
సూర్యతో ఆ ఇద్దరు
కోలీవుడ్‌లో మళ్లీ కథానాయకుల ద్విపాత్రాభినయాల జోరు పెరిగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మశ్రీ కమల్ హాసన్‌లు చాలా కాలం తరువాత ఒకే సమయంలో డ్యూయల్ రోల్ చిత్రాలు చేయడం విశేషం. కమల్ హాసన్ ఉత్తమ విలన్ చిత్రంలోను, రజనీకాంత్ లింగా చిత్రం లోనూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పైకొచ్చాయి. తాజాగా ఈ దిగ్గజాల బాటలో నటుడు సూర్య పయనించడానికి రెడీ అవుతున్నారు. మంగాత్తా, బిరియాని, చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా సూర్య హీరోగా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే షూటింగ్ ప్రారంభమయిన ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. వీటిలో ఒకటి ఆత్మ పాత్ర అని సమాచారం. హాలీవుడ్ చిత్రం హలో ఘోస్ట్, కోలీవుడ్ చిత్రం కల్యాణ రామన్ చిత్రాల తరహాలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణరామన్ చిత్రంలో కమల్ హాసన్ ఎత్తు పళ్లు, టింకర నడకలతో అమాయక పాత్ర అయిన టైటిల్ పాత్రను అద్భుతంగా పోషించారు. ఇప్పుడు ఆ తరహా పాత్రలో సూర్య కూడా ఒక డిఫరెంట్ గెటప్‌కు మారనున్నారట. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఇద్దరు సూర్యలకు ఇద్దరు అందాల భామలు రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. వీరిలో క్రేజీ తార నయనతార ఇప్పటికే ఓకే అయ్యారు.
సూర్య, నయనతారల కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆదవన్ చిత్రం వచ్చింది. మరో సారి ఈ జోడీ తెరపై అలరించనున్నారు. అలాగే మరో హీరోయిన్‌గా సెక్సీ బ్యూటీ ఎమీజాక్సన్‌ను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ పాత్రకు నటి శ్రుతి హాసన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే సూర్య, శృతిహాసన్ ఇంతకు ముందు నటించిన 7ఆమ్ అరివు చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆమె ఈ తాజా చిత్రంలో ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి యువ గీత రచయిత మాదన్ కాల్గి మాటలు రాయడం విశేషం.