టైటిల్: ఓ.. పిట్ట కథ
జానర్: రొమాంటిక్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు: సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ, తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
దర్శకత్వం: చెందు ముద్దు
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
నిడివి: 127.32 నిమిషాలు
డిఫరెంట్ టైటిల్‌తోనే టాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ’. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అనేది క్యాప్షన్. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చెందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు, తదితర స్టార్ నటీనటులుతో పాటు దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడిలు మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది?సీనియర్ నటుడు బ్రహ్మాజీ తన కొడుకును గ్రాండ్‌గా లాంచ్ చేశాడా? భారీ ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఏ మేరకు నిలబెట్టాయి? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అరకులో పి.వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి) కిడ్నాప్‌కు గురవడంతో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. కాకినాడలోని వెంకటలక్ష్మి థియేటర్ యజమాని వీర్రాజు కూతురే వెంకటలక్ష్మి. తల్లి లేని బిడ్డ అని చిన్నప్పట్నుంచి గారాబంగా పెంచుతాడు వీర్రాజు. అయితే అదే థియేటర్‌లో పనిచేసే ప్రభు (సంజయ్ రావ్)కు థియేటర్ అన్న వెంకటలక్ష్మి అన్న ఎంతో ఇష్టం. అయితే చైనా నుంచి వచ్చిన వీర్రాజు మేనల్లుడు క్రిష్ (విశ్వంత్) కూడా వెంకటలక్ష్మిని ప్రేమిస్తాడు.
అయితే ఫ్రెండ్స్‌తో కలిసి అరకు వెళ్లిన వెంకటలక్ష్మి కిడ్నాప్‌కు గురవుతుంది. దీంతో ఈ కేసును కాకినాడ ఎస్సై అజయ్ కుమార్ (బ్రహ్మాజీ) ఇన్వెస్టిగేట్ చేస్తాడు. చివరికి వెంకటలక్ష్మి ఆచూకి లభించిందా? ఇంతకి ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? ప్రభు, క్రిష్‌లలో వెంకటలక్ష్మి ఎవరిని ప్రేమిస్తుంది? చైనాకు క్రిష్‌కు ఉన్నరిలేషన్ ఏంటి? వీటన్నింటిని తెలుసుకోవాలంటే ‘ఓ పిట్ట కథ’ చూడాల్సిందే.
నటీనటులు:
ఈ సినిమాలో అందరి పాత్రలు ప్రధానమైనవి. దీంతో ఎవరికి వారు పోటీపడి నటించారనే చెప్పాలి. ముఖ్యంగా సంజయ్, విశ్వంత్‌ల నటనకు వావ్ అనాల్సిందే. వెంకటలక్ష్మిపై ప్రేమ, దక్కదనే ఆందోళన, జీవితంలో సెటిల్ అవ్వాలనే భయం ఇలా అన్ని కోణాలను తమ నటనలో చూపించారు. విశ్వంత్‌కు కాస్త అనుభవం ఉండటంతో తన పాత్రను అవలీలగా చేశాడు. అయితే తొలి సినిమాలోనే డిఫరెంట్ షేడ్స్ గల పాత్ర లభించడం సంజయ్‌కు దక్కిన గొప్ప అవకాశమనే చెప్పాలి. అయితే వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కానీ ఎమోషన్స్ పలికించడంలో ఇంకాస్త మెరుగుపడాలి.
‘దేవుళ్లు’ సినిమాతో అందరి ఆశీర్వాదాలు పొందిన నటి నిత్యాశెట్టి. ఈ సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగమ్మాయి కావడం, తొలి సినిమా కావడంతో ఈ సినిమాలో నిత్యాశెట్టి చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా నిత్యాశెట్టి వచ్చిన ప్రతీ సీన్ కలర్‌ఫుల్‌గా, కామెడీగా, రొమాంటిక్‌గా సాగిపోతూ ఉంటుంది. ఇక కాకినాడ ఎస్సై పాత్ర పోషించిన బ్రహ్మాజీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఎందుకంటే తన అనుభవంతో ఆ పాత్రను అవలీలగా చేశాడు. మిగతా తారగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
హీరోహీరోయిన్ల ఎంట్రీ, లవ్ సీన్స్, అక్కడక్కడా నవ్వించే కామెడీతో ఫస్టాఫ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. దీంతో సినిమా యావరేజ్ అనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. అయితే అసలు సినిమా అంతా సెకండాఫ్‌లోనే ఉంది. ఫస్టాఫ్‌లో ప్రేక్షకుడికి తెలియకుండా కథలో భాగంగా వేసిన అనేక ముడులను దర్శకుడు ఒక్కొక్కొటి విప్పుకుంటూ వస్తాడు. దీంతో ద్వితీయార్థం అద్యంతం ఆసక్తిగా, ఆశ్చర్యంగా, అసలేం ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ కలగక మానదు. సెకండాఫ్‌లో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఎవరి ఊహకు అందవు.
ఇలా సెకండాఫ్‌లో ప్రేక్షకుడు సీట్లలో నుంచి కనీసం పక్కకు కూడా జరగకుండా కూర్చున్నాడంటే క్రెడిట్ మొత్తం స్క్రీన్ ప్లేకే దక్కుతుంది. యువ డైరెక్టర్ చెందు ముద్దు తన పక్కా స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఎక్కడా సస్పెన్స్ రివీల్ చేయకుండా క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడికి డిఫరెంట్ థ్రిల్‌ను కలిగించాడు దర్శకుడు. ఈ విషయంలో చెందుకు డైరెక్టర్‌గా మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఇక లవ్ సీన్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి.
అయితే ఓ కిడ్నాప్ కేసును ఛేదించే క్రమంలో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్లలో నాటకీయత లోపిస్తుంది. అంతేకాకుండా ఆ సీన్లు అతికించినట్టు అనిపిస్తాయి. పోలీస్ స్టేషన్ సీన్లను ఇంకాస్త బెటర్‌గా తీర్చిదిద్ది ఉంటే సినిమాకు మరింత బలం చేకూర్చేది. ఇక కామెడీ సీన్లు అక్కడక్కడా నవ్వులు తెప్పిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సస్పెన్స్‌ను రివీల్ చేస్తున్న సమయంలో వచ్చే కామెడీ బాగుంటుంది.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ బలం. హీరోహీరోయిన్ల లవ్ సీన్స్, కాకినాడ, అరకును సినిమాటోగ్రఫర్ చాలా అందంగా, రియలస్టిక్‌గా చూపించాడు. పాటలు సినిమా అవసరానికి తగ్గట్టు ఉంటాయి, ఆకట్టుకుంటాయి. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్‌లో సినిమాను చాలా రిచ్‌గా చూపించాడు. ఫైనల్‌గా స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కన్ఫ్యూజన్ చేసినా.. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ‘ఓ.. పిట్ట కథ’ చిత్రానికి వెళ్లి చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
సంజయ్, విశ్వాంత్‌ల నటన
నిత్యాశెట్టి అందం, అభినయం
మైనస్ పాయింట్స్
స్లో నెరేషన్
పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్
పలు సీన్లలో లోపించిన నాటకీయత
- సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment