ముంబై : పితృస్వామ్య వ్యవస్థ గల ఈ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పరుచుకున్నానని బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరూచా అన్నారు. పురుషాధిక్య సమాజంలో తనను తాను బాధితురాలిగా చెప్పుకొంటూ ఎటువంటి ప్రయోజనం పొందాలనుకోవడంలేదని పేర్కొన్నారు. ఎవరో మనల్ని అణగదొక్కాలని చూస్తున్నారని చెప్పడం అంటే మన ప్రతిభను మనమే తక్కువ చేసి మాట్లాడినట్లు అవుతుందన్నారు. అవకాశాలు రాలేదని కుంగిపోవాల్సిన పనిలేదని.. రేపటి రోజు మంచి జరుగుతుందనే భావనతోనే ప్రతీ ఉదయం నిద్రలేస్తానని పేర్కొన్నారు. సినీ రంగంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లు కెరీర్‌లో తొందరగానే నిలదొక్కుకున్నా.. అంతే తొందరగా వెండితెరకు దూరమవుతారు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలయిపోతారన్న సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి నుష్రత్ మాట్లాడుతూ.. ‘మనం పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. యాభై ఏళ్ల వయస్సులో కార్తిక్(నుష్రత్ కోస్టార్ కార్తిక్ ఆర్యన్) హీరోగా నటించగలడు. కానీ నాకు మాత్రం అప్పుడు తల్లి పాత్రలే వస్తాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టినపుడే వీటన్నింటికీ సిద్ధపడ్డాను. హీరో కంటే హీరోయిన్ కెరీర్ చాలా తొందరగా ముగిసిపోతుందని నాకు తెలుసు. నటన అంటే నాకు ప్రాణం. అందుకే ఉన్నన్నాళ్లు మంచి సినిమాలు ఎంచుకుని సంతోషంగా గడపడానికే ఇష్టపడతాను’ అని వ్యాఖ్యానించారు. ఇక అప్‌కమింగ్ మూవీ ప్యార్ కా పంచ్‌నామా గురించి చెబుతూ.. ‘సినిమా సమయంలో నిజానికి వేరే అవకాశాలేవీ రాలేదు. అసలు ఇందులో నా పాత్రను పోషించడానికి ఏ అమ్మాయి అంగీకరించదు. అయితే స్క్రిప్టుతో పాటు మూవీ టీమ్ కూడా నాకు బాగా నచ్చింది. ఇందులో నేను బ్యాడ్ గర్ల్‌గా కనిపిస్తాను. కాబట్టి ప్రేక్షకులు నన్నెంత ద్వేషిస్తే నా నటనకు అన్ని మార్కులు పడినట్లు భావిస్తా’ అని 34 ఏళ్ల నుష్రత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment