అఖిల్‌లో ఉన్న మంచి గుణం ఆత్మవిమర్శ | NTR about pre-release event of Mr. Majnu | Sakshi
Sakshi News home page

అఖిల్‌లో ఉన్న మంచి గుణం ఆత్మవిమర్శ

Published Sun, Jan 20 2019 2:00 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

NTR about pre-release event of Mr. Majnu - Sakshi

నాగచైతన్య, తమన్, వెంకీ అట్లూరి, అఖిల్, నిధీ అగర్వాల్, నాగార్జున, ఎన్టీఆర్, బీవీయస్‌యన్‌ ప్రసాద్‌

‘‘ఈ ఫంక్షన్‌కు అతిథిలా కాకుండా బంధువులా వచ్చాను. ఈ చిత్రానికి పని చేసిన చాలామంది నాకు కావాల్సిన వాళ్లు ఉన్నారు. ఒక నిర్మాత మంచి చిత్రాలు తీయాలంటే వ్యామోహం ఒక్కటే సరిపోదు. వ్యాపారం కూడా తెలియాలి. ప్రసాద్‌గారిలో వ్యాపారం చూడలేదు, కేవలం సినిమా మీద వ్యామోహం మాత్రమే చూశాను. ఈ సంస్థకు ‘మిస్టర్‌. మజ్ను’ మరో మైలు రాయి అవ్వాలి’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టర్‌. మజ్ను’. బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌ కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ –   ‘‘ప్రసాద్‌గారితో ‘ఊసరవెల్లి, నాన్నకు ప్రేమతో’ చేశాను. ఆ రెండు సినిమాలు నాకు చాలా ఇష్టమైనవి. సంపాదించిన ప్రతి రూపాయిని సినిమాకే ఖర్చు పెడతారాయన. అలాంటి నిర్మాత బావుంటే ఇంకా మంచి సినిమాలు అందిస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఉన్న ఫ్రెండ్స్‌లో వెంకీ  ఒకరు. ‘తొలిప్రేమ’ అనే టైటిల్‌తో ఏం తీస్తాడు అనుకున్నాను. ఆ చిత్రం చూశాక, గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ‘మిస్టర్‌ మజ్ను’ కూడా మంచి సక్సెస్‌ అవుతుంది అనుకుంటున్నాను. తమన్‌ సంగీతంపై నాకు బాగా నమ్మకం ఉంది. ఆ మధ్య తన చుట్టూ ఒక నెగటివిటీ ఏర్పడింది.

మళ్లీ తన సామర్థ్యాన్ని చూపించే చిత్రం రావాలి అనుకున్నాను. ‘తొలిప్రేమ’ రిలీజ్‌ అయింది. ఒక నటుడికి అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆత్మ విమర్శ. అలాంటి గొప్ప గుణం   తమ్ముడు అఖిల్‌లో చూశాను. అఖిల్‌ చేసుకునేంత ఆత్మవిమర్శ ఎవ్వరూ చేసుకోలేరు. ఆత్మవిమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలి. తనని తను మార్చుకుంటూ ఈ మజిలీకి చేరాడు. రాసిపెట్టుకోండి.. మనకున్న ఉత్తమ నటుల్లో అఖిల్‌ కూడా ఉంటాడు. స్టార్డమ్‌ గురించి మాట్లాడటం లేదు. ఉత్తమ నటుల్లో అఖిల్‌ మాత్రం కచ్చితంగా ఉంటాడు. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను. అది కూడా ఎంతో దూరంలో లేదు. ‘మిస్టర్‌ మజ్ను’ అఖిల్‌కు  బెస్ట్‌ మూవీ అవుతుంది’’ అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ – ‘‘మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్‌  (ఎన్టీఆర్‌). నన్ను చాలా ఆప్యాయంగా బాబాయ్‌ అని పిలుస్తాడు. తారక్‌ దగ్గరి నుంచి అఖిల్‌ నేర్చుకోవాల్సింది.. యాక్టింగ్‌ అండ్‌ మాస్‌. రేయ్‌ మాస్‌ నేర్చుకోరా అక్కడా (అఖిల్‌ని ఉద్దేశిస్తూ). ప్రసాద్‌గారు 25 సినిమాల్లో 2 బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది. తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. తమన్‌గారి తాతగారే నాన్నను (ఏయన్నారు) ఆర్టిస్ట్‌గా గుర్తించారు. ఆ విధంగా ఈ సర్కిల్‌ పూర్తయింది అనుకుంటున్నాను. వెంకీ అట్లూరి మా సినిమాలు చూసి ఇక్కడికి వచ్చాడని విన్నాను. ‘మజ్ను’ టైటిల్‌ నాన్నగారిది. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అఖిల్‌ చేశాడు. ఈ చిత్రం ఆ 2 సినిమాల కంటే పెద్ద హిట్‌ అవ్వాలి’’ అన్నారు.  

నాగ చైతన్య మాట్లాడుతూ – ‘‘మజ్ను... మంచి టైటిల్‌ పెట్టావు వెంకీ. అఖిల్‌కి సూట్‌ అవుతుంది (నవ్వుతూ). అఖిల్‌ని ఫుల్‌ లవ్‌స్టోరీలో చూడాలనుకున్నాను. అఖిల్‌ ఫైట్స్, డ్యాన్స్‌ బాగా చేస్తాడని మనందరికి బాగా తెలుసు. తన బాడీ లాంగ్వేజ్‌కు లవ్‌స్టోరీ బావుంటుందని అనుకున్నాను. వెంకీ ‘తొలిప్రేమ’తో తన మార్క్‌ చూపించాడు. ‘మిస్టర్‌ మజ్ను’ కూడా అలానే ఉంటుందనుకుంటున్నాను. నిధీకు సక్సెస్‌ రావాలి. బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ప్రసాద్‌గారు’’ అన్నారు.

అఖిల్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు గాడ్‌ ఫాదర్‌ బీవియస్‌ఎన్‌ ప్రసాద్‌గారు. తాతగారితో కూడా ఆయన సినిమా తీశారు. సినిమాకు పని చేసిన నిపుణులందరికీ థ్యాంక్స్‌. ఇంత స్పెషల్‌ ఆల్బమ్‌ ఇచ్చిన తమన్‌కు థ్యాంక్స్‌. వెంకీ నాకు పదేళ్ల నుంచి ఫ్రెండ్‌. మూడేళ్ల ముందే ఈ కథ చెప్పి, నా కోసం వెయిట్‌ చేశాడు. ప్రతి సినిమాకు నాన్నగారు చూపించే శ్రద్ధ చాలా గొప్పది. మీ ఇన్‌ఫుట్స్‌ లేకుంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదు నాన్న. అన్నయ్య ఎన్టీఆర్‌ని నేను టైగర్‌ అని పిలుస్తాను. ఈ ఫంక్షన్‌ వస్తున్నందుకు థ్యాంక్స్‌ అంటే.. అది నా బాధ్యత అని చెప్పారు. థ్యాంక్యూ సో మచ్‌ అన్నయ్య’’ అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ‘‘నేను ఫస్ట్‌ థియేటర్‌లో చూసిన సినిమా ‘శివ’. ప్రేమ్‌ నగర్‌ సినిమాలో ‘ఎక్స్‌క్యూజ్‌ మీ మిస్‌’ డైలాగ్‌ని తీసుకొని ఇందులో పెట్టాను. ఈ సినిమా టీమ్‌ ఎఫర్ట్‌.  చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులు ఆశ్వీర్వదించాలి’’ అన్నారు.   ఈ వేడుకలో నిధీ అగర్వాల్, తమన్, శ్రీమణి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement