వారసురాలి ఎంట్రీపై ఒత్తిడిలో 'మెగా'ఫ్యామిలీ! | niharika's debut is snowballing into a controversy as fans pressurise mega family to not allow her to act | Sakshi
Sakshi News home page

వారసురాలి ఎంట్రీపై ఒత్తిడిలో 'మెగా'ఫ్యామిలీ!

Published Sat, Oct 10 2015 1:08 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

వారసురాలి ఎంట్రీపై ఒత్తిడిలో 'మెగా'ఫ్యామిలీ! - Sakshi

వారసురాలి ఎంట్రీపై ఒత్తిడిలో 'మెగా'ఫ్యామిలీ!

టాలీవుడ్ ఇండస్ట్రీకి వారసులు రావడం చాలా కామన్. హిస్టరీని తీసుకుంటే హీరోలు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టుల తనయులు హీరోలు అయ్యారు. కానీ, వారి కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవ్వడం ఎప్పుడో గానీ జరగదు. తాజాగా ఈ  జాబితాలోకి నటుడు నాగబాబు కుమార్తె నీహారిక చేరిందన్న వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుందన్న విషయం అందరికీ విదితమే. వ్యాఖ్యాతగా ఇప్పటికే బుల్లితెరపై బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న 'మెగా' ఫ్యామిలీ అమ్మాయి నీహారిక ఇప్పుడు వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సిద్దమైంది.

 

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు  హీరోలుగానే వెండితెరకు పరిచయం అయ్యారు...అవుతున్నారు కూడా.  అయితే  నాగబాబు కూతురు నీహారిక  వెండితెరకు పరిచయం అవుతుందనే  వార్తలు గతంలోనే జోరుగా వినిపించాయి.  అక్కినేని అఖిల్ సరసన నటించబోతోందని వార్తలొచ్చాయి కూడా.అఖిల్, నీహారిక ఇద్దరు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే.

తర్వాత ఏమైందో తెలియదు కానీ  నీహారిక తెరంగేట్రం గురించి ఎటువంటి వార్తలు బయటికి రాలేదు. దీనికి అసలు కారణం పెదనాన్న చిన్నాన్నలు, నీహారికని సినిమాలో నటించవద్దని చెప్పడంతో తన ప్రయత్నాలు మానుకొందని తెలిసింది.  దీనితో నీహారిక వెండితెరకు బదులుగా బుల్లితెరపై దర్శనమిచ్చింది. ఓ చానల్లో రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుటికే ఆమె తండ్రి నాగబాబు పలు టీవీ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకొని నీహారిక బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో మెప్పిస్తోంది. యువ హీరో నాగశౌర్యతో కలిసి వెండితెరకు పరిచయం అవబోతున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ రూటే సపరేటు..

అన్ని సినీ పరిశ్రమల్లోకెల్లా తెలుగు చిత్ర పరిశ్రమ రూటే సపరేట్ అని చెప్పనక్కర్లేదు. నీహారిక సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతుందంటూ ప్రకటించిన మెగా ఫ్యామిలీపై అభిమానులు మండిపడుతున్నారు. నిహారికను సినిమాల్లోకి రానివ్వద్దని మెగా ఫ్యామిలీపై అభిమానులు ఒత్తిడి తీసుకొస్తున్నారట. అయితే తన కూతురు పద్ధతిగా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తుందంటూ నాగబాబు వివరణ ఇచ్చుకున్నారని ఇండస్ట్రీలో టాక్. మెగా ఫ్యామిలీపైనే అభిమానులు ఒత్తిడి తెచ్చారంటేనే పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోంది. అయితే నాగబాబు మాత్రం తన కుమార్తె ఎంట్రీపై సుముఖంగా ఉన్నారు. అభిమానులకు కూడా ఆయన నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

లక్ష్మీ.. వెరీ లక్కీ..

అయితే, ఈ విషయంలో ప్రముఖ నటుడు మంచు మోహన్బాబు కుమార్తె మంచు లక్ష్మీ చాలా లక్కీ అని చెప్పవచ్చు. మూవీ ఎంట్రీ ఇవ్వడంతోనే నంది అవార్డు గెలుచుకుని, దిగ్విజయంగా ఆమె తన కెరీర్ను కొనసాగిస్తోంది. వారసురాళ్ల ఎంట్రీ విషయానికి వస్తే... ఇక ప్రేక్షకులే మాకు దేవుళ్లు.. వారు లేనిదే మేము లేము అనే నటులకు...వారి అభిమతాన్ని కూడా లెక్కలోకి తీసుకున్న సందర్భాలున్నాయి. గతంలో సూపర్స్టార్ కృష్ణ కూతురు మంజుల సినిమా ఎంట్రీ ఇచ్చినప్పుడూ ఆయన్ ఫ్యాన్స్ ఇలాగే రియాక్ట్ అయ్యారు. దాంతో తనకు ఇష్టం లేకపోయినా మంజుల కెరీర్కు పుల్స్టాప్ పెట్టిందన్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఒత్తిడి వల్లే తన కుమార్తె  ఆ నిర్ణయం తీసుకుందని కృష్ణ స్వయంగా ప్రకటించారు.

ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నం
కేవలం నటీనటుల కూతుళ్ల విషయానికొస్తే.. కోలీవుడ్లో కమల్‌ హాసన్ కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరా హాసన్, అర్జున్ కుమార్తె ఐశ్వర్య, శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి, రాధ పెద్ద కుమార్తె కార్తీక, చిన్నకూతురు తులసీ కూడా వెండితెరపై నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్లో గోవిందా కూతురు టీనా అహుజా, అనిల్కపూర్ తనయ సోనమ్ కపూర్, శతృఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా, సునీల్ శెట్టి గారాలపట్టి అతియాశెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కానీ టాలీవుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

అలాగే నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కూడా తమ వారసురాళ్లను తెరకు పరిచయం చేయటానికి ఆసక్తి చూపించడం లేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న సాధకబాధకాల కారణంగానే వారు అనాసక్తత చూపిస్తున్నారు. కుటుంబసభ్యులే కాకుండా అభిమానులు కూడా వారసురాళ్ల వెండితెర ఎంట్రీకి అంతగా ఇష్టపడటం లేదు. అదే ఇప్పుడూ నిహారిక విషయంలో బయటపడిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement