
సడన్‌గా జర్క్... ఇప్పుడు ఎనర్జీ
ఉద్యోగాల నిమిత్తం విదేశాలు వలస వెళ్లిన పిల్లలు... స్వదేశంలో సంతానాన్ని తలచుకుంటూ తల్లడిల్లే తల్లిదండ్రులు... వాళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, చిన్ని చిన్ని మనస్పర్థలు – వీటి సమాహారంతో రూపొందిన చిత్రం ‘శతమానం భవతి’. కథ చాలా సింపుల్. మరి, ఎందుకంత పెద్ద విజయం సాధించింది? నేషనల్ అవార్డు ఎందుకొచ్చింది? అనే ప్రశ్నలు వేసుకుంటే... ప్రతి ఒక్కరి మనసును మీటే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉన్నాయి.
స్వదేశం నుంచి విదేశాలు కావొచ్చు... పల్లెటూరి నుంచి పట్నాలు కావొచ్చు... ఉద్యోగాల నిమిత్తం తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్న పిల్లలు దాదాపు ప్రతి ఊరిలో, ప్రతి కుటుంబంలో కనిపిస్తున్న రోజులివి. అందుకే తెరపై జరుగుతున్న కథను ప్రేక్షకులందరూ తమ కథగా భావించారు. సినిమా ఘనవిజయం సాధించింది. 64వ జాతీయ అవార్డుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా పురస్కారం గెలుచుకుంది.
లైఫ్‌లో కోల్పోయిన దానికంటే... అవార్డు ఎక్కువ!
‘ఇటీవల నా అర్ధాంగి అనూహ్యంగా మరణించడంతో ఏదో కోల్పోయాననే భావన. అప్పట్నుంచీ, నేను ఒంటరిగా ఫీలైన ప్రతిసారీ ‘ఇదే ఇదే జీవితం.. సుఖ దుఃఖాల సంగమం’ పాటను వింటున్నా. గతేడాది నవంబర్ 4నుంచి నా లైఫ్‌లో అన్నీ ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి. సడన్‌గా భగవంతుడు ఓ జర్క్ ఇచ్చాడు. అందులోంచి మళ్లీ తేరుకోవడానికి నేనేదో ప్రయత్నం చేస్తుంటే... ఇది కాదని, భగవంతుడే మా సినిమాకు నేషనల్ అవార్డు ఇచ్చి ఎనర్జీని ఇచ్చాడు.
నిర్మాతగా 14 ఏళ్లు పూర్తి చేసుకున్నా. 25వ సినిమా నిర్మాణంలో ఉంది. ఈ టైమ్‌లో ఇప్పటివరకూ చూడని ఓ అవార్డు (నేషనల్) వచ్చింది. ఇది చాలా స్పెషల్. లైఫ్‌లో నేను కోల్పోయిన దానికంటే (భార్య మరణం) ఈ అవార్డును ఎక్కువగా భావిస్తున్నా. మంచి సినిమాలు తీయడానికి దేవుడు ఈ అవార్డు ఇచ్చాడనుకుంటున్నా. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ మిస్ కాకుండా తదుపరి సినిమాలు తీయాలనే బాధ్యతను భారత ప్రభుత్వం నాపై పెట్టింది. ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయాలనేది నా టార్గెట్. – నిర్మాత ‘దిల్’ రాజు
మా సినిమాకు ఆ రెండూ రావడం హ్యాపీ!
ఈ అవార్డు తల్లిదండ్రులు అందరిదీ, కన్నబిడ్డలు అందరిదీ. మంచి సినిమా తీస్తే ఆదరించడానికి మేమున్నామని ప్రేక్షకులు అంటే.. ప్రోత్సహించడానికి మేమున్నామంటూ కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా అవార్డు సినిమాలకు వసూళ్లు, కమర్షియల్‌గా హిట్టయిన సినిమాలకు అవార్డులూ రావడం కష్టం అంటుంటారు. మా సినిమాకు రెండూ వచ్చాయి. – దర్శకుడు సతీశ్ వేగేశ్న
డబుల్ హ్యాపీ
వెరీ హ్యాపీ. ‘శతమానం భవతి’తో పేరు, డబ్బు, అవార్డులు... అన్నీ వచ్చాయి. ఇంతకంటే ఏం అడగను? ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలనేది నా అభిమతం. ‘గమ్యం’, ‘ప్రస్థానం’ వంటి సినిమాలు చేస్తూనే ఉన్నాను. ప్రేక్షకుల ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. ఈసారి నేషనల్ అవార్డు రావడమనేది డబుల్ హ్యాపీ. - హీరో శర్వానంద్