న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మార్దానీ-2 సినిమాపై రాజస్తాన్‌లోని కోటా వాసులు నిరసన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలతో తెరకెక్కిన సినిమాలో తమ పట్టణం పేరు ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న కోటా గురించి ఇలాంటి సీన్లు చిత్రీకరించి సిటీ వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చిత్ర బృందంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఓం బిర్లా మాట్లాడుతూ... సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‘ సినిమాలో పట్టణం పేరును ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదు. కల్పిత కథ కోటాలో జరిగిందని చెప్పడం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. ఇక ఓం బిర్లా కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం విదితమే.
కాగా 2014లో బాలీవుడ్ హిట్‌గా నిలిచిన ‘మర్దానీ’ సినిమాకు సీక్వెల్‌గా మార్దానీ-2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. యదార్థ ఘటనల ఆధారంగా కిరాతకమైన అత్యాచారాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇందులో శక్తిమంతమైన పోలీసు అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణీ ముఖర్జీ మరోసారి తన నటనా విశ్వరూపం ప్రదర్శించనున్నారు. అయితే పాశవిక అత్యాచారాలే ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలో పదే పదే కోటా పేరును ప్రస్తావిస్తాంచడం నిరసనకు కారణమైంది. కాగా మార్దానీ-2 ను డిసెంబర్ 13న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.(మర్దానీ 2 ట్రైలర్: ఒళ్లు గగుర్పొడిచే రేప్ సన్నివేశాలు..)
Comments
Please login to add a commentAdd a comment