ఆ కారులో షికారు బేజారు!
సినిమాలో లీడ్ రోల్ చేసే ఆర్టిస్ట్ లుక్ ఎలా ఉంటుందో విడుదలకు ముందు చూపించడానికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తుంటారు. ఫేవరెట్ స్టార్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. నయనతార అభిమానులు ఆమె టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డోర’ ఫస్ట్ లుక్ కోసం అలానే ఎదురు చూశారు. లుక్ బయటికొచ్చింది. నయనతార వెనక్కి తిరిగి ఉన్న ఈ లుక్‌ని చూసి, ‘మేడమ్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుండేది’ అని ఫ్యాన్స్ అనుకోవడం సహజం. కానీ, ఈ పోస్టర్‌లో నయనతార ముందు కారు, పైన మేఘాల్లో కనిపిస్తున్న ఫేసు చూసి, సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీ చేస్తోందని ఆనందపడుతున్నారు.
దాసు రామస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ హార్రర్ మూవీ రూపొందుతోంది. తెలుగులో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకూ వచ్చిన హార్రర్ చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది. నయనతార పాత్ర చాలా బాగుంటుంది’’ అన్నారు. ఈ చిత్రంలో ఓ కారు పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ కారులో షికారు చేసేవాళ్లు బేజారైపోతారట. దానికీ, డోరాకీ లింకేంటి? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.