
వేలన్ ఎట్టుత్తిక్కుమ్ చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: యువ నటుడు నాని తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. నేచురల్ స్టార్‌గా అభిమానుల మనసులను దోచుకుంటున్న ఈయన త్వరలో బిగ్‌బాస్–2కు వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. వెప్పం వంటి కొన్ని చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నాని తాజాగా మరోసారి సంచలన నటి అమలాపాల్‌తో కలిసి కోలీవుడ్ తెరపైకి రానున్నారు. అవును నాని, అమలాపాల్ జంటగా నటించిన వేలన్ ఎట్టుత్తిక్కుమ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దర్శకుడిగా, నటుడిగా బిజీగా ఉన్న సముద్రకని దర్శకత్వం వహించి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో నటుడు శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించడం విశేషం.
నాజర్, చిత్రలక్ష్మణన్, శివబాలాజి, పార్వతీమీనన్, నాగిని త్రివేది ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని నాగిన్ పిక్చర్స్ పతాకంపై కే.నరాగన్ పిళ్‌లై తమిళ ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీనికి యువ సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీత బాణీలు కట్టారు. ఎం.సుకుమార్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ ఇవాళ అవినీతి, లంచం వంటి అక్రమాలు జరగని దేశమే లేదన్నారు. అదే విధంగా ఎంత పెద్ద నేరానికి అయినా ఒక రేటును నిర్ణయింపబడుతోందన్నారు. నేరస్తులు నిరపరాధులుగా, నిరపరాధులు నేరస్తులు గానూ మార్చబడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి అరవింద్ అనే యువకుడి చేసిన పోరాటమే వేలన్ ఎట్టుత్తిక్కుమ్ చిత్రం అని చెప్పారు. నటుడు శరత్‌కుమార్ పాత్ర ఇందులో విభిన్నంగా ఉండి ప్రశంసలు అందుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక సామాజిక సందేశంతో కూడా యాక్షన్ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment