ఆ కళ్లు విశ్వమంత విశాలంగా ఉంటాయి. కాని నాలుగు గోడలను దాటి ఏమీ చూడలేవు. ఆ పాదాలు అలల వేగంతో కదలుతుంటాయి. కాని గడప దాటి ఎరగవు. ఆ చీర చెంగు నీలి మబ్బు. కాని ఎండ పొడ కూడా తగలదు. ఆ గుండెల్లో పట్టలేనన్ని ఆశలు. కాని ఉచ్చ్వాస నిశ్వాసలకు కూడా రేషన్. మరి– ఆ అమ్మాయి రాజావారి కూతురు. మహల్లో కోకిల. కాదు కాదు పంజరంలో పక్షి. అప్పటికే ఆ జమిందారీ పరగణ దివాలా తీసింది. పెద్దలు చేసిన పాపాలకు తెంపరితనాలకు ఆస్తులు హరించుకుపోయాయి. అప్పులు... కోర్టు కేసులు. మిగిలింది ఆ పాతకాలపు బంగళా. తల మీద తాతల నాటి పరువు బరువు. అలాంటి మహల్లో ఆ అమ్మాయి ఒక్కత్తి. ఆమెకు తోడుగా అన్న.
అమ్మాయి భానుప్రియ. అన్న శరత్‌బాబు. ఊరి పెద్దల్లో మాత్రం ఇంకా ఆ కుటుంబం అంటే గౌరవం. మన్నన. గుట్టు బయట పడనందున ఇంకా మహల్లో దర్జాలూ వైభోగాలు ఉండే ఉంటాయని నమ్మకం. ఇలాంటి టైముకు ఊరికి ఉత్సవాలు వచ్చాయి. వాటి వెనుకనే ఒక పగటి వేషగాళ్ల బృందం వచ్చింది. సాక్షి రంగారావు, సుమన్, రాళ్లపల్లి, ధమ్.... వేడుకల్లో నాలుగు వేషాలు కట్టి నాలుగు డబ్బులు రెండు పాత బట్టలకు ఆశపడి వచ్చిన బక్క జీవులు. కాని వారిలో కూడా ఆత్మాభిమానం ఉన్న సుమన్ ఉన్నాడు. అందంతో కట్టి పడేసే అతడి రూపం వుంది. వేషం కడితే అందరూ నిలువు కాళ్లతో కాలాన్ని మరిచి చూసే ప్రతిభ ఉంది. ప్రతి రోజూ ఎవరు చూసినా చూడకపోయినా తొలి ప్రదర్శన మహలు ముందు ఆడాలని నియమం. అందరూ రోజూ మహల్ ప్రాంగణంలో ఆడుతుంటారు. కాని ఆ మహలు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. ఎవరూ వాటిని చూడరు. లోపలి నుంచి ఏ ఉలుకూ విందామన్నా ఎటువంటి పలుకూ ఉండవు. ఇలాంటి మహల్ ముందు ప్రదర్శన ఇవ్వడం కన్నా వల్లకాటి ముందు భిక్షాటన చేయడం నయం అనుకుంటాడు సుమన్. కాని ఆ సమయంలోనే అతడి కంటికి ఒక కన్ను కనిపిస్తుంది. మహల్ పైన పగిలిన కిటికీ అద్దం నుంచి తననే చూస్తున్న కన్ను. అందమైన కన్ను. ఆడపిల్ల కన్ను. అరె... ఎవరో చూస్తున్నారే.
అమ్మాయి గారేమో. అమ్మాయి గారే. సుమన్‌ను ఊపిరి వస్తుంది. ఉత్సాహం వస్తుంది. వెంటనే వెన్ను విల్లులా వంగి గొంతు నుంచి రాగం ఉబికి వస్తుంది. పరవశంగా ఆడతాడు. పరవశించి పాడతాడు. రోజూ వచ్చి ఆ మహల్ ముందు ప్రదర్శన ఇవ్వడమే అతడి పని. అతడికి తెలుసు. రోజూ అమ్మాయి తననే చూస్తుంది. పగిలిన అద్దం నుంచి. చేపట్టు పగుళ్ల నుంచి. రహస్య కంతల నుంచి. తుదకు దేవి కరుణిస్తుంది. మహల్ తలుపు తెరుచుకుంటుంది. సుమన్‌కు మహల్‌లో ప్రవేశం లభిస్తుంది. కాని అది మహల్ కాదని గత వైభవం తాలుకు ఒక అవశేషమని లోపలికి వెళ్లాక సుమన్‌కు అర్థమవుతుంది. అతడు ఆమెనూ ఆమెకు తన పట్ల ఉన్న ఆరాధననూ అర్థం చేసుకుంటాడు. ఆ రాజకుమారి తన హృదయానికి బానిస. తాను ఆమె మనసుకు బంటు. ఇంత కాలం ఒక మనిషి తోడు ఒక మగవాడి స్పర్శ ఎరగని భానుప్రియ సంపూర్ణంగా ఆ తొలిప్రేమలో ములిగిపోతుంది. కాని రాజరికం ఊరుకుంటుందా? ఒక పగటి వేషగాడికి తన ఇంటి ఆడపడుచును కట్టపెడుతుందా? సుమన్‌ను చంపమని శరత్‌బాబు మనుషుల్ని పురమాయిస్తాడు. మనుషులు అతణ్ణి చంపి గోదాట్లో శవాన్ని అదిమి పెడతారు. భానుప్రియ నెత్తి మీద పిడుగు పడినట్టవుతుంది. మనసు ఛిద్రం అయిపోతుంది. తన ప్రేమ ఇంతటి క్రూరమైన మలుపు తిరగడం తట్టుకోలేకపోతుంది. మరోవైపు కోర్టు కేసు ఓడిపోయిన శరత్‌బాబు శేష జీవితం బికారిగా గడపడం అవమానంగా భావించి చెల్లెలిని నిర్దాక్షిణ్యంగా వదిలి ఆత్మహత్య చేసుకుంటాడు.
ప్రేమించినవాడు చనిపోయి, సోదరుడు దూరమయ్యి భానుప్రియ పూర్తిగా ఒంటరిదవుతుంది. దిక్కుతోచనిదానిలా మద్రాసు చేరుకుంటుంది. అక్కడ శుభలేఖ సుధాకర్ వంటి ఒక మిత్రుడి పరిచయంతో పెద్ద హీరోయిన్ అవుతుంది. కాని ఆమె గతం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. అది ఒక్కసారిగా బయటపడి ప్రపంచానికి తెలిసి జనం ఆమె వెంట పడటం ప్రారంభిస్తారు. ఒక జమీందారు అమ్మాయి హీరోయిన్‌గా మారడం వింత. ఆమెకో ప్రేమ కథ ఉండటం ఇంకా ఆసక్తి. దీనంతటి నుంచి విసిగిపోయి భానుప్రియ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కాని సుమన్ చనిపోలేదని బతికే ఉన్నాడని తెలిసి అతడి రాకతో ఆమె మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. ప్రేమను నిలబెట్టుకుంటుంది.
1984లో విడుదలైన సినిమా ‘సితార’. పూర్ణోదయ బేనర్‌లో వచ్చిన క్లాసిక్ సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. దర్శకుడు వంశీకి, నటి భానుప్రియకు ఇది చాలా పేరు తెచ్చింది. తెలుగులో భానుప్రియకు ఇది తొలి చిత్రం. మనకు పరిచయం ఉన్న జమిందారు కథలు, గోదావరి వెంట ఉండే సంస్కృతి, భాష, మంచి పలుకుబడి, సంగీతం ఇవన్నీ సినిమాకు హానెస్టీని ఒరిజినాలిటీని తీసుకు వచ్చాయి. ముఖ్యంగా అసూరంపశ్య వంటి ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ప్రేమలో పడినప్పుడు కలిగే అలజడి, అస్థిమితత్వం, మైమరపు, ముగ్ధత్వం... ఇవన్నీ భానుప్రియ కళ్లలోని భావాలతో దర్శకుడు కృతకత్వపు ఫిల్టర్స్ లేకుండా చూపించడం మరీ ముఖ్యంగా ఆమె జీవితంలోని తొలి కౌగిలింత తాలుకు గాఢతను చూపడం ఇవన్నీ చాలా బాగుంటాయి. అయితే వీటికి తోడు రాళ్లపల్లి, ధమ్, మల్లికార్జునరావు వంటి వారి హాస్యాన్ని జత చేయడం కూడా దర్శకుడి ప్రావీణ్యమే.
లాంచీ మీద ప్యాసింజర్‌ని అర్ధరాత్రి నుంచి పీక్కు తింటున్న ధమ్‌ను ఉద్దేశించి ఆ ప్యాసింజరు ‘రేవెప్పుడొస్తుంది బాబూ’ అని అడగడం దానికి మనకు నవ్వు రావడం మర్చిపోలేము. పగటి వేషాలలో భాగంగా రాళ్లపల్లి ‘భేతాళుడు’ వేషం వేసి డప్పులతో దరువులతో ఊరిని హడలు గొడితే చంటి పిల్లలు జ్వరాన పడటం కూడా మంచి హాస్యమే. అసలు ఈ సినిమా మూగగా విడుదలయ్యి మూగగా రాలిపోవాల్సింది. ఇళయరాజా తన ఆర్.ఆర్‌తో దానికి ప్రాణం పోశాడు. ఆ ఆర్.ఆరే సన్నివేశాలను లేపి జీవంతో నిలబెట్టాయి. ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’, ‘కుకుకూ కోకిల రావే’, ‘కిన్నెర సాని వచ్చిందమ్మా’... ఈ పాటలన్నీ హిట్. కథను, కథా సంవిధానాన్ని, చెప్పే పద్ధతిని అర్థం చేసుకోవాలనుకోనేవారికి ఈ సినిమా మంచి సిలబస్ అని చెప్పవచ్చు. కొన్ని పాతబడవు. సితార కూడా. తెలుగు సినిమాల్లో నిలిచి మిణుకు మిణుకుమనే తార సితార.
వెన్నెల్లో గోదారి అందం
‘వెన్నెల్లో గోదారి అందం’ జానకి పాడిన ఈ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఎడిటింగ్‌లోనూ ఈ సినిమా జాతీయ అవార్డులు గెలుచుకుంది. అయితే రాష్ట్ర పురస్కారాలకు మాత్రం మరో మంచి సినిమా ‘ఆనందభైరవి’ అడ్డు నిలిచింది. ఈ సినిమాలో వంశీ చాలా కొత్త తరహా చిత్రీకరణలు చేశారు. ఉదాహరణకు ‘కుకుకూ.. కుకుకూ.. కోకిల రావే’ అనే పాటలో గ్రూప్ డాన్సర్స్ చేతులు మనోహరంగా కనిపిస్తుంటాయి. వాళ్ల ముఖాలు కనిపించవు. దాని కారణం షూటింగ్ రోజున కొంచెం వయసు మళ్లిన డాన్సర్స్ రావడమే. వాళ్లను స్క్రీన్ మీద చూపించడానికి ఇష్టపడక అప్పటికప్పుడు ఆలోచన చేసి చేతుల మీదగా వంశీ పాటను తీసి అద్భుతం అనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment