‘రాకాసి..’ పాటను ఎన్టీఆర్ అద్భుతంగా పాడారు!
‘‘ఓ శక్తిమంతమైన కథ కుదిరితే ఎన్టీఆర్ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పడానికి ‘సింహాద్రి’ ఓ ఉదాహరణ. అందుకే ‘రభస’ సినిమా విషయంలో నాకెలాంటి సందేహం లేదు. కథ అంత గొప్పగా వచ్చింది’’ అని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆత్మవిశ్వాసం కనబరిచారు. ‘కందిరీగ’తో మెగాఫోన్ పట్టిన ఈ ఛాయాగ్రాహకుడు ప్రస్తుతం ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్‌లో బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా ‘రభస’ చేస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ చెప్పిన విశేషాలు.
‘కందిరీగ’ తర్వాత చాలా విరామం తీసుకుని ‘రభస’ మొదలుపెట్టాను. దానికి కారణం కథ. బౌండ్ స్క్రిప్ట్ కుదిరిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాం. నా ఆరోగ్యం బాగాలేక ఓ రెండు నెలలు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా 135 రోజుల్లో సినిమా పూర్తి కావడం ఆనందంగా ఉంది. అవుట్‌పుట్ చాలా సంతృప్తికరంగా వస్తోంది. ఈ నెల 23తో షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది.
ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోతో సినిమా చేయడం ఓ మంచి అనుభవం. చెప్పిన సమయానికి అరగంట ముందే లొకేషన్లో ఉంటారాయన. ప్రతి తల్లీ ఇలాంటి కొడుకు కావాలనీ, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందనే విధంగా ‘రభస’లో ఆయన పాత్ర ఉంటుంది. ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్. ఇందులోని ‘రాకాసి...’ పాటను ఆయనతో పాడించాలన్నది సంగీతదర్శకుడు తమన్ ఆలోచనే.
ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అద్భుతంగా పాడారు. ఎన్టీఆర్‌లో మంచి గాయకుడు ఉన్నాడు. నా మలి సినిమాకి కూడా బెల్లంకొండ సురేశే నిర్మాత కావడం ఆనందంగా ఉంది. కథ గురించి మా మధ్య వాదోపవాదాలు జరిగాయి. సురేశ్‌కి మంచి జడ్జిమెంట్ ఉంది. ఆయనకు సంతృప్తిగా అనిపించిన సినిమా, కచ్చితంగా ప్రేక్షకులను కూడా సంతృప్తిపరుస్తుంది. కథ డిమాండ్ చేసిన మేరకు వెనుకాడకుండా ఖర్చుపెట్టడం ప్లస్ పాయింట్.
త్వరలో ‘తిక్క రేగితే’ పేరుతో ఓ సినిమా చేస్తాను. హీరో ఎవరనేది సస్పెన్స్. ‘కందిరీగ’ హిందీ రీమేక్ నన్ను చేయమన్నారు. కానీ, అప్పటికే ‘రభస’ ప్లాన్ చేయడంతో చేయలేకపోయాను. ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా పరిచయమవుతోన్న బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ లవ్‌స్టోరీ చేయాలని ఉంది. తను మంచి మాస్ కమర్షియల్ హీరో అవుతాడు.