జైతో మరోసారి ..
యువ నటుడు జై, నటి అంజిలిలది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి నటించిన ఎంగేయమ్ ఎప్పోదుమ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో జై, అంజిలి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందనే ప్రశంశలు అందుకున్నారు. అంతే కాదు అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం 2011లో తెర పైకి వచ్చింది. ఐదేళ్ల తరువాత జై, అంజిలి కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా వార్త. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రముఖ నటిగా రాణిస్తున్న అంజలి ఇటీవల నటించిన ఇరైవి చిత్రంలో నటనకు మంచి పేరే సంపాదించుకున్నారన్నది గమనార్హం. ఈ క్రేజ్ చాలా కాలం తరువాత జైతో నటించనున్న తాజా చిత్రానికి లాభిస్తుందని చెప్పవచ్చు. ఈ చిత్రం ద్వారా సినీష్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ జై, అంజలి జంట గా ఒక రొమాంటిక్ లవ్, హారర్ థ్రిల్లర్ కథను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలితో నటించి మెప్పించగల సత్తా ఉన్న అంజిలి తమ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందన్నారు. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో అంజలి అయితేనే బాగుంటుందని తమ యూనిట్ మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని, ఈ విషయాన్ని తన పుట్టిన రోజు గురువారం వెల్లడించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ఆర్.శరవణన్ చాయాగ్రహణం, ఫైట్స్‌ను దిలీప్ సుబ్బరాయన్ అందిస్తున్నారని తెలిపారు.