నిత్యతో సత్య రొమాన్స్
‘‘ప్రేమకథలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. వెండితెరపై ప్రేమను కొత్తగా ఆవిష్కరిస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ ‘నిత్య విత్ సత్య’ కూడా సరికొత్త ప్రేమకథా చిత్రం’’ అంటున్నారు దర్శకుడు నాగేంద్రప్రసాద్. మనీష్, తేజస్విని జంటగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘నిత్య విత్ సత్య’. భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై జి. మల్లికార్జున్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇంతకు ముందు మా దర్శకుడు ‘కీ’ తీసి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. యువతరం కోరుకునే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నిత్య అనే అమ్మాయితో సత్య అనే అబ్బాయి రొమాన్స్ ఎన్ని రకాలుగా మలుపు తిరిగిందనేది తెరపై ఆసక్తికరంగా చిత్రీకరించారు. ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ ఇందులో కీలక పాత్ర పోషించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రఘురామ్, కెమెరా: కల్యాణ్ సమీ.