ఇక్కడ కమల్... అక్కడ అక్షయ్‌కుమార్?
ఒప్పమ్... తెలుగులో ఎక్కడా ఇలాంటి పదం విన్నట్లు లేదే అనుకుంటున్నారు కదూ. ఇది మలయాళ పదం. అంటే... కలిసి ఉండటం అని అర్థం. ఇటీవల మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ ఇది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రం తమిళ పరిశ్రమవారినీ ఆకట్టుకుంది. ఆ నోటా ఈ నోటా ఈ సినిమా గురించి విని, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ఒప్పమ్’ని చూశారు. చిత్రబృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాత కమల్‌హాసన్ కూడా ఈ చిత్రాన్ని తిలకించారు.
ఫుల్‌గా ఇంప్రెస్ అయ్యారట. ఆ మధ్య ప్రమాదానికి గురై, ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్నారు కమల్. ఈ కారణంగా ఆయన నటించి, దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రం షూటింగ్‌కి చిన్న బ్రేక్ పడింది. నవంబర్‌లో పునః ప్రారంభించనున్నారు. ఈలోపు ఇంట్లో స్క్రిప్ట్‌లు గురించి ఆలోచించడంతో పాటు సినిమాలు కూడా చూస్తున్నారాయన. ‘ఒప్పమ్’ కథ, అందులో మోహన్‌లాల్ చేసిన అంధుడి పాత్ర బాగా నచ్చి, ఈ చిత్రం తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు-నటుడు సముద్రఖని నర్మగర్భంగా బయటపెట్టారు.
మలయాళ ‘ఒప్పమ్’లో ఆయన విలన్‌గా నటించారు. ‘‘ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్‌గారు నటిస్తారని విన్నాను. చాలా సంతోషం’’ అని సముద్రఖని పేర్కొన్నారు. విలక్షణమైన పాత్రలు పోషించే కమల్ అంధుడిగా ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు ‘రాజ పార్వై’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్ నటన అద్భుతం. ‘రాజ పార్వై’ విడుదలై 35 ఏళ్లయింది. కమల్ నటనలో వాడి వేడి ఏ మాత్రం తగ్గలేదు. సో.. ‘ఒప్పమ్’లో అంధుడిగా జీవిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అక్షయ్ దృష్టి కూడా...
రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘2.0’లో ప్రతినాయకుడిగా నటిస్తున్న హిందీ హీరో అక్షయ్‌కుమార్ దృష్టి కూడా ‘ఒప్పమ్’పై పడిందట. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఆయన దక్కించుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్‌కీ, అక్షయ్‌కీ మధ్య మంచి స్నేహం ఉంది. అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో ‘హేరా ఫేరీ’, ‘గరమ్ మసాలా’, ‘భాగమ్ భాగ్’, ‘భూల్ భులయ్యా’, ‘కట్టా మీఠా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రియదర్శన్. ఒకవేళ అక్షయ్ చేస్తే.. హిందీ వెర్షన్‌కి కూడా ప్రియదర్శనే దర్శకత్వం వహించే అవకాశం ఉందని వినికిడి.