
అందుకే ఆమె లేడీ సూపర్‌స్టార్
ఒకప్పుడు గ్లామరస్ స్టార్. ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్. ఆ నటి ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్ దటీజ్ ఒన్ అండ్ ఓన్లీ నయనతార. ఇప్పుడు తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, టాపెస్ట్‌స్టార్. టాలెంటెడ్ యువ దర్శకులకు ఆశాస్టార్, నిర్మాతలకు వసూళ్ల క్వీన్. ఇంతకీ ఈ పట్టానికి ఎందుకు అర్హురాలయ్యారంటే, చిత్ర షూటింగ్‌లో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగానే చేతులు దులుపుకుని వెళ్లి కెరవన్ వ్యాన్‌లో విశ్రాంతి తీసుకోరు. షూటింగ్ లొకేషన్‌లోనే ఉండి సహ నటీనటుల నటనను గమనిస్తుంటారు. షూటింగ్‌లో ఆలస్యం అయినా చిరాకు పడరు. కస్సుబుస్సులాడరు. ప్రశాంతంగా ఉంటారు.
నటనపై అంకితభావం మెండు. ఈ విషయాలను ఆమెతో కలిసి నటించే సహ నటీనటులందరూ గ్రహించే విషయం. ప్రముఖ నటినన్న గర్వాన్ని ప్రదర్శించరు. అందుకే నయనతార అంటే అందరూ ఇష్టపడతారు. స్టార్ హీరోల నుంచి, యువ నటుల వరకూ నయనతారతో నటించాలని కోరుకుంటారు.అందుకే నయనతార లేడీసూపర్‌స్టార్ అయ్యారు.ఇలా అన్నది ఎవరో కాదు నయనతార నటించిన డోర చిత్రంలో ఆమెతో నటించిన నటుడు హరీష్ ఉత్తమన్. డోర చిత్రం ఈ నెల 31న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.దీంతో సెన్సార్‌బోర్డుపై దర్శకుడు విఘ్నేశ్‌శివ విమర్శలు గుప్పించడం విశేషం.ఈయనకేం సంబంధం అని మాత్రం అడగకండి. ఈయన నటి నయనతార ప్రేమించుకుంటున్నారన్న వ్యవహారం గురించి మీడియాలో చాలా కాలంగానే ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.
అంతే కాదు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న టాక్ కోలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. అయినా ఈ విషయం గురించి ఇటు నయనతార గానీ, అటు దర్శకుడు విఘ్నేశ్‌శివగానీ నోరు మెదపడంలేదు. ఇంతకీ డోర చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం గురించి దర్శకుడు విఘ్నేశ్‌శివ స్పందన ఏమిటన్నదేగా మీ ఆసక్తి. అక్కడికే వస్తున్నాం. డోర చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇస్తారు. దృవంగళ్ 16, మానగరం చిత్రాలాంటి వాటికి యూఏ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇటీవల విడుదలైన పలు చిత్రాలకు యూ సర్టిఫికెట్లు అందిస్తారు. రాను రాను సెన్సార్ బోర్డుపై ప్రేమ రోజురోజుకు అధికం అవుతోంది అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.