2003 డిసెంబర్ 25న కేరళలో ‘మనస్సినకరే’ అనే మలయాళ సినిమా విడుదలైంది. అందులో గౌరి అనే పాత్ర చేసింది ఓ అమ్మాయి.
2003 డిసెంబర్ 25న కేరళలో ‘మనస్సినకరే’ అనే మలయాళ సినిమా విడుదలైంది. అందులో గౌరి అనే పాత్ర చేసింది ఓ అమ్మాయి. తొలి సినిమాకే ప్రశంసలు. ఉత్తమ నూతననటిగా ఏషియానెట్ టీవీ అవార్డు కూడా అందుకుంది ఆ అమ్మాయి. బహుశా... ఆమె అప్పుడనుకుని ఉండదు... కథానాయికగా ఏళ్ల తరబడి కొనసాగుతానని, సూపర్‌స్టార్లతో జతకడతానని, వివాదాలకు కేంద్రబిందువునవుతానని. ఆమె ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. తనే... నయనతార. నేడు ఈ మలయాళ మందారం పుట్టిన రోజు. 29వ సంవత్సరంలో అడుగుపెడుతోన్న నయనతార జీవితం నిజంగా చీకటి వెలుగుల సమ్మిళితం.
వ్యక్తిగత జీవితమే ఆమె కెరీర్‌కి ప్రతిబంధకంగా మారుతూ వచ్చిందని చెప్పాలి. పాత్రలకు అనుగుణంగా తన బాడీలాంగ్వేజ్‌ని ఎప్పటికప్పుడు మార్చుకోవడం నయనతార ప్రత్యేకత. ‘చంద్రముఖి’ సినిమాలో చాలా బబ్లీగా కనిపించిన నయన... కొన్నాళ్ల తర్వాత విశాల్‌తో నటించిన ‘శాల్యూట్’ సినిమా కోసం జీరో సైజ్‌కి వెళ్లారు. దక్షిణాది కథానాయికల్లో జీరో సైజ్‌లో కనిపించిన తార నయనతార మాత్రమే. గ్లామర్ పాత్రలే అధికంగా చేసిన నయన ‘శ్రీరామరాజ్యం’లో సీతగా రాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నటుడు శింబుతో చనువుగా ఉండే ఫొటోలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేయడం, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్లి పెటాకులవ్వడం ఇవన్నీ ఆమె జీవితంలో చేదు అనుభవాలు.
‘ఆర్యతో పెళ్లి’ అంటూ తమిళనాట మొన్నటివరకూ హల్‌చల్ చేసిన ఓ రూమర్ మళ్లీ నయనకు ఊపిరి తీసుకోకుండా చేసింది. అయినా... ఎప్పటికప్పుడు ఎగసిపడే కెరటంలా తారాలోకంలో దూసుకుపోతూనే ఉన్నారు నయనతార. ఇన్ని ఎత్తుపల్లాలనూ అధిగమించి ధైర్యంగా ఆమె ముందుకు సాగగలుగుతున్నారంటే.. అందుకు కారణం ఆమెలోని ప్రతిభే. అటు అగ్ర హీరోలతో, ఇటు కుర్రహీరోలతో సమాంతరంగా జతకడుతూ క్షణం ఖాళీ లేకుండా ముందుకు సాగిపోతున్నారు నయన. ప్రస్తుతం తెలుగులో శేఖర్‌కమ్ముల ‘అనామిక’ సినిమా, బి.గోపాల్-గోపీచంద్ సినిమా చేస్తూ బిజీగా ఉన్న నయన... తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నారు.