
తమిళసినిమా: లోకం ఏమనుకున్నా డోంట్‌కేర్ అంటోంది నటి నయనతార. నటుడు శింబుతో ప్రేమ విఫలం, ప్రభుదేవాతో పెళ్లి విఫలం వంటి సంఘటనలను అధిగమించి కథానాయకిగా రాణిస్తున్న లక్కీ నటి నయనతార. ప్రేమ, పెళ్లి వంటి వివాదాల్లో చిక్కి విసిగిపోయిన ఈ అమ్మడు ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తోందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇద్దరిలో ఏ ఒక్కరూ బహిరంగంగా చెప్పుకోవడం లేదు. ఒకరి పుట్టిన రోజున ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేశ, విదేశాల్లో విహారయాత్రలు చేస్తూ జీవితాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. నటి నయనతార తన ప్రియుడు విఘ్నేశ్‌శివకు అత్యంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వీరి విషయం గురించి లోకం కోడై కూస్తోంది. ఇదిలాఉండగా కేరీర్ పరంగా మాత్రం నయనతార అగ్ర కథానాయకిగానే వెలిగిపోతోంది.
ప్రస్తుతం ఇమైకా నోడిగళ్, కొలమావు కోకిల, కొలైయుధీర్ కాలం వంటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు అజిత్ సరసన విశ్వాసం, తెలుగులో చిరంజీవితో సైరా నరసింహారెడ్డి, శివకార్తికేయన్ సరసన ఒక చిత్రం చేస్తూ యమ బిజీగా ఉంది. వీటిలో కొలమావు కోకిల చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. ఇందులో ఈ అమ్మడు మాదక ద్రవ్యాలు విక్రయించే యువతిగా నటించినట్లు సమాచారం. సాధారణంగా తన చిత్రాల ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండే నయన్ కొలమావు కోకిల చిత్ర ప్రమోషన్‌లో పాల్గొనడం విశేషం. ఇటీవలే ఈ చిత్రంలోని ఒక పాటను తన ప్రియుడుగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివతో ఆవిష్కరింపజేసింది. తాజాగా ఒక టీవీ భేటీలో పాల్గొంది. ఈ సందర్భంగా తన ప్రేమ గురించి చర్చించుకునే వారి గురించి ఈ సక్కనమ్మ బదులిస్తూ ఈ ప్రపంచం మిమ్మల్ని చూసే విధం రోజుకో విధంగా మారిపోతూనే ఉంటుంది. కొందరికి ఈ రోజు నచ్చుతారు. రేపు వారికి నచ్చకపోవచ్చు. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం జీవితాన్ని అనుభవించలేం అని పేర్కొంది.