Mardani
-
మర్దానీ-2: తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తాజాగా నటించిన చిత్రం మర్దానీ-2. డిసెంబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2014లో వచ్చిన ‘మర్దానీ’కి సీక్వెల్‌గా మార్దానీ-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. గోపి పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు సుమారు రూ. 5 నుంచి 6 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. అదేవిధంగా ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందన, విమర్శకుల సమీక్షలు పరిశీలిస్తే.. ఇక మీదట బాక్సాఫీసు వద్ద సందడి చేయనుందని చిత్రం బృందం భావిస్తోంది. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణి ముఖర్జీ నటించారు. రాణిముఖర్జీ 2018లో నటించిన హిచ్కి కూడా విడుదలైన మొదటి రోజు సుమారు రూ. 3.30 కోట్లు రాబట్టింది. రెండో రోజు నుంచి ఈ చిత్రం కలెక్షన్లు పెరుగుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోయింది. అదేవిధంగా మంచి స్పందన లభిస్తున్న మార్దానీ-2 కూడా కలెక్షన్లు వేగం పెరిగి బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ‘మర్దానీ 2’ లో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషించారు. -
ఆ మూవీపై లోక్‌సభ స్పీకర్ అభ్యంతరం!
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మార్దానీ-2 సినిమాపై రాజస్తాన్‌లోని కోటా వాసులు నిరసన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలతో తెరకెక్కిన సినిమాలో తమ పట్టణం పేరు ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న కోటా గురించి ఇలాంటి సీన్లు చిత్రీకరించి సిటీ వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చిత్ర బృందంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఓం బిర్లా మాట్లాడుతూ... సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‘ సినిమాలో పట్టణం పేరును ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదు. కల్పిత కథ కోటాలో జరిగిందని చెప్పడం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. ఇక ఓం బిర్లా కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం విదితమే. కాగా 2014లో బాలీవుడ్ హిట్‌గా నిలిచిన ‘మర్దానీ’ సినిమాకు సీక్వెల్‌గా మార్దానీ-2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. యదార్థ ఘటనల ఆధారంగా కిరాతకమైన అత్యాచారాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇందులో శక్తిమంతమైన పోలీసు అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణీ ముఖర్జీ మరోసారి తన నటనా విశ్వరూపం ప్రదర్శించనున్నారు. అయితే పాశవిక అత్యాచారాలే ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలో పదే పదే కోటా పేరును ప్రస్తావిస్తాంచడం నిరసనకు కారణమైంది. కాగా మార్దానీ-2 ను డిసెంబర్ 13న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.(మర్దానీ 2 ట్రైలర్: ఒళ్లు గగుర్పొడిచే రేప్ సన్నివేశాలు..) -
అయిగిరి నందిని నందిత మేదిని
చెడు మీద మంచి గెలిచిన ప్రతిసారీ ఆ గెలుపు వెనుక ఉండే శక్తి.. స్త్రీ!దేశమంతా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో రోజుకో అలంకారాలతో స్త్రీ శక్తిని కొలుస్తూ ఉన్న ఈ సమయంలో.. సరిగ్గా నవరాత్రులు ఆరంభమైన 29వ తేదీన బాలీవుడ్ ఒక శక్తిని టీజర్ ద్వారా సాక్షాత్కరింపజేసింది! ఆ శక్తి.. రాణీ ముఖర్జీ.ఆ సినిమా.. మర్దానీ 2. ఆ టీజర్.. ‘అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే..’ స్తోత్రానికి సరిగ్గా సరిపోయే దృశ్యరూపం. 38 సెకన్ల ఆ టీజర్లో పోలీస్ ఆఫీసర్ రాణీ ముఖర్జీ బెల్టు తీసి బాదిపడేసే సన్నివేశం చూస్తే ఈవిల్ డెడ్డే..! చెడు చచ్చిందే.శివానీ శివాజీ రాయ్ ఆమె పేరు. అమ్మాయిల్ని వెంటాడేవాళ్ల మోకాళ్లలో బులెట్లు దింపుతుంది.అమ్మాయిల్ని వేటాడే కళ్లను వేళ్లతో పైకి పెకిలిస్తుంది. ఇంత కోపం ఏంటి! ఇంత నిర్దయ ఏంటి! ఇంత క్రౌర్యం ఏంటి! దేవుడంటే కూడా భయం లేదా! భయమా?! దుర్గామాతకు భయం ఉంటుందా?! టీజర్ ఎలా మొదలైందో చూడండి. పోలీస్ ఆఫీసర్స్ టీమ్ గన్స్‌తో అలర్ట్ అయింది. ఎవర్నో షూట్ చేయాలి. ఎవర్నో కాదు. అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా వెనుక ఉన్న దుష్టశక్తిని. ఎవరా దుష్టశక్తి! ఒకడే ఉంటాడా? మాఫియా లీడర్, పొలిటికల్ లీడర్, డిపార్ట్మెంట్లోనే ఒక పోలీస్ లీడర్.. అందరూ కలిసిన దుష్టశక్తి. ఆ దుష్టశక్తిని వెంటాడుతూ ఎన్‌కౌంటర్‌కు సిద్ధమైంది దుర్గా శక్తి.ముందు టీమ్. వెనుకే రాణీ ముఖర్జీ.‘‘ఇప్పుడు తాకండ్రా ఒక్క అమ్మాయినైనా’’..!ఆమె ఆగేట్లు లేదు.‘‘ఒంటికి ఒంటిని తాకిచ్చారు కదా. ఇప్పుడు నేను తాకిస్తా మీ ఒంటికి నా ఒంటిని. ఎలా ఉంటుందో చూద్దురు. చెప్పుకోడానికి కూడా మీకు మీ వయసెంతో గుర్తుకు రాదు’’ ఆమె ఆగేట్లు లేదు. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. నడుముకు ఉన్న తోలు బెల్టుతో తోలు తీస్తోంది. వాడిలో కదలిక ఉందో చచ్చిందో తెలీదు. రాణీ ముఖర్జీలోని ల్టు మాత్రం కదులుతూనే ఉంది.టీజర్ ఎండ్. సినిమా డిసెంబర్ 13న రిలీజ్ అవుతోంది. 2014లో వచ్చిన వణుకు పుట్టించే (నేరస్తులకు లెండి) యాక్షన్ థ్రిల్లర్ ‘మర్దానీ’కి ఇది సీక్వెల్. ‘మార్దానీ 2’. రాణీ ముఖర్జీ అందులోనూ పోలీస్ ఆఫీసరే, ఇందులోనూ పోలీస్ ఆఫీసరే. అందులో ట్రాఫికింగ్, డ్రగ్స్ మీద.. ఇందులో అమ్మాయిల మీద చెయ్యేసిన వాళ్ల మీద. కన్నేసిన వాళ్ల మీద. మర్దానీ అంటే ‘మగతనం’ అని అర్థం. నిజంగా మగతనం ఉన్న మగాడెవడూ ఆడపిల్లల్ని అల్లరి పెట్టడు. అమ్మాయిల్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడు. రాణీ ముఖర్జీలో కనిపించే మర్దానీ అలాంటి మగాళ్లకొక సమాధానం. ఒక సవాల్. టీజర్లో రాణీ మాటలు వినిపించవు. యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమాలో రాణి 21 ఏళ్ల విలన్‌తో తలపడుతుంది. ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్’ సంస్థ దీనిని నిర్మిస్తోంది.పోకిరీలకు భయం ఉండాలంటే.. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఒక మహిషాసుర మర్దిని ఉండాలి. -
శివానీ శివాజీ రిటర్న్స్
ఐదేళ్ల క్రితం ‘మర్దానీ’ చిత్రంలో శివానీ శివాజీ రాయ్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు రాణీ ముఖర్జీ. మంచి హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారు. ‘మర్దానీ 2’ కోసం మరోసారి శివానీ శివాజీ రాయ్ క్యారెక్టర్లోకి తిరిగొచ్చారు రాణీ. పోలీస్ ఫ్రాంచైజ్ సినిమాల్లో ఎక్కువ హీరోలే కనిపిస్తుంటారు. కానీ లేడీ ఓరియంటెడ్ పోలీస్ ఫ్రాంచైజ్ సినిమాతో ‘మర్దానీ 2’ కూడా ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది. ఈ సీక్వెల్లో రాణీ లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు చిత్రబృందం. మొదటి భాగానికి రచయితగా పని చేసిన గోపీ పుత్రన్ ఈ సీక్వెల్ ద్వారా దర్శకుడిగా మారారు. ‘‘ఫ్రాంచైజ్ సినిమాలు చేయడం తొలిసారి. అలానే మళ్లీ శివానీ పాత్ర చేయడం మంచి ఎక్స్పీరియన్స్’’ అని పేర్కొన్నారు రాణీ. -
ఆన్ డ్యూటీ
నాలుగేళ్ల తర్వాత శివానీ శివాజీ రాయ్ పోలీస్ ఆఫీసర్‌గా మళ్లీ చార్జ్ తీసుకున్నారు. డ్యూటీ మొదలు పెట్టారు. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ఫిల్మ్స్ నిర్మాణంలో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మర్దాని’(2014). ఇటీవల ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు యశ్‌రాజ్ సంస్థ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాణీ ముఖర్జీనే హీరోయిన్గా నటిస్తారు. అయితే ‘మర్దాని’ చిత్రానికి రచయితగా పనిచేసిన గోపీ పుత్రన్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తొలుత నైట్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘మర్దాని’ చిత్రం చైల్డ్ హ్యూమన్ ట్రాఫిక్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సీక్వెల్లో మరో కొత్త పాయింట్‌ను టచ్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. -
ఊహించినట్లే జరిగింది..!
న్యూఢిల్లీ: ‘నేను అనుకున్నంతా అయ్యింది.. ‘మర్దానీ’ సినిమా చేసినప్పుడు నా పాత్రను చూసి అమ్మాయిలందరూ నన్ను ద్వేషిస్తారని భావించా.. సినిమా విడుదలయ్యాక నేను ఊహించినట్లే జరిగింది..’ అని మర్దానీ సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఢిల్లీ వాసి తాహిర్ రాజ్ బాసిన్ తెలిపాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ టైటిల్ పాత్ర పోషించింది. ఇందులో ఆమె పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా నటించగా అమ్మాయిల అక్రమ రవాణా వ్యాపారం చేసే దుర్మార్గమైన వ్యక్తిగా 27 యేళ్ల తాహిర్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ సంపాదించింది. దీనిపై తాహిర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ ఈ సినిమా చేసేటప్పుడు నా పాత్ర స్వభావం చూసి అమ్మాయిలు నన్ను అసహ్యించుకుంటారని భావించా.. అయితే అమ్మాయిలు అందులో నా స్టైల్‌ను మాత్రం ఇష్టపడ్డారు..’ అని అన్నాడు. ఈ సినిమాలో చాలా బాగున్నానని సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ట్విటర్లో ట్వీట్ చేయడం నాకు అవార్డు వచ్చినంత ఆనందం ఇచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలో నటించేందుకు మొదట చాలా ఇబ్బంది పడ్డానని ఆయన అన్నాడు. ప్రధాన పాత్రలో సీనియర్ నటి రాణీ ముఖర్జీ నటిస్తుండటంతో ఆమెతో స్క్రీన్‌ను పంచుకోవడానికి కొంచెం తడబడ్డానని తెలిపాడు. ఆమె సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆమెతోనే నటించడమనేసరికి ఒకరకమైన ఒణుకు వచ్చిందని నవ్వుతూ చెప్పాడు. అయితే రాణి మాత్రం తనకు అన్నివిధాల మద్దతు ఇచ్చిందని, తనను కొత్త నటుడుడి చూడలేదని దాంతో త్వరలోనే మామూలుగానే నటించగలిగానని తాహిర్ అన్నాడు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో పాత్ర సంపాదించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని తాహిర్ వివరించాడు. నాలుగేళ్లుగా తాను ముంబైలో ఉంటూ సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నానని, అందులో భాగంగా రెండేళ్ల కిందట యశ్‌రాజ్ ఫిల్మ్స్ కాస్టింగ్ డెరైక్టర్ షనూ శర్మను కలిసి తన ఫొటోలు చూపించానన్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాలో అవకాశం కోసం స్క్రీన్ టెస్ట్‌కు రావాలని ఆమెనుంచి ఆహ్వానం అందిందని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి అప్పటికే సుమారు 200 మందికిపైగా లైన్లో ఉన్నారని వివరించాడు.. చివరికి ఆ పాత్ర తనను వరించడం ఆనందంగా ఉందన్నాడు. బాలీవుడ్లో విలన్ పాత్రతో కెరీర్‌ను ప్రారంభించడంపై ఆయన మాట్లాడుతూ.. దానిపై తనకు ఎటువంటి బాధ లేదన్నాడు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న విలన్ పాత్రధారులెవరూ నేను చేసిన పాత్రను చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అంత నీచమైన నేరప్రవృత్తిగల ఒక శాడిస్టు పాత్ర కాబట్టే నటించడానికి చాలా అవకాశం లభించింది. మున్ముందు కూడా ఇలాంటి పాత్రలొస్తే చాలెంజ్‌గా తీసుకుని నటిస్తాను..’ అని ముక్తాయించాడు.