సెలబ్రెటీలకు స్వేచ్ఛ కరువు
రంగుల లోకంలో తిరుగులేని వారు సముద్ర తీరంలో స్వతంత్రంగా తిరగలేరు. వెండి తెరపై అద్భుతాలు చేసే వారు స్వేచ్ఛగా షాపింగ్ చేయలేరు. సంధ్యా సమయూన్ని అయినా, వెండి వెన్నెలనైనా అందరితో కలిసి ఆస్వాదించలేరు. అందాలు ఒలకబోసి, కుర్రకారును మత్తెక్కించే వారు కాలినడకన రోడ్డెక్కలేరు. షూటింగ్‌లో ఉన్నా, హోటల్లో ఉన్నా, ప్రయూణంలో ఉన్నా అనుక్షణం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. ఎంత సంపాదించినా, మంచి పేరు తెచ్చుకున్నా నలుగురితో కలిసి జీవించలేరు. తమ ఆనందాన్ని అందరితో కలిసి పంచుకోలేరు.
తమిళసినిమా, న్యూస్‌లైన్:
హీరోయిన్లకు బంధాలు, అనుబంధాలతో కూడిన వ్యక్తిగత జీవితం ఉంటుంది. వాళ్లకు మనసంటూ ఒకటుం దన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా కొందరి మూర్ఖ ప్రవర్తన హీరోయిన్లకు దడ పుట్టిస్తోంది. ఈ మధ్య నటి శృతిహాసన్ ముంబ యిలో ఎదుర్కొన్న సంఘటనే దీనికి నిదర్శనం. మొన్న అభిమానుల వెర్రి చేష్టలతో హన్సిక గోవా లో ఇబ్బందులు ఎదుర్కొంది. అంతకు ముందు నటి స్నేహ, త్రిష, బాలీవుడ్ భామలు విద్యాబాలన్, బిపాషాబసు ఇలా పలువురు హీరోయిన్లు అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న విజ్ఞానాన్ని కొందరు అసాంఘిక చర్యలకు వాడుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వెబ్‌సైట్‌ల ద్వారా కథానాయికలను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వెబ్‌సైట్‌ల విషయంలోనూ హీరోయిన్లు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. నిర్భయ చట్టం వంటివి అమల్లోకి వచ్చినా మగువల మాన ప్రాణాలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం. ఇలాంటి దురాఘాతాలపై కొందరు తారామణుల మనోగతం ఏంటో చూద్దాం.
ఆయుధం ఉంచుకోవాలా?
నటీమణులతో చిల్లర చేష్టలకు పాల్పడేవారిని ఊరికే వదలిపెట్టరాదని లక్ష్మీరాయ్ పేర్కొన్నారు. శృతిహాసన్‌కు ఎదురైన సంఘటన విని నేను షాక్‌కు గురయ్యాను. ఇంతకుముందు కూడా పలువురు హీరోయిన్లు ఇలాంటి అనుభవాలను చవి చూశారు. అప్పుడే దుండగులపై సరైన చర్యలు తీసుకుని వుంటే నటి శృతికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యేది కాదు. దీని బట్టి చూస్తుంటే ఇకపై నటీమణులు ఆత్మరక్షణ కోసం ఏదైనా ఆయుధాన్ని ఉంచుకోవాలనిపిస్తోందని చెప్పారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
నటి దేవయాని మాట్లాడుతూ మహిళలు ఒంటరిగా ఉండరాదన్నది నా అభిప్రాయం. తల్లిదండ్రులు కానీ, లేక సొంతవారు కానీ కూడా ఉంటే భద్రత ఉంటుంది. అదే విధంగా మనకెవరిపైనైనా అనుమానం కలిగితే వెంటనే దానిపై దృష్టి పెట్టాలి. ఏమి జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలి. ఇంటిముందు పిల్లలు చాలాసేపు నిలబడి ఉంటే ఎవరు మీరు? ఏమిటి విషయం అని అడగాలి. ఇంటి తలుపు ఎవరైనా తట్టినా కాలింగ్‌బెల్ కొట్టినా వెంటనే వెళ్లి తలుపు తెరవరాదు. నటీమణులైనా సాధారణ స్త్రీలు అయినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యవస్థలో మార్పు వచ్చే వరకు, మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా పట్టించుకునే పాలకులు, నాయకులు లేరని అభిప్రాయపడ్డారు.
ఈ రక్షణ సరిపోదు
నటి నమిత స్పందిస్తూ పురుషాధిక్యం గల ఈ సమాజంలో స్త్రీలకు ఇస్తున్న రక్షణ సరిపోదు. కొందరు మగవారు స్త్రీ జాతిని భోగ వస్తువుగానే చూస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. స్త్రీలను గౌరవించే పురుషులు లేరని చెప్పను గానీ వారిని అబలలుగా భావించేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కొందరికి నటీమణులంటే చిన్న చూపు ఉంది. నటీమణులు సాధారణ యువతుల మాదిరి స్వేచ్ఛగా తిరగాలంటే మృగాల్లాంటి మగవాళ్లను తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కఠినంగా శిక్షించాలి
నటి లక్ష్మీమీనన్ స్పందిస్తూ శృతిహాసన్‌కు ఎదురైన సంఘటనను తేలిగ్గా తీసుకోకూడదు. దాడికి పాల్పడిన వ్యక్తులను దుబాయి వంటి దేశాల్లో కఠినంగా శిక్షిస్తారు. మన దేశంలో చిన్న దండనలతో సరిపెట్టడం వలన వాళ్లు మళ్లీ బయటికొచ్చి అలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. అదే శిక్ష తీవ్రంగా వుంటే ఇలాంటి అఘాయిత్యాలు జరగడానికి తావుండదు. శృతిహాసన్ ధైర్యశాలి కాబట్టి ఎదిరించి పోరాడారు. ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయూలి. అయితే అందరూ మహిళలు అలా ధైర్యంగా ప్రవర్తించలేరు. ఇలాంటి సంఘటనలు నటీమణులకు మాత్రమే కాదు సాధారణ స్త్రీలకు ఎదురవుతున్నాయి. స్త్రీలు అణిగిమణిగి ఉండాలనే భావనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎలాంటి సంఘటనలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని మహిళలు అలవరచుకోవాలి. అదే విధంగా తల్లిదండ్రులు చాలామంది ఆడపిల్లలను పై చదువులకు ప్రోత్సహించడం లేదు. పదవ తరగతి, ప్లస్‌టుతోను నిలిపి వేస్తున్నారు. సమాజంలో ఏమి జరుగుతుందో వారికి తెలియాలి. అప్పుడే వాళ్లలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది.