అలా షాలినీతో ప్రేమలో పడ్డా : నితిన్‌ | Nithiin and Shalini's wedding on 16 may 2020 | Sakshi
Sakshi News home page

ఇకపై నితిన్‌ నాట్‌ ఎ బ్యాచ్‌లర్‌

Published Sun, Feb 16 2020 12:15 AM | Last Updated on Sun, Feb 16 2020 4:16 PM

Nithiin and Shalini's wedding on 16 may 2020 - Sakshi

షాలినీ, నితిన్‌

నితిన్‌ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్‌ సాక్షిగా షాలినీని పెళ్లాడబోతున్నారు. విశేషం ఏంటంటే... ఇప్పుడు నితిన్‌ చేస్తున్న ‘భీష్మ’ సినిమా ట్యాగ్‌లైన్‌ ‘ది బ్యాచ్‌లర్‌’. అయితే నితిన్‌ బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పడబోతోంది. ఇక నితిన్‌ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం...

► ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మరి షాలినీతో పెళ్లి కూడా అలానే చేసుకోబోతున్నారా?
నితిన్‌: నా చిన్నప్పుడు అలాగే అనుకున్నాను. ‘శ్రీనివాస కల్యాణం’ చేస్తున్నప్పుడు కూడా అలానే అనుకున్నాను. కానీ ఆ సినిమా ఆడలేదు కదా. ఒకవేళ ఆ సినిమా ఆడి ఉంటే అలానే చేసి ఉండేవాణ్నేమో. ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవు.

► మీ జంట చూడటానికి చాలా బావుంది. షాలినీని ఎప్పుడు కలిశారు? ఎలా కలిశారు?
‘ఇష్క్‌’ (2012) సినిమా జరుగుతున్న సమయంలో  కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా కలిశాం. చూడగానే నా మనసుకు తను బాగా నచ్చింది. ముందు ఫ్రెండ్స్‌లానే ఉన్నాం.  కొంత సమయం తరవాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నెక్ట్స్‌ స్టెప్‌ తీసుకున్నాం. గత ఏడాది ఇంట్లోవాళ్లకు చెప్పాం. ఇంట్లోవారికి చెప్పగానే రెండు కుటుంబాలవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు. చాలా సంతోషపడ్డాం.

► ‘జయం’ సినిమాలో సదాని కలవడానికి చాలా కష్టపడతారు. షాలినీని కలుసుకోవడానికి ఏయే  ప్లాన్‌లు వేశారు. ఎన్నెన్ని కష్టాలు పడ్డారు?
‘జయం’ సినిమాలో కుర్రాడిని కాబట్టి సెట్‌లో తాడులతో కట్టేవారు. ఇంటి పై కప్పు నుంచి సదా రూమ్‌లోకి దూకేవాణ్ణి (నవ్వుతూ). అది సినిమాలో. రియల్‌ లైఫ్‌కి వస్తే.. తనతో కలసి బయటకు వెళ్లి, నలుగురి కంట్లో పడితే లేనిపోని వార్తలు వస్తాయి. అనవసరమైన అటెన్షన్‌ ఎందుకు? అనుకున్నాం. అందుకే కారులో బాగా తిరిగేవాళ్లం. మా ఫేవరెట్‌ డ్రైవ్‌ ఇన్‌ ఉంది. అక్కడికెళ్లి కాలక్షేపం చేసేవాళ్లం. అంతే..

► ‘నాకు భార్యగా షాలినీయే కరెక్ట్‌’ అని ఏ సందర్భంలో అనిపించింది?
ఫలానా మూమెంట్‌ అని చెప్పలేను. ఫ్రెండ్‌షిప్‌ పెరుగుతున్న క్రమంలో అలా జరిగిపోయింది. తన స్వభావం నాకు చాలా నచ్చింది. అందర్నీ ఒకేలా ట్రీట్‌ చేస్తుంది. అందరితో ఒకేలా మాట్లాడుతుంది. అది నాకు బాగా నచ్చింది. చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతుంది. తనలో మంచి క్వాలిటీ ఏంటంటే.. స్థాయి తేడా చూడదు.

► ఇంతకీ పెళ్లయ్యాక జాయింట్‌ ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నారా?
 ఆ విషయం గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. మా ఫ్యామిలీతోనే ఉండాలనుకుంటున్నాం. ఆమెకు కూడా అదే ఇష్టం. మా రెండు కుటుంబాలకు మంచి సింక్‌ కుదిరింది. అంతా బాగున్నాం.

► మీరు ప్రేమలో ఉన్న విషయం ఇంట్లో కనీసం ఒక్కరికి కూడా తెలియదా?
నా సిస్టర్‌కు, కొంతమంది ఫ్రెండ్స్‌కు తెలుసు. మేం పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాం.

► ఫోన్‌కాల్స్‌తో బిజీగా ఉండేవారా?
నేను షూట్‌లో ఉంటే తను అర్థం చేసుకుంటుంది. షూటింగ్‌ పూర్తయి ఇంటికొచ్చాక ఒక అరగంట మాట్లాడుకునేవాళ్లం. అంటే సందర్భాన్నిబట్టి అది గంట అయినా కావొచ్చు, ఇంకా తక్కువైనా కావొచ్చు.

► షాలినీవాళ్లది సినిమా బ్యాగ్రౌండా?
    సినిమా నేపథ్యం లేదు. వాళ్ల తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్స్‌.

► మొన్న వేలంటైన్స్‌ డేకి ఏం చేశారు?
ఆ రోజంతా బిజీ. మా పెళ్లి వేడుకలో భాగమైన పసుపు కొట్టే ఫంక్షన్‌లో బిజీగా ఉన్నాం అందరం. నేను ‘భీష్మ’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. ఫోన్‌ చేసి ‘హ్యాపీ వేలంటైన్స్‌ డే’ అని చెప్పాను.. అంతే.

► ఫస్ట్‌ వేలంటైన్స్‌ డేని ఎలా జరుపుకున్నారు?
నాకు తెలిసి ఏ వేలంటైన్స్‌ డేనీ స్పెషల్‌గా జరుపుకున్నది లేదు. షూటింగ్స్‌తో బిజీగా ఉండేవాణ్ణి మధ్యలో ఒకటీ రెండు సార్లు వేలంటైన్స్‌ డే రోజు ఖాళీగా ఉన్నప్పుడు డ్రైవ్‌ ఇన్‌లోనే కారులో కూర్చుని కొత్త డిష్‌ ఆర్డర్‌ చేసి తింటూ కబుర్లు చెప్పుకున్నాం.. అంతే.

► రొమాంటిక్‌ సీన్స్‌లో యాక్ట్‌ చేయొద్దు అనే ఆర్డర్స్‌ వచ్చేశాయా?
లేదు. నా ప్రొఫెషన్‌ని బాగా అర్థం చేసుకుంది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకైతే చెప్పలేదు. ముందు ముందు చెబుతుందేమో చూసుకోవాలి (నవ్వుతూ).

► పెళ్లి షాపింగ్‌ ఎప్పుడు మొదలుపెడుతున్నారు?
ఇంకా ఏమీ అనుకోలేదు. మా పెళ్లి ఏప్రిల్‌ 16 అయితే నా షూటింగ్స్‌ ఏప్రిల్‌ 6 వరకూ ఉన్నాయి. షూటింగ్స్‌ గ్యాప్‌ మధ్యలో పెళ్లి షాపింగ్‌ చేయాలి. మా ఇంట్లో, వాళ్ల ఇంట్లో ఆల్రెడీ స్టార్ట్‌ చేశారు.

► ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ సక్రమంగానే కనిపిస్తాయి. కానీ తనలో మీకు నచ్చని క్వాలిటీలు, మీలో తనకి నచ్చని క్వాలిటీలు ఉండి మార్చుకున్న సందర్భాలున్నాయా?
ఇద్దరికీ పరిచయం అయింది 8 ఏళ్ల క్రితం. నాలో కొన్ని.... తనలో కొన్ని మైనస్సులు సహజం. గొడవ పడేవాళ్లం. మాట్లాడుకోకుండా ఉండేవాళ్లం. వాటి అన్నింటిలో నుంచి తను కొంచెం మారింది. నేను కొంచెం మారాను. ఎవ్వరూ పర్ఫెక్ట్‌గా ఉండరు. ఏదో లోపాలుంటాయి. ఇద్దరం మార్చుకుంటూ వచ్చి, ఫైనల్‌గా ఏడడుగులు వేయాలనే స్టెప్‌ తీసుకున్నాం.

► పెళ్లి ప్లాన్స్‌ గురించి?
దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుంటున్నాం. కేవలం కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య మా పెళ్లి జరగనుంది. ఏప్రిల్‌ 22 లేదా 23 ఇండస్ట్రీ వాళ్లకు రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దుబాయ్‌లో పెళ్లి పనులు ఆల్రెడీ స్టార్ట్‌ అయిపోయాయి. మా అక్కాబావ, షాలినీ పెళ్లి పనులు చూసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement