
నూరిన్ షరీఫ్
‘‘లవర్స్ డే’ చిత్రం విడుదలయ్యాక ఇక్కడ కూడా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక కొత్త నటిగా నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేరళ కుట్టి నూరిన్ షరీఫ్. ఒమర్ లులు దర్శకత్వంలో రోషన్ అబ్దుల్, ప్రియా ప్రకాష్ వారియర్, నూరిన్ షరీఫ్ ముఖ్యతారలుగా రూపొందిన మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. ఈ చిత్రం ‘లవర్స్ డే’గా తెలుగులో ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నూరిన్ మాట్లాడుతూ– ‘‘నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. ప్రియా ప్రకాష్ వింక్ ఎపిసోడ్, స్క్రిప్ట్ కొంచెం మారడం వంటి అంశాల వల్ల నా పాత్ర నిడివి తగ్గింది. దాంతో బాధ అనిపించింది.
ప్రియా ప్రకాష్‌తో నాకు గొడవలు ఏం లేవు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాత గురురాజ్ బాగా హెల్ప్ చేశారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు క్లైమాక్స్‌ను మార్చడం మంచి నిర్ణయమే అనిపించింది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు అల్లు అర్జున్‌గారి సినిమాలను టీవీలో చూశాను. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ‘లవర్స్ డే’ వేడుకకు ఆయన అతిథిగా రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయనతో ఓ ఫొటో దిగాను. ఆయన నన్ను చూసి నవ్వారు. ఆ స్మైల్ చాలు నాకు. ఆ ఫొటో ఎవరు తీశారో తెలుసుకుని తీసుకోవాలని ఉంది. ఒమర్ లులు దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు నూరిన్ షరీఫ్.
Comments
Please login to add a commentAdd a comment