ఆభరణాల విలువ 53 కోట్లు!
‘మ్యాడ్ మాక్స్ ద ఫ్యూరీ రోడ్’ చిత్రానికిగాను ఉత్తమ ఎడిటర్‌గా అవార్డు గెల్చుకున్న ‘మార్గరెట్ సిక్సెల్’కు ప్రియాంకా చోప్రా అవార్డు ప్రదానం చేశారు. తెలుపు రంగు గౌను, వజ్రాలు పొదిగిన చెవి దుద్దులు, బిగించి కట్టిన జుత్తు, తక్కువ మేకప్‌తో ప్రియాంక చాలా క్యూట్‌గా కనిపించారు. రెడ్ కార్పెట్‌పై క్యాట్ వాక్ చేసినప్పుడూ, వేదిక మీదకు వెళుతున్న సమయంలోనూ ఆమెలో తడబాటు కనిపించలేదు. విజేతను వేదిక పైకి ఆహ్వానిస్తున్నప్పుడు మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. మొత్తానికి మన దేశీ గాళ్ విదేశీయులతో భేష్ అనిపించేసుకున్నారు. ఇక.. ప్రియాంక ధరించిన గౌను, పెట్టుకున్న ఆభరణాల గురించి చెప్పాలంటే...
మూడు ఉంగరాల్లో ఒకదాని ఖరీదు 23 కోట్లు, మరోటి 6 కోట్లు, ఇంకోటి 2 కోట్లు. చెవిదుద్దుల ఖరీదు 22 కోట్ల రూపాయలట. మొత్తం 53 కోట్ల విలువైన డైమండ్ జ్యువెలరీలో ప్రియాంక ధగాధగా మెరిసిపోయారు. ప్రతిష్ఠాత్మక అవార్డు వేడుక కాబట్టి, ప్రియాంక ఆ రేంజ్‌లో వెళ్లి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జుహైర్ మురాద్ ఆమె గౌనుని డిజైన్ చేశారు. పైకి బాగానే కనిపించినా అవార్డు ఇస్తున్న సమయంలో కొంచెం నెర్వస్ అయ్యానని ప్రియాంక పేర్కొన్నారు.