
ఇళయరాజాతో భేదాభిప్రాయాలు లేవు
చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజాతో తనకెలాంటి బేధాభిప్రాయాలు లేవని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గాయకుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న ఆయన తన గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకుని తన సంగీత కళాకారుల బృందంతో కలిసి విదేశాల్లో సంగీత విభావరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంగీత కచేరిల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను పాడకూడదని ఇళయరాజా అనూహ్యంగా నిషేధం విధించడం, అందుకు నోటీసులు పంపడం వివాదంగా మారడం, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారడం తెలిసిందే.
అయితే ఎస్‌పీబీ కూడా ఇకపై ఇళయరాజా పాటలను తాను పాడనని వెల్లడించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఇళయరాజాకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే ఆయన చర్యలు తనను చాలానే బాధించాయన్నారు. అయినా తన సంగీత కచేరిలకు ఎలాంటి బాధింపు కలగలేదని పేర్కొన్నారు.
అదే విధంగా రారా.. పోరా.. అని మాట్లాడుకునేంత స్నేహమే తమదని, అలాంటిది ప్రస్తుత సమస్యను కాలమే తీర్చాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇళయరాజాతో ఫోన్‌లో మాట్లాడమని కొందరు హితవు పలికారన్నారు. అయితే తనకూ కొంచెం ఆత్మాభిమానం ఉందని బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.