4 సీ అడుగుతున్న నయన
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. అలాగని కాలం కలిసొచ్చింది కదా అని తనను వెతుక్కుంటూ వచ్చిన వారిని బెంబేలెత్తించడం మితి మీరిన చర్యే అవుతుంది. నయనతార గురించి పరిశ్రమలోని ఒక వర్గం అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తోంది. నయన మంచి నటే ఈ విషయంలో మరో మాటకు తావులేదు.ప్రస్తుతం ఈ అమ్మడు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉన్నారు. ఇక హీరోయిన్‌గా మరో ఇన్నింగ్స్ ఉండే అవకాశం లేదు. అందుకే చేతనైనంతా ఇప్పుడే సంపాదించుకోవాలనే ధోరణి తనలో స్పష్టంగా కనిపిస్తోందనే భావన వ్యక్తం అవుతోంది. ఇటీవల నయనతార నటించిన నానుమ్ రౌడీదాన్, తనీఒరవన్, మాయ చిత్రాలు మంచి విజయాలను సాధించి ఆమె స్థాయిని మరింత పెంచాయన్నది నిజం.
ముఖ్యంగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన హారర్ కథా చిత్రం మాయ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం మలయాళంలో డబ్ అయి వంద రోజులు ప్రదర్శింపబడడం గమనార్హం. దీంతో మరిన్ని భారీ బడ్జెట్ హారర్ కథా చిత్రాల అవకాశాలు ఈ అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే నయనతార మాత్రం మంచి తరుణం మించిపోనీరాదంటూ పారితోషకం విషయంలో అధిక డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఆమె డిమాండ్ చేస్తున్నది ఎంతో తెలుసా? ఇప్పటికే ఈ సొగసరి రెండున్నర నుంచి మూడు కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నారని ప్రచారంలో ఉంది. తాజాగా దాన్ని మరో సీ(కోటి)కి పెంచేసిందని టాక్. ఇటీవల ఒక దర్శకుడు నయనతారతో ఒక హారర్ కథా చిత్రం చేయడానికి కాల్‌షీట్స్ అడిగారట.
అందులో నటించడానికి పచ్చజెండా ఊపినా,ఆమె అడిగన పారితోషికానికి ఆ దర్శకుడికి ముచ్చెమటలు పోశాయట. ఇంతకీ నయనతార ఎంత అడిగిందనేగా మీ ఉత్సుకత.అక్షరాలా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట.ఆమె పారితోషికంతో సంగం చిత్రం పూర్తి చేయవచ్చునని భావించిన ఆ దర్శకుడిప్పుడు నయనతారను అనుకున్న పాత్రలో నటి అంజలిని ఎంపిక చేసుకున్నారు. ఈ కేరళ భామ ఇలాగే పారితోషికం విషయంలో డిమాండ్ చేసుకుంటూ పోతే భవిష్యత్‌లో ఆమెకు ప్రత్యామ్నాయంగా అంజలి లాంటి నటీమణులు తయారవుతానే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.ప్రస్తుతం నయనతార తిరునాళ్, కాష్మోరా, ఇరుమగన్ చిత్రాల్లో నటిస్తున్నారు. శింబుతో నటిస్తున్న ఇదునమ్మఆళు చిత్రం ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటోంది.వీటితో పాటు వెంకటేశ్‌కు జంటగా ఒక తెలుగు చిత్రం చేస్తోంది.