ఆ రోజులు గుర్తొస్తున్నాయి : నందమూరి బాలకృష్ణ | Nandamuri Balakrishna's 'Legend' 275 Days Celebration | Sakshi
Sakshi News home page

ఆ రోజులు గుర్తొస్తున్నాయి : నందమూరి బాలకృష్ణ

Published Sun, Dec 28 2014 11:08 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఆ రోజులు గుర్తొస్తున్నాయి : నందమూరి బాలకృష్ణ - Sakshi

ఆ రోజులు గుర్తొస్తున్నాయి : నందమూరి బాలకృష్ణ

 ‘‘హుద్ హుద్ బాధితుల విషయంలో నా అభిమానులు స్పందించిన తీరును జీవితంలో మరచిపోలేను. ఇలాంటి అభిమానులున్నందుకు గర్విస్తున్నాను. వారి సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలి. మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలి’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కథానాయకునిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించిన చిత్రం ‘లెజెండ్’. ఈ చిత్రం వై.యస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో 275 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఘనంగా వేడుకను నిర్వహించారు. ‘లెజెండ్’ చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరవ్వడంతో జనంతో ప్రాంగణం కిక్కిరిసింది. బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ-‘‘నా ‘మంగమ్మగారి మనవడు’ నుంచి అప్పట్లో నా చాలా చిత్రాలు ఇలాంటి వేడుకలు జరుపుకున్నాయి.
 
 ఈ వేడుకతో మళ్లీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ‘సింహా’ లాంటి విజయం తర్వాత బోయపాటితో సినిమా అంటే అంచనాలు సహజం. కానీ భయపడకుండా చిత్తశుద్ధితో ఈ సినిమాకు పనిచేశాం. అందుకే ఈ ఫలితం. అన్నీ సమపాళ్లల్లో కుదిరిన సినిమా ఇది. ఇలాంటి విజయాన్ని అందించిన అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని చెప్పారు. బోయపాటి మాట్లాడుతూ ‘‘వంద రోజుల వేడుక అంటే పుష్కరానికి ఒకటి వస్తున్న నేటి రోజుల్లో ఏకంగా 275 రోజుల పాటు ‘లెజెండ్’ ప్రదర్శించడం సాధారణమైన విషయం కాదు. సహాయ దర్శకునిగా బాలకృష్ణగారితో చాలా సినిమాలు పనిచేశాను. ఆయన నడక, నడత, చూపు, కోపం వస్తే ఆయన కస్సున లేచే తీరు అన్నీ నాకు తెలుసు.
 
 ఆయన ‘సింహా’ చేయాల్సి వచ్చినప్పుడు ‘బాలయ్య రాయల్. ఆయనకు మామూలు కథ కరెక్ట్ కాదు’ అనుకొని ‘సింహా’ తయారు చేశాను. ‘సింహా’ తర్వాత అంతకంటే గొప్పగా ఎలా చూపిస్తావ్ అని అందరూ అన్నప్పుడు ఛాలెంజ్‌గా తీసుకొని ‘లెజెండ్’ చేశాను. ఇప్పటివరకూ నేను అయిదు సినిమాలకు దర్శకత్వం వహిస్తే రెండు బాలయ్యతోనే చేశా. మళ్లీ ఆయనతో సినిమా ఉంటుంది. అది ఇంతకంటే గొప్పగా ఉండటానికి ప్రయత్నిస్తా’’ అని చెప్పారు.  అనంతరం చిత్రబృందం కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చి ప్రమాదానికి గురై మరణించిన ఇద్దరు అభిమానులకు బాలకృష్ణ సంతాపం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబాలను ఆదుకుంటానని మాటిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement