తాతగారి పాత్ర చేయడం ఈ జన్మకు జరగని పని | ntr speech in mahanati audio function | Sakshi
Sakshi News home page

తాతగారి పాత్ర చేయడం ఈ జన్మకు జరగని పని  – ఎన్టీఆర్‌ 

Published Wed, May 2 2018 12:53 AM | Last Updated on Wed, May 2 2018 11:30 AM

ntr speech in mahanati audio function - Sakshi

∙సతీష్, నాగ్‌ అశ్విన్, విజయ్‌ దేవరకొండ, ఎన్టీఆర్, విజయ చాముండేశ్వరి, కీర్తీ సురేశ్, దుల్కర్‌ సల్మాన్, మాళవికా నాయర్, మిక్కీ జె.మేయర్‌ 

‘‘ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నప్పుడు మనకు వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. అది నేచర్‌ ఇచ్చేస్తుంది. అలాగే ఆ మహానటి వేషం వేయటానికి కీర్తీని, ఇతర పాత్రలకు దుల్కర్, సమంత, విజయ్‌ వీళ్లందర్నీ తీసుకువచ్చింది. గొప్పవాళ్లు భౌతికంగా మనకి దూరం అవ్వచ్చు కానీ వాళ్ల సౌరభం మన చుట్టూనే ఉంటుంది. సావిత్రిగారే పట్టుబట్టి నా జీవితాన్ని కథగా మలిచి ఓ సినిమా తీయండి అని వీళ్లను ఎన్నుకున్నారు’’ అన్నారు ఎన్టీఆర్‌. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్‌ పోషించారు. సమంత, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్‌పై ప్రియాంకా దత్‌ నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘చాలాసార్లు చాలా విషయాల్లో మనకు అంత అర్హత ఉందా? అనిపిస్తుంది.

నాకు ఈ ఆడియో ఫంక్షన్‌లో సావిత్రిగారి∙హుందా గురించి మాట్లాడే అర్హత ఇప్పుడు కాదు.. బహుశా ఎన్ని జన్మలు ఎత్తినా రాదేమో. ట్రూ లేడీ సూపర్‌స్టార్‌ సావిత్రిగారు. ఆవిడ ఔన్నత్యం ముందు ఆమె పేరు కూడా ఎత్తటానికి సరిపోం మనం. ఆవిడ ఎలా పోయారు? అనేకంటే ఆవిడ ఎలా బ్రతికారు అని చూపించే చిత్రం ఇది. కొంతమంది జీవితం తెలుసుకోవటం అవసరం.  కొందరు సాధించిన విజయాల్ని తెలుసుకొని స్ఫుర్తిగా తీసుకోవాలి. అలాంటి కథను తీసుకు వస్తున్నాడు దర్శకుడు నాగీ. ఈ సినిమా తీయటానికి నాగీకి ఎంత అనుభవం ఉంది అనేకంటే సావిత్రిగారి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి. ఈ చిత్రాన్ని తనొక దర్శకుడిగా కంటే అభిమానిగా తీశాడని అనుకుంటాను. తనకు అండగా ప్రియాంకా, స్వప్నా ఉన్నారు. స్వప్నా నా దగ్గరకు వచ్చి, ఈ సినిమాలో తాతగారి (నందమూరి తారక రామారావు) పాత్ర చేయమని అడిగింది. కానీ ఆయన పాత్రను పోషించడం ఈ జన్మలో జరగని పని. నాకు బేసిక్‌గా ఈ చిత్రంలో రామారావుగారి పాత్ర పోషించే దమ్ము లేదు. మనకు తెలిసిన కథలో, ఆ కథలోని వ్యక్తిలాగా నటించడం చాలా కష్టం. అది నటిస్తే జరగదు. జీవిస్తే జరుగుతుంది. కీర్తీ సురేశ్, దుల్కర్‌ సల్మాన్, సమంత, విజయ్‌ దేవరకొండ ఈ నలుగురూ వాళ్ల వాళ్ల పాత్రల్లో జీవించారు.  వైజయంతి  మూవీస్‌ తాతగారి వల్ల మొదలైంది. స్వప్న సినిమాస్‌ నా ‘స్టూడెంట్‌ నెం.1’తో మొదలైంది. ఈరోజు ఇంత గొప్ప సినిమా తీస్తారని అనుకోలేదు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ మధ్య ఆడవాళ్ల మీద ఆకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ సినిమా చూశాక ఎందుకు మనం మగాళ్లుగా పుట్టాం అని అనుకుంటారు. ఒక స్త్రీ బలమేంటో... ఆడవాళ్లు తలుచుకుంటే ఏం సాధిస్తారో సావిత్రిగారు చూపించారు. ఇప్పటికైనా ఆడవాళ్లను గౌరవిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారు, నందమూరి తారక రామారావుగారు, సావిత్రిగారు.. ఈ ముగ్గురి పేర్లు తెలుగు సినిమాలో ఎప్పటికీ నిలిచిపోయే ఉంటాయి. వాళ్లు లేకుండా ‘మాయాబజార్‌’ సినిమా లేదు. నన్ను 8 నెలల వయసులో ఎత్తుకొని ‘వెలుగు నీడలు’  సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం చేశారు సావిత్రిగారు. తన దగ్గరి నుంచే స్టార్‌డమ్‌ నాకు అంటుకొని ఉంటుంది.

సావిత్రిగారిని చూసిన వెంటనే భయపడి నాన్నగారి వెనక్కో, అమ్మ కొంగు చాటుకో వెళ్లిపోయేవాణ్ణి. ఒక వ్యక్తి మీద బయోపిక్‌ తీయాలంటే వారికి ఓ అర్హత ఉండాలి. ఆ అర్హత సావిత్రి గారికి ఉంది. తెలుగు సూపర్‌స్టార్‌ మీద వస్తున్న ఫస్ట్‌ బయోపిక్‌. అది కూడా ఒక లేడీ సూపర్‌ స్టార్‌. మనందరం గర్వపడాలి. అది తీసింది కూడా స్వప్నా, ప్రియాంకా. పాతికమంది అమ్మాయిలు సినిమా టీమ్‌లో ఉన్నారట. తెలుగు ఇండస్ట్రీలో స్త్రీలకు అంత గౌరవం ఇస్తాం. ఈ సినిమాలో భాగమవ్వనందుకు చాలా ఈర్ష్యగా ఉంది. నేను లేకపోయినా నా కొడుకు, కోడలున్నారు ఈ సినిమాలో. ట్రైలర్, టీజర్‌ చూస్తే  ఒక మంచి ఫీలింగ్‌ కలుగుతుంది. ఇప్పటి వరకూ మీరు ఎన్నో హిట్స్‌ ఇచ్చారు అశ్వనీదత్‌గారూ.. ఈ సినిమా మీకు రెస్పెక్ట్‌ తీసుకువస్తుంది’’ అన్నారు. ‘‘సావిత్రిగారి గురించి మాట్లాడే వయసు నాకు లేదు. కీర్తీ ఎంత కష్టపడిందో తెలుసు. ఇందులో పని చేసిన అందరితో నాకు అనుబంధం ఉంది.  ఫస్ట్‌ టైమ్‌ అనిపిస్తోంది నా సినిమాలో నేను లేనే అని. ఇందులో నేనూ యాక్ట్‌ చేయాల్సింది. కుదర్లేదు. నాగీ సినిమాల్లో ఒక నిజాయితీ ఉంటుంది. ఇందులోనూ కనిపిస్తుంది’’ అన్నారు నాని. కీర్తీ సురేశ్‌ మాట్లాడుతూ– ‘‘నాని ద్వారా  ఈ సినిమా గురించి విన్నాను. నాగీ, స్వప్నా నా దగ్గరకి వచ్చి, నువ్వు టైటిల్‌ రోల్‌ చేయాలన్నారు. నేను సావిత్రిగారి పాత్ర చేయడమేంటి? అనుకున్నాను. కానీ నాగీ కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. మనం సావిత్రిగారికి ఇచ్చే నివాళి అని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌ నాగీ. సావిత్రిగారు ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు.

‘‘గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో చేసినందుకు. రిస్క్‌తీసుకున్నాను. మొయిన్‌ హీరోయిన్‌ కాదు. కానీ కచ్చితంగా చెప్పాల్సిన కథలో భాగమవ్వాలని ఒప్పుకున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఒక సీన్‌ చేసినప్పుడు గ్లిజరిన్‌ వాడలేదు. ఆ సీన్‌ కోసమే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. సావిత్రిగారి ప్రొఫెషన్‌లో నేనూ ఉన్నందుకు గర్వంగా ఉంది. వైజయంతి మూవీస్‌ తెలుగు సినిమా షైన్‌ అయ్యేలా చేస్తున్నారు. కీర్తీ ట్రాన్సఫర్మేషన్‌ చూసి షాక్‌ అయ్యాను’’ అన్నారు సమంత.  నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ – ‘‘ఇక్కడ మనం ఉన్నది సావిత్రిగారి కోసం. రెండేళ్లు అందరూ కష్టపడి పని చేసింది సావిత్రిగారి మీద ఉన్న గౌరవంతోనే. స్టోరీ లోపలకు వెళ్లే వరకూ మరో హిమాలయాలు ఎక్కొచ్చేమో అనిపించింది. ఆ అర్హత పెంచుకునేందుకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ సంవత్సరం ప్రీ–ప్రొడక్షన్‌ చేశాం. సావిత్రిగారు దొరక్క ముందే సమంత సినిమాలోకి వచ్చారు. అంత నమ్మారు మమ్మల్ని. షూటింగ్‌ చేస్తున్నప్పుడు సావిత్రిగారు మా పక్కనే ఉన్నట్లు ఫీల్‌ అయ్యాం. సావిత్రిగారు అనుకున్నారు కాబట్టే ఈ సినిమా చేయగలిగామేమో’’ అన్నారు. స్వప్నా దత్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. సెన్సేషన్‌ కోసమా? ఎందుకు సావిత్రి అని? వర్కౌట్‌ అవుతుందా? అని. ‘ఎవడే సుబ్రమణ్యం’ చేసేప్పుడు సావిత్రిగారి జీవితకథ తీద్దామని నాగి అన్నాడు. నాగి మీద ఉన్న అతి నమ్మకం. దాని కంటే ముఖ్యంగా సావిత్రిగారి మీద ఉన్న నమ్మకం. సావిత్రిగారి కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యం ఇచ్చారు. 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాం. ఎత్తుపల్లాలు చూశాం. వైజయంతి బేనర్‌కి రెస్పెక్ట్‌ తీసుకువచ్చే సినిమా. మమ్మల్ని నమ్మింది సమంత. ఒక హీరోయిన్‌ కథను మోసుకెళ్లటం అనే డెసిషన్‌ గ్రేట్‌. కీర్తీ సురేశ్, నేను.. ఇద్దరం సరదాగా గొడవపడేవాళ్లం’’ అన్నారు. ‘‘వైజయంతి మూవీస్‌లో సినిమా చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. జెమినీగా నా నటన మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు దుల్కర్‌ సల్మాన్‌. ‘‘ఫస్ట్‌ సినిమాతో నాగి నన్ను హిమాలయాలకు తీసుకువెళ్లాడు. మళ్లీ 80లోకి తీసుకువెళ్లాడు. ఇందులో చిన్న పాత్ర చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు విజయ్‌ దేవరకొండ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement