అభిమానులకు చేదు వార్త!
నయనతారకు షాకులివ్వడం కొత్త కాదు. ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తర్వాత తాను యాక్టింగ్‌కి దూరమైపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రకటించారు. ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధమై అప్పుడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రభుదేవాకు దూరమై, మళ్లీ సినిమాలకు దగ్గరయ్యారు. తమిళంలో కొన్ని సినిమాలు, తెలుగులో నాగార్జున సరసన ‘గ్రీకువీరుడు’ చేశారు. త్వరలో వెంకటేశ్‌తో ‘రాధా’ సినిమా చేయబోతున్నారు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ‘కాతిర్‌వెలిన్ కాదల్’ చేశారు. అది త్వరలోనే విడు దల కానుంది.
ఇంకొన్ని తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై ఏడాదికి ఒకే ఒక్క దక్షిణాది సినిమా చేయాలని నిశ్చయించుకున్నారట. అది తమిళం అయినా కావచ్చు, తెలుగు అయినా కావచ్చు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఏమిటంటే - నయన బాలీవుడ్‌లో స్థిరపడాలనుకుంటున్నారట. అందుకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఏదో ఒక హిందీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇలియానా, కాజల్, తమన్నాలాగా హిందీ సినిమాలు చేయాలనుకోవడం మంచి విషయమే కానీ, దక్షిణాదికి దూరం కావాలనుకోవడమే అభిమానులకు మింగుడు పడని విషయం.