భూపాల్‌రె డ్డి, లక్ష్మీ ఆలపాటి, స్వాతి శ్రీరాం, బేబీ ఆధ్య, హరి, గోదూర్ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎడిటింగ్: వంశీ, కెమెరా: రాహుల్ మాచినేని.