టైటిల్ : నీవెవరో
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితీకా సింగ్, వెన్నెల కిశోర్
సంగీతం : అచ్చు రాజమణి, ప్రసన్
దర్శకత్వం : హరినాథ్
నిర్మాత : ఎంవీవీ సత్యానారాయణ, కోన వెంకట్
సరైనోడు, రంగస్థలం సినిమాలతో టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ నీవెవరో. తమిళ సినిమా అదే కంగల్ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి అంధుడిగా కనిపించనున్నాడు. చాలా కాలంగా టాలీవుడ్‌లో సోలో హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న ఆది, ఈ సినిమాతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. బాలీవుడ్‌లో నటిగా ప్రూవ్ చేసుకున్న తాప్సీ నీవెవరో సినిమాతో సక్సెస్ మీద కన్నేశారు. మరి ఆది, తాప్సీల కలను నీవెవరో నెరవేర్చిందా..? ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది.?
కథ ;
పదిహేనేళ్ల వయసులో కళ్లు పొగొట్టుకున్న కల్యాణ్ (ఆది పినిశెట్టి) తన వైకల‍్యాన్ని జయించి ఓ పాపులర్ రెస్టారెంట్‌కు ఓనర్ అవుతాడు. అంతేకాదు ఆ రెస్టారెంట్‌లో తానే మాస్టర్ చెఫ్ కూడా. తనకు రెస్టారెంట్ లో కలిసి వెన్నెల (తాప్సీ) అనే అమ్మాయి నచ్చి ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు కల్యాణ్. తన ప్రేమ విషయం వెన్నెలకు చెప్పాలనుకున్న సమయంలో ఆమె ఓ ప్రాబ్లమ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వెన్నెల తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పటంతో కల్యాణ్ తను దాచుకున్న డబ్బును వెన్నెలకు ఇచ్చేదామని నిర్ణయించుకుంటాడు. కానీ అదే రాత్రి యాక్సిడెంట్ అయి కల్యాణ్ మూడు వారాల పాటు హాస్పిటల్‌లో ఉండిపోవాల్సి వస్తుంది. (సాక్షి రివ్యూస్) అదే సమయంలో కల్యాణ్‌కు చూపు కూడా వస్తుంది. హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన కల్యాణ్, వెన్నెల ఎక్కడుందో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ కనిపెట్టలేకపోతాడు. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి చేయటంతో తన బెస్ట్ ఫ్రెండ్ అను (రితికా సింగ్)ను పెళ్లిచేసుకునేందుకు ఒప్పుకుంటాడు. అనుతో ఎంగేజ్‌మెంట్‌కు సిద్ధమైన కల్యాణ్‌కు వెన్నెలను కొంత మంది కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. ఆమె కాపాడేందుకు వెళ్లిన కల్యాణ్‌కు ఎదురైన పరిస్థితులేంటి..? అసలు వెన్నెల ఏమైంది..? కల్యాణ్, వెన్నెలను కలుసుకున్నాడా. లేదా.? అన్నదే మిగతా కథ.
నటీనటులు ;
సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి సోలో హీరోగా మరింత బాధ్యతగా నటించాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాకు తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్‌తో మరింత హైప్ తీసుకువచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో అంధుడిగా ఆకట్టుకున్న ఆది, సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. నటిగా బాలీవుడ్ లో మంచి మార్కులు సాధించిన తాప్సీ టాలీవుడ్‌లోనూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలోనే కనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తాప్సీ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది. గురు ఫేం రితికా సింగ్‌కు మంచి పాత్ర దక్కింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో రితికా పర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్ మరోసారి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోకు సహాయం చేసే కానిస్టేబుల్ పాత్రలో అక్కడక్కడ కామెడీ పండించినా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఇతర పాత్రల్లో శివాజీ రాజా, తులసి, సప్తగిరి, ఆదర్శ్, దీక్షిత్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ ;
తమిళ సినిమాను దాదాపుగా అదే కథా కథనాలతో టాలీవుడ్‌లో రీమేక్ చేశాడు దర్శకుడు హరినాథ్. అయితే టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి, ఆది ఇమేజ్‌కు తగ్గట్టుగా కాస్త హీరోయిజం, యాక్షన్ యాడ్ చేశారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించటంలో దర్శకుడు తడబడ్డాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సి వేగం ఎక్కడా కనిపించదు. కథనం కూడా ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగా సాదాసీదాగా సాగటం నిరాశ కలిగిస్తుంది. ప్రసన్, అచ్చు రాజమణి అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన వెన్నెలా.. పాట విజువల్‌గా కూడా సూపర్బ్. నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ ;
లీడ్ యాక్టర్స్ నటన
కథ
మైనస్ పాయింట్స్ ;
థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన వేగం లోపించటం
సెకండ్ హాఫ్
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment