బాలయ్య రిస్క్ చేస్తున్నాడా..?
నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఓ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. తన వందో సినిమాలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు దర్శకులుగా బోయపాటి శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు వినిపించినా.., ఫైనల్గా క్రిష్ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ. శాతవాహన రాజు గౌతమీ పుత్రశాతకర్ణి పాత్రలో బాలయ్య నటించనున్నాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించడానికి రెడీ అవుతున్నారు.
వారాహి చలనచిత్ర నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి క్రిష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడు. 50 కోట్ల బడ్జెట్తో భారీగా ఈ సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు మొరాకోలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్లు అదే స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగానే అవుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే బాలకృష్ణ మార్కెట్ పరంగా అంత బడ్డెట్ వర్క్ అవుట్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు బాలకృష్ణ ఒకే ఒక్కసారి లెజెండ్ సినిమాతో 40 కోట్ల మార్క్ను రీచ్ అయ్యాడు. ఘనవిజయం సాధించిన సింహాతో రూ. 30 కోట్లు. రీసెంట్ సినిమా డిక్టేటర్తో 20 కోట్లకు పైగా వసూళ్లు చేసిన బాలకృష్ణ, 50 కోట్ల సినిమా చేస్తే ఆ మొత్తాన్ని కలెక్షన్ల రూపంలో వసూలు చేయటం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
డైరెక్టర్ క్రిష్ రికార్డ్ కూడా కలెక్షన్ల విషయంలో అంతా గొప్పగా లేదు. ఇప్పటి వరకు క్రిష్ కెరీర్ భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా కంచె. అది కూడా 20 కోట్ల సినిమానే. ఈ సినిమా కూడా కమర్షియల్గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు 50 కోట్లతో క్రిష్ సినిమా చేస్తే అది సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత వరకు ఉందన్న చర్చ మొదలైంది. 50 కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కిస్తే దాదాపు 70 కోట్ల వరకు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మరి బాలయ్య, క్రిష్ కాంబినేషన్కు అంతా స్టామినా ఉందా..?