
ముంబై : ఎవరామె? ఆమె బుడిబుడి అడుగులు నేర్చుకుంటున్న సమయంలోనే కన్నతండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అసలే పేదరికం. బతుకు గడవటం కష్టంగా మారిన పరిస్థితుల్లో సొంత ఊరు గోర్కీ(రష్యా)లోనే తల్లి ఓ పండ్ల దుకాణంలో పనిలో కుదిరింది. స్కూల్ నుంచి సరాసరి పండ్లకొట్టుకు వెళ్లి తల్లికి సాయం చేసేదా చిన్నారి. కొన్నేళ్లకి.. స్నేహితుల సహకారంతో తల్లికి సొంత పండ్ల దుకాణాన్ని పెట్టించింది. 15 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఏజెన్సీలో పేరు నమోదు చేయించుకుంది. తొలినాళ్లలో చిన్నాచితకా బ్రాండ్లకు పనిచేసిన ఆమె రెండేళ్ల తర్వాత పారిస్ బాటపట్టింది. వివా మోడల్‌గా కాంట్రాక్టుపై సంతకం చేసిన తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. టాప్ ఫ్యాషన్ షోలన్నింటిలో తనదైన ప్రతిభకనబర్చింది. పేరు తోపాటు భారీగా డబ్బునూ సంపాదించింది. ఆమె మరెవరోకాదు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మోడల్‌గా ఖ్యాతిపొందిన నటాలియా వొడియనోవా. సంపాదించిన డబ్బులో అధికభాగాన్ని పేదల కోసం ఖర్చుపెడుతూ గొప్ప వితరణశీలిగానూ పేరుతెచ్చుకుందామె.
అంబానీ ఇంట్లో గ్రాండ్ పార్టీ : ‘నేకెడ్ హార్ట్’ ఫౌండేషన్ ద్వారా నటాలియా.. పలుదేశాల్లోని నగరాలు, పట్టణాల్లో పేదకుటుంబాలకు చెందిన పిల్లలకు అవసరమైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందించే పనిలో ఉంది. ఫౌండేషన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబై వచ్చిన ఆమెను.. ‘రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి (రిలయన్స్ ఫౌండేషన్ చీఫ్) నీతా అంబానీలు ఇంటికి ఆహ్వానించారు. ఆమె గౌరవార్థం శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ముంబై షోషలైట్లతోపాటు బాలీవుడ్ తారాలోకం సైతం పార్టీలో పాలుపంచుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, నీతా అంబానీ, వారి కూతురు ఇషా, కరీనా, కరిష్మా, జాక్వెలిన్, మలైకా, పద్మాలక్ష్మి, శ్రద్ధాకపూర్, కరణ్‌జోహార్, వరుణ్‌ధావన్, మనీశ్ మల్హోత్రా, అర్జున్ కపూర్, హృతిక్ రోషన్ తదితర స్టార్లు సందడిచేశారు.
(ఫొటో స్లైడర్ చూడండి..)






