
ఒక్క రోజు కథ
ఒక్క రోజులో జరిగే కథ ఇతివృత్తంగా రింగారం అనే చిత్రం తెరకెక్కుతోంది. జె.స్టూడియో ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో బాలా హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా కంగారు చిత్రం ఫేమ్ ప్రియాంక నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలో కళాభవన్ మణి, ఆడుగళం వి.ఎస్.ఐ జయబాలన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు శివకార్తిక్ పరిచయం అవుతున్నారు. ఈయన కె.బాలచందర్, ఆయన శిష్యుడు సి.జె.భాస్కర్, సముద్రకనిల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. రింగారం చిత్ర వివాదాలను దర్శకుడు తెలుపుతూ ఇది ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథా చిత్రం అని తెలిపారు. ఒక్క రోజులో జరిగే సంఘటనల సమాహారమే చిత్రం అని పేర్కొన్నారు.
ఒకరి వల్ల మరొకరు ఎదుర్కొనే ప్రతిఘటన కారణంగా ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందన్నది ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు చెప్పారు. ఒక షాపింగ్ మాల్‌లో పని చేసే హీరోయిన్ మంచి వ్యక్తిత్వం గల హీరోపై మనసు పారేసుకుంటుంది. ఆమె తడ్రి క్వారీ యజమాని పూర్తిగా స్వార్థపరుడు. తనకు మంచి జరుగుతుందంటే ఇతరుల గురించి ఏ మాత్రం ఆలోచించని మనస్తత్వం గల వ్యక్తి. నాలుగో వ్యక్తి సైనికుడు. ఇతన్ని దారిద్య్రం వెంటాడుతున్నా చేతిలో తుపాకీని వదలడు. ఈ నలుగురి చుట్టూ తిరిగే కథే రింగారం అని దర్శకుడు వివరించారు. అలీ మిర్జా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఇలియానా హారిష్ చాయాగ్రహణం నెరపుతున్నారు.