
ఓ మై గాడ్...!
అనుకున్నవన్నీ జరగనిదే జీవితం. సినిమా పరిశ్రమ కూడా అంతే. ఊహించని పరిణామాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అష్టా చమ్మా గడుల్లో పావుల్లా... ఇక్కడి పరిస్థితుల్లో నిలకడ ఉండదు. రీసెంట్‌గా అలాంటి పరిస్థితే నయనతార విషయంలో ఎదురైందట. ‘ఓ మై గాడ్’ తెలుగు రీమేక్‌లో నటించడానికి నయనతార పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే... ఇప్పుడు ఆ సినిమా నుంచి నయన తప్పుకున్నారని టాక్. వివరాల్లోకెళ్తే... వెంకటేశ్ ‘రాధ’ చిత్రం ఆగిపోవడంతో... ఆ సినిమాకు సంబంధించిన నయనతార డేట్స్‌ని ‘ఓ మైగాడ్’కి ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే... కథానుగుణంగా ‘రాధ’లో నయనతారది హీరోకు సమానమైన పాత్ర. ‘ఓ మైగాడ్’లో మాత్రం ఆమెది చాలా చిన్న పాత్ర. చిక్కంతా ఇక్కడే వచ్చింది.
‘రాధ’ చిత్రంలో నటించడానికి భారీ పారితోషికం అడిగారట నయనతార. అవే డేట్స్‌ని ఇప్పుడు ‘ఓ మైగాడ్’కు వాడుతున్నారు కాబట్టి, సదరు చిత్ర నిర్మాతలను అదే మొత్తం పారితోషికంగా ఇవ్వాలని నయన డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే... పాత్ర చిన్నది అవ్వడంతో అంత పారితోషికం మేం ఇవ్వలేమని కరాఖండీగా చెప్పేశారట సదరు చిత్ర నిర్మాతలు. ‘‘పాత్ర చిన్నదో పెద్దదో నాకు అనవసరం. నా డేట్స్ మీ దగ్గరున్నాయి. దానికి తగ్గ పారితోషికం మీరు ఇవ్వాల్సిందే’ అనేది నయన వాదన. దానికి ‘ఓ మై గాడ్’ నిర్మాతలు ససేమిరా అనడంతో... ‘ఓ మై గాడ్’ నుంచి నయన తప్పుకున్నారని తెలిసింది. మరి నయనతార స్థానాన్ని భర్తీ చేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో చూడాలి. ఏది ఏమైనా... ఓ గొప్ప అవకాశాన్ని నయనతార చేజార్చుకున్నారని ఫిలింనగర్ టాక్.