‘‘చంద్రశేఖర్ యేలేటిగారి దర్శకత్వంలో ‘మనమంతా’ సినిమా చేశాను. ఆ తర్వాత నాకు సరైన కథ రాలేదు.. దీంతో యేలేటిగారితో ప్రయాణం మొదలుపెట్టాను. ఆ సమయంలో ‘ఓ పిట్టకథ’ సినిమా గురించి చెప్పి, కథ చాలా బాగుంది.. చేస్తావా? అని అడిగారు. ఆయన మీద నమ్మకంతో కథ వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నా’’ అన్నారు విశ్వంత్. ‘మనమంతా’, ‘తోలుబొమ్మలాట’ ఫేమ్ విశ్వంత్, సంజయ్ రావు హీరోలుగా, నిత్యా శెట్టి హీరోయిన్‌గా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా విశ్వంత్ మాట్లాడుతూ– ‘‘పిట్టకథ’ చిత్రంలో మూడు పాత్రలు ముఖ్యమైనవి. ముగ్గురికీ ఒక్కో పిట్టకథ ఉంటుంది. ఏ పాత్ర ఎలా చెబుతుందనేది వెండితెరపై చూడాల్సిందే. నేను ఇంతవరకు చేసిన పాత్రలు వేరు. ‘పిట్టకథ’లో చేసిన క్రిష్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి.. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశాను. ‘ఓ పిట్టకథ’ స్క్రీన్‌ప్లే నేపథ్యంలో సాగుతుంది. ఆ స్క్రీన్‌ప్లే గేమ్ కొరటాల శివగారికి, మా గురువు చంద్రశేఖర్‌గారికి నచ్చింది. ‘తెలుగులో ఇటువంటి స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా రావడం కొత్త. ‘పిట్టకథ’ అంటే చిన్నదికాదు.. పెద్ద కథ’ అన్నారు కొరటాల శివగారు. గ్రామీణ నేపథ్యంలో చేశాం కాబట్టి సింపుల్‌గా ‘పిట్టకథ’ అని టైటిల్ పెట్టాం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ నాకు మంచి పేరు తీసుకువచ్చాయి.. కానీ, వాణిజ్య పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇటీవల ‘కాదల్’ అని ఒక సినిమా చేశా.. అది నాకు కమర్షియల్ హిట్ ఇస్తుందనుకుంటున్నాను. ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment